తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Azadi ka amrit mahotsav: తెల్లవాళ్లకు చుక్కలు చూపిన 'మాస్టర్​ దా'

Azadi ka amrit mahotsav: గాంధీ టోపీ పెట్టుకొని... కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడిగా చేసి... సహాయ నిరాకరణలో పాల్గొని... బడిలో బుద్ధిగా లెక్కల పాఠాలు చెప్పే మాస్టారు ఒక్కరోజులో తమ మిలిటరీ వ్యవస్థనంతా అస్తవ్యస్తం చేస్తాడని తెల్లవారు ఊహించలేదు. పైకి శూన్య సమితిలా కన్పించినా... లోలోన విప్లవ సమితిలో భాగమై... చిట్టగాంగ్‌ ఆయుధ వేటతో తెల్లవారికి చుక్కలు చూపించి... స్నేహితుడి వంచనతో బందీయై... చివరకు ఉరికంబానికి వేలాడిన విప్లవ వీరుడు... చరిత్రలో పెద్దగా కన్పించని సూరీడు... సూర్యకుమార్‌ సేన్‌!

Azadi ka amrit mahotsav:
తెల్లవాళ్లకు చుక్కులు చూపిన 'మాస్టర్​ దా'

By

Published : Jan 13, 2022, 6:46 AM IST

Updated : Jan 13, 2022, 7:17 AM IST

Azadi ka amrit mahotsav: చిట్టగాంగ్‌ అంతటా 'మాస్టర్‌ దా' గా చిరపరిచితమైన పేరు సూర్యసేన్‌ది. 1894లో చిట్టగాంగ్‌లో జన్మించిన ఆయన 1916లో బెర్హంపుర్‌లో చదివేటప్పుడే... జాతీయోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. చిట్టగాంగ్‌ జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. చిత్తరంజన్‌ దాస్‌లాంటి వారి బాటలో పయనిస్తూ... సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆరోపణలపై... 1926 నుంచి రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. బయటకు వచ్చాక... ఆయన పంథా మారిపోయింది. బెంగాల్‌ను ఊపేస్తున్న విప్లవ సంస్థ అనుశీలన్‌ సమితి ప్రభావం సేన్‌పైనా పడింది.

అనేక మంది యువకులతో కలసి ఇండియన్‌ రిపబ్లిక్‌ ఆర్మీని ఏర్పాటు చేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలంటే... వారి మూలస్తంభాలైన వ్యవస్థలను దెబ్బతీయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా... చిట్టగాంగ్‌లోని ఆంగ్లేయుల ఆయుధాగారంపై దాడి చేయాలని, టెలిఫోన్‌, టెలిగ్రాఫ్‌ వ్యవస్థలను ధ్వంసం చేసి... రైల్వే లింకులను తెంపేయాలని ప్రణాళిక రచించారు. 1930 ఏప్రిల్‌ 18న 65 మంది బృందాలుగా విడిపోయి...టెలిఫోన్‌, టెలిగ్రాఫ్‌ లైన్లను తెంపేశారు. పోలీసు ఆయుధాగారం, మిలిటరీ ఆయుధాగారంపై దాడి చేసి... భారీస్థాయిలో రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కానీ మందుగుండు సామగ్రి దొరకలేదు. దీంతో చేతిలో ఉన్న ఆయుధాలతో తెల్లవారిని ఎదుర్కోవటం కష్టమని గుర్తించి తక్షణమే అంతా గ్రూపులుగా విడిపోయి తప్పించుకున్నారు. కీలకమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతినడంతో ఆంగ్లేయులు అతలాకుతలమయ్యారు. నిందితుల కోసం వేట తీవ్రం చేశారు. కొద్దిరోజుల తర్వాత... జలాలాబాద్‌ గుట్టల్లో బ్రిటిష్‌ సైనికులకు తారసపడగా... రెండువైపులా భారీ కాల్పులు జరిగాయి. 13 మంది సేన్‌ సహచరులు చనిపోగా... 80 మంది పోలీసులు మరణించారు. సేన్‌ సహా మరికొందరు తప్పించుకొని పల్లెల్లోకి వెళ్లిపోయారు. అక్కడి ప్రజలు సైతం వీరిని బ్రిటిషర్ల నుంచి కాపాడారు. ఈ సందర్భంగా... సేన్‌ రైతుగా, పూజారిగా, వడ్రంగిగా... ఇలా రోజుకో వేషం మారుస్తూ ... తెల్లవారికి పట్టుబడకుండా గడపసాగారు. కానీ... రిపబ్లిక్‌ ఆర్మీ ఏర్పాటులో తన సహచరుడైన నేత్రసేన్‌ వంచనతో... 1933 ఫిబ్రవరిలో పట్టుబడ్డారు సూర్యసేన్‌. తర్వాత కొద్దిరోజులకు... విప్లవకారులు నేత్రసేన్‌ను చంపేశారు.

సూర్యసేన్‌కు మరణశిక్ష విధించిన తెల్లవారు... ఉరితీసే ముందు కూడా... అత్యంత క్రూరంగా శిక్షించారు. ఆయన్ను శారీరకంగా నిర్వీర్యం చేశారు. ఎముకలు, వేళ్లు విరగ్గొట్టి... గోళ్లు ఊడగొట్టారు. వందేమాతరం అనే పదం ఆయన నోట్లోంచి రాకుండా... పళ్లను సుత్తితో బాదారు. అత్యంత అమానుషంగా హింసించి.. 1934 జనవరిలో చిట్టగాంగ్‌లో ఉరి తీశారు. స్వాతంత్య్రానంతరం మన భారత ప్రభుత్వంతో పాటు బంగ్లాదేశ్‌ సర్కారు కూడా సేన్‌ వీరోచిత చరితకు గుర్తుగా ఆయన స్మారకాలను నిర్మించింది.

ఇదీ చదవండి:Azadi ka amrit mahotsav: వైస్రాయ్‌ వద్దన్నా.. వివేకానంద-టాటా సైన్స్‌ ప్రయోగం

Last Updated : Jan 13, 2022, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details