తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇది అదృష్టంతో మన ఒప్పందం అంటూ నెహ్రూ తొలి ప్రసంగం - nehru independence speech

అర్ధరాత్రి వేళ.. ఆంగ్లేయుల్ని పారదోలి.. అధికారం చేపట్టిన శుభక్షణాన ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన తొలి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

nehru independence day speech
ఇది అదృష్టంతో మన ఒప్పందం అంటూ ఆ సభలో నెహ్రూ తొలి ప్రసంగం

By

Published : Aug 15, 2022, 1:09 PM IST

చాలా ఏళ్ల క్రితం.. అదృష్టంతో మనమో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు మన ప్రతిజ్ఞను మరింత దృఢంగా నెరవేర్చాలి. ఈ అర్ధరాత్రివేళ ప్రపంచమంతా నిదురిస్తుంటే, భరతజాతి స్వేచ్ఛావాయువులతో మేలుకొంటుంది. పాత నుంచి కొత్తలోకి అడుగుపెడుతున్నప్పుడు, ఒక తరం ముగిసినప్పుడు, సుదీర్ఘకాలం అణచివేతకు గురైన ఒక జాతి ఆత్మ ఊరట పొందినప్పుడు.. అలాంటి తరుణం చరిత్రలో చాలా అరుదుగా వస్తుంది. ఈ క్షణంలో మనం భరతమాత, ఆమె బిడ్డల సేవకు నిబద్ధులమై ఉంటామని, మానవాళి విశాల ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి. చరిత్రలో ఈ సూర్యాస్తమయాన భారతదేశం తన అనంతాన్వేషణను ప్రారంభించింది. ఎత్తుపల్లాలు ఎన్ని ఎదురైనా ఈ దేశం తన అన్వేషణా దృష్టిని కోల్పోలేదు, తనకు బలాన్నిచ్చిన సిద్ధాంతాలను వీడలేదు. ఇన్నాళ్ల దురదృష్టాన్ని ఈ రోజుతో ముగించాం. ఈరోజు మనం సాధించినది ఒక ముందడుగు మాత్రమే కాదు.. సరికొత్త అవకాశాల ప్రారంభం. మనకోసం ఉన్నత విజయాలు వేచి చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, భావి సవాళ్లను అంగీకరించడానికి తగినంత ధైర్యంతో, తెలివితో మనమున్నామా?

స్వాతంత్య్రం, అధికారం మనకు బాధ్యతను తీసుకొస్తాయి. ఆ బాధ్యత ఈ అసెంబ్లీమీదే ఉంటుంది. ఇది భారతదేశపు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సార్వభౌమ సంస్థ. స్వాతంత్య్ర భారత జననానికి ముందు మనం అన్ని నొప్పులూ భరించాం, మన గుండెలు ఈ బాధామయ జ్ఞాపకాలతో బరువెక్కాయి. ఈ నొప్పుల్లో కొన్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆ గతం గడిచిపోయింది, బంగారు భవిష్యత్తు మనముందుంది.

భారతదేశానికి సేవ చేయడం అంటే ఇన్నాళ్లూ బాధల్లో ఉన్న లక్షలమందికి సేవ చేయడమే. అంటే పేదరికాన్ని, అజ్ఞానాన్ని, వ్యాధులను, అసమానతలను అంతం చేయడం. ప్రతి ఒక్క కంటినుంచి కారే ప్రతి కన్నీటిబొట్టును తుడవాలన్నదే ఈ తరంలో అత్యంత గొప్పవాడి ఆకాంక్ష కావాలి. కష్టాలు, కన్నీళ్లు ఉన్నన్నాళ్లు మన పని ఇంకా పూర్తికానట్లే. మన కలలకు వాస్తవరూపం ఇవ్వడానికి మరింత కష్టపడి పనిచేయాలి. ఈ కలలు భారతదేశం కోసమే కాదు.. యావత్‌ ప్రపంచం కోసం, అందులోని ప్రతి దేశం కోసం ఉండాలి. శాంతి, స్వాతంత్య్రం, సౌభాగ్యం.. ఇవన్నీ అవిభాజ్యాలే. ఈ ప్రపంచాన్ని ఇక చిన్నముక్కలుగా విడగొట్టలేం. భారతీయులంతా మాపై విశ్వాసం ఉంచి ఈ గొప్ప సాహసకార్యంలో మాతో కలిసిరావాలని వాళ్ల ప్రతినిధులుగా కోరుతున్నాం. విధ్వంసక విమర్శలకు ఇది సమయం కాదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే తరుణం కాదు. దేశమాత బిడ్డలంతా నివసించేలా స్వేచ్ఛాభారతాన్ని మనం నిర్మించాలి.

సుదీర్ఘపోరాటం తర్వాత మనకు ఈ స్వాతంత్య్రం లభించింది. ఇప్పుడు సరికొత్త చరిత్ర మొదలవుతోంది. ఇందులోనే మనం జీవించాలి, పనిచేయాలి. ఇది కేవలం భారతదేశంలోని మనకే కాదు.. ఆసియాకు, యావత్‌ ప్రపంచానికీ ఒక ముఖ్యమైన క్షణం. ఒక కొత్తతార ఉదయిస్తోంది. ఒక సరికొత్త ఆశ మొదలైంది. సుదీర్ఘకాలంగా కలగా ఉన్నది వాస్తవమైంది. ఈ తార ఎన్నడూ అస్తమించకూడదు, మరెన్నడూ వెన్నుపోటుకు గురికాకూడదని ఆశిద్దాం!

రాజకీయ సరిహద్దుల వల్ల మన నుంచి విడిపోయిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల గురించి కూడా మనం ఆలోచించాలి. వాళ్లు ఈ స్వాతంత్య్రాన్ని మనతో పంచుకోలేరు. ఇప్పటికీ ఏం జరిగినా, వాళ్లు మనవాళ్లే. వాళ్ల మంచి చెడులను మనమూ పంచుకోవాలి.
ప్రపంచంలో అన్ని దేశాలకు, వాటి ప్రజలకు శుభాకాంక్షలు పంపుదాం. శాంతి, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాలను బలోపేతం చేయడంలో వారికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. మనమెంతో ప్రేమించే మన మాతృభూమి భారతదేశానికి సదా కృతజ్ఞులమై ఉండి, తన సేవకు నిత్యనూతనంగా కట్టుబడి ఉందాం.

ఉన్నత ప్రమాణాలతో జీవిద్దాం
సామాన్యులకు, రైతులకు, కార్మికులకు కూడా స్వాతంత్య్రం, సమానావకాశాలు అందాలి. పేదరికాన్ని, అజ్ఞానాన్ని, వ్యాధులను అంతం చేయడానికి పోరాడాలి. సుసంపన్న, ప్రజాస్వామ్య, పురోగామి దేశాన్ని నిర్మించుకోవాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్థలను ఏర్పాటుచేసుకుని, ప్రతి ఒక్కరికీ న్యాయం అందేలా చూడాలి. మున్ముందు మరింత కష్టించి పనిచేయాలి. మన ప్రతిజ్ఞకు పూర్తిస్థాయిలో కట్టుబడేవరకూ మనలో ఎవరికీ విశ్రాంతి లేదు. మనమంతా ఒక గొప్ప దేశ పౌరులం. ఆ ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా మనమంతా జీవించాలి. మనమంతా, ఏ మతంవారమైనా భరతమాత బిడ్డలమే. అందరికీ సమానహక్కులు, బాధ్యతలు ఉంటాయి. మతతత్వం, సంకుచిత మనస్తత్వాలను మనం ప్రోత్సహించకూడదు. ఆలోచనలు, చర్యల్లో సంకుచితత్వం ఉన్న ఏ దేశమూ గొప్పది కాలేదు.

బాధ్యతలను నెరవేరుద్దాం
స్వాతంత్య్రం వచ్చిందని సంతోషంలో మునిగిపోతున్నాం. కానీ మన ప్రజల్లో ఇంకా చాలామంది కష్టాల్లో ఉన్నారు. స్వాతంత్య్రంతో పాటు బాధ్యతలు వస్తాయి. వాటిని మనం స్వేచ్ఛాయుతంగా, క్రమశిక్షణతో నెరవేర్చాలి. ఈరోజు మన తొలి ఆలోచన ఈ స్వాతంత్య్ర రూపశిల్పి, భారత జాతి పిత బాపూజీ గురించే ఉంటుంది. ఆయన స్వాతంత్య్రమనే కాగడా వెలుతురుతో మనచుట్టూ ఉన్న చీకట్లను తరిమికొట్టారు. భరతమాత ముద్దుబిడ్డ అయిన బాపూజీ సందేశాలు ప్రతి ఒక్కరి హృదయాల్లో చెక్కి ఉంటాయి. ఎంతటి పెనుతుపాన్లు వచ్చినా ఆ స్వాతంత్య్ర దీపాన్ని మనం కొడిగట్టనివ్వకూడదు. చివరి రక్తపుబొట్టు వరకూ భరతమాత సేవలో పునీతులైన ఇంకా ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులనూ మనం స్మరించుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details