తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నోబెల్​ను ముద్దాడిన శాంతి దూతలు, శాస్త్ర స్రష్టలు - అజాదీ కా అమృత్ మహోత్సవ్​

శాస్త్ర సాంకేతిక, సాహిత్యాది రంగాల్లో అసమాన ప్రతిభ చూపి ప్రపంచ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా పది మంది భారతీయులు నోబెల్​ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా వారిని ఓ సారి స్మరించుకుందాం

nobel prize winners in india
nobel prize winners in india

By

Published : Aug 15, 2022, 9:53 AM IST

స్వాతంత్య్రానికి పూర్వమే రవీంద్రుడు, రామన్‌ నోబెల్‌ పురస్కారాలకు బాటలు వేస్తే.. స్వాతంత్య్రానంతరం మరికొందరు ఆ దారిలో నడిచారు. శాస్త్ర సాంకేతిక, సాహిత్యాది రంగాల్లో అసమాన ప్రతిభ చూపి ప్రపంచ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. మొత్తంగా పదిమంది భారతీయులు నోబెల్‌ సొంతం చేసుకున్నారు. వీరిలో కొందరు భారత మూలాలున్న వేరే దేశాల పౌరులూ ఉన్నారు.

సాహిత్యంతో తొలి అడుగు:జాతి మొత్తం ఒక్క గొంతుతో పాడుతున్న 'జనగణమన'ను మన దేశానికి అందించడమే కాదు.. బంగ్లాదేశ్‌కూ జాతీయగీతాన్ని రాసిన గురుదేవుడు.. రవీంద్రనాథ్‌ ఠాకుర్‌. పాశ్చాత్యులకు మాత్రమే సొంతమనుకొనే ఆంగ్లభాషలోనూ అపారమైన పట్టుసాధించి ఆ భాషలో 'అత్యంత సున్నితంగా, అందంగా, కవితాత్మక భావాలతో అభివ్యక్తీకరించార'ంటూ నోబెల్‌ కమిటీ ప్రస్తుతించిన గీతాంజలి రచయిత ఆయన. 1913లో తొలిసారిగా సాహిత్య రంగంలో నోబెల్‌ బహుమతి సాధించారు

కాంతిపుంజంలా దూసుకొచ్చిన రామన్‌:నీళ్లకు రంగు లేనప్పుడు సముద్రం నీలంగా ఎందుకు ఉంటుందన్న ఆలోచన నుంచి కాంతి పరిక్షేపణ సిద్ధాంతాన్ని రూపొందించారు సర్‌ చంద్రశేఖర్‌ వెంకట రామన్‌. మద్రాసు రాష్ట్రంలోని తిరువనైకోయిల్‌లో పుట్టిన ఆయన ప్రతిపాదించిన రామన్‌ ఎఫెక్ట్‌కు భౌతికశాస్త్రంలో 1930లో నోబెల్‌ బహుమతి వరించింది. వక్రీభవనం చెందే కాంతికిరణాల తరంగదైర్ఘ్యంలో వచ్చే మార్పును వివరించే సిద్ధాంతాన్ని రూపొందించారాయన.

అర్థశాస్త్రంలో రెండు పురస్కారాలు:భారతదేశానికి అర్థశాస్త్రంలో మొదటి నోబెల్‌ బహుమతిని అందించారు అమర్త్యసేన్‌. సంక్షేమ ఆర్థికంలో ఆయన చేసిన కృషికే ఈ గౌరవం అందిస్తున్నట్లు నోబెల్‌ కమిటీ ప్రస్తుతించింది. రవీంద్రుడి శాంతినికేతనంలోనే జన్మించిన అమర్త్యుడు సంక్షేమ ఆర్థికం, పేదరికానికి కారణాలు, ఆర్థికాభివృద్ధి రంగాల్లో పరిశోధనలు చేశారు. ఈ రంగంలో ఆయన చేసిన సేవలకు 1998లో నోబెల్‌ బహుమతి వరించింది.

ముంబయిలో జన్మించిన అభిజీత్‌ వినాయక్‌ బెనర్జీకి 2019లో అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి వచ్చింది. ప్రపంచ పేదరికంతో పోరాడేందుకు మన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచగలిగేలా వీరు పరిశోధన చేశారని నోబెల్‌ కమిటీ ప్రస్తుతించింది.

రవీంద్రుని బాటలోనే..:వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌ టొబాగోలో భారతీయ కుటుంబంలో జన్మించిన విద్యాధర్‌ సూరజ్‌ ప్రసాద్‌ నైపాల్‌... సాహిత్యంలో చెరగని ముద్ర వేసి, ఠాకుర్‌ తర్వాత ఈ రంగంలో నోబెల్‌ బహుమతి పొందారు. ఆయన తాతల కాలంలోనే చెరకు తోటల్లో పనిచేసేందుకు భారతదేశం నుంచి వెస్టిండీస్‌కు వాళ్ల కుటుంబం వలస వెళ్లింది. హాస్యంతో పాటు విస్తృత ప్రపంచంలో పరాయీకరణ, జీవితం, ప్రయాణాల గురించి 30కి పైగా పుస్తకాలు రాశారు.

తారకల పుట్టుకను చెప్పి..:ఆరుబయట వెన్నెల్లో పడుకున్నప్పుడు ఆకాశంలో కనిపించే నక్షత్రాలు ఎలా రూపొందాయి, వాటి నిర్మాణ తీరు ఎలా ఉంటుంది, వాటి భౌతిక లక్షణాలేంటి అనే లోకానికి తెలియజెప్పింది.. భారతీయ మూలాలున్న భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌. సర్‌ సీవీ రామన్‌కు స్వయానా మేనల్లుడు. తన భార్య లలితతో కలిసి 1953లో అమెరికా పౌరసత్వం పొందిన చంద్రశేఖర్‌... విలియం ఎ.ఫ్లవర్‌ అనే మరో శాస్త్రవేత్తతో కలిసి సంయుక్తంగా 1983లో భౌతికశాస్త్ర నోబెల్‌ బహుమతి పొందారు.

జన్యువుల గుట్టువిప్పిన ఖొరానా:కణాల జన్యుకోడ్‌ను సమగ్రంగా వివరించి.. ఆధునిక బయోటెక్నాలజీకి ప్రాణం పోసిన వైద్యశాస్త్రవేత్త హరగోవింద్‌ ఖొరానా. అవిభాజ్య పంజాబ్‌లోని రాయ్‌పుర్‌లో 1922లో పుట్టిన ఆయన, 44 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం పొంది, తర్వాత రెండేళ్లకే వైద్యశాస్త్రంలో నోబెల్‌ బహుమతి సాధించారు. ఆయనతోపాటు రాబర్ట్‌ డబ్ల్యు హోలీ, మార్షల్‌ నిరేన్‌బర్గ్‌లకు సంయుక్తంగా ఈ బహుమతిని 1968లో ప్రకటించారు. ప్రోటీన్‌ సంయోగంలో జన్యుకోడ్‌ పాత్రను విశ్లేషించినందుకు వారికీ గౌరవం దక్కింది.

సేవామూర్తి.. ఎందరికో స్ఫూర్తి:కలకత్తా నగర వీధుల్లో అనాథలు, అభాగ్యులు, ఆకలిగొన్నవారిని వెతికి మరీ సాయం చేశారామె. మురికివాడల్లో మగ్గుతున్నవారికి అండగా నిలిచారు. మాసిడోనియాలో పుట్టిన మదర్‌ థెరిసా భారతీయుల 'అమ్మ'గా కీర్తి గడించారు. 19 ఏళ్ల వయసులోనే ఇండియాకు వచ్చి, ఇక్కడి పౌరసత్వాన్ని స్వీకరించి, మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీని స్థాపించారు. తిండిలేక ప్రాణాలు పోతున్న అభాగ్యుల పాలిట దేవతగా నిలిచిన ఆమెను 1979లో నోబెల్‌ శాంతిబహుమతి వరించింది.

బాలల బంధువు.. సత్యార్థి:పిల్లలందరికీ విద్య అందడం హక్కుగా మారాలన్న సదుద్దేశంతో.. బాలల అణచివేతకు వ్యతిరేకంగా కైలాష్‌ సత్యార్థి ప్రారంభించిన పోరు ఆయనకు నోబెల్‌ శాంతిబహుమతిని అందించింది. పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్‌తో కలిసి సంయుక్తంగా 2014లో ఆయనీ గౌరవాన్ని పొందారు. మధ్యప్రదేశ్‌లోని విదిశలో జన్మించిన ఆయన.. 1980లో బచ్‌పన్‌ బచావో ఆందోళన అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి బాలల హక్కుల కోసం పోరు ప్రారంభించారు. బాలకార్మికవ్యవస్థపై తనదైన శైలిలో ఆయన పోరాడారు. యునెస్కో సైతం ఈ పోరులో ఆయనతో చేతులు కలిపింది.

రైబోజోమ్‌ పనితీరుకు పురస్కారం:వెంకటరామన్‌ రామకృష్ణన్‌ రైబోజోముల నిర్మాణం, వాటి పనితీరు గురించి చేసిన పరిశోధనలకు 2009లో రసాయనశాస్త్రంలో థామస్‌ ఎ.స్టీట్జ్‌, అడా ఇ.యోనాథ్‌లతో కలిసి నోబెల్‌ బహుమతి అందుకున్నారు. తమిళనాడులోని చిదంబరంలో 1952లో పుట్టిన ఆయన.. తర్వాత ఇంగ్లండ్‌, అమెరికా దేశాల పౌరసత్వం స్వీకరించారు.

ఇవీ చదవండి:చరిత్రగతి మార్చిన ఉద్యమం, గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్ర్యం

పరిఢవిల్లిన పరిశోధన.. భవిష్యత్‌ టెక్నాలజీల దిశగా భారత్‌ పరుగులు

ABOUT THE AUTHOR

...view details