Azadi Ka Amrit Mahotsav Maniram: మణిరామ్ కుటుంబం అసోంలోని అహోం రాజాస్థానంలో కీలక పదవులు నిర్వహించేది. 1817 తర్వాత బర్మా దాడితో అహోం సామ్రాజ్యం కూలిపోయింది. తర్వాత బర్మా నుంచి ఆంగ్లేయులు వశం చేసుకున్నారు. ఆ సమయంలో మణిరామ్, ఆయన కుటుంబ సభ్యులు ఈస్టిండియా కంపెనీకి సహకరించారు. 1806లో జన్మించిన మణిరామ్‌ను అస్సాంలోని రంగపూర్ ప్రాంత తహసీల్డార్‌గా నియమించారు తెల్లవారు. అప్పటికి ఆయన వయసు 22 సంవత్సరాలే. తనకు అప్పగించిన ప్రాంతాలన్నింటినీ క్షేత్ర పరిశీలన చేస్తూ.. ప్రజల బాగోగులు చూసేవారాయన.
ఈ క్రమంలో.. అసోం ఎగువ ప్రాంతంలోని సింగ్‌ఫో తెగవారు.. తేయాకు పండిస్తూ.. దాన్నుంచి ద్రావణం (టీ-చాయ్) తయారు చేసి తాగటం గమనించారు. ఆ సమయానికి.. ఆంగ్లేయులు తేయాకు కోసం చైనాపై ఆధారపడేవారు. వారితో యుద్ధాలు కూడా చేశారు. తేయాకు ఉత్పత్తిలో చైనా ఏకఛత్రాధిపత్యం ఉండేది. ఈ నేపథ్యంలో.. అసోం తేయాకు పంటకున్న అవకాశాల గురించి, స్థానిక ఆదివాసీ తెగల్లో అప్పటికే టీ తయారీ గురించి మణిరామ్ తనపై ఆంగ్లేయ అధికారికి వివరించారు. ఆశ్చర్యపోయిన ఆ అధికారి.. స్వయంగా ఆదివాసీ గ్రామాన్ని సందర్శించాడు. అక్కడ వారు పండిస్తున్న తేయాకును, చాయ్ తయారీ పద్ధతిని తెలుసుకొని.. వాటి నమూనాలను కలకత్తాకు పంపించారు. నాణ్యత అద్భుతం అని ఫలితం రావటంతో.. ఆంగ్లేయులు ఎగిరి గంతేశారు. 1834లో అస్సాంలో తేయాకు వాణిజ్యానికి తెరదీశారు. కంపెనీలు, ఎస్టేట్‌లు ఆరంభించారు. ఈస్టిండియా కంపెనీ తేయాకు ఎస్టేట్‌కు మణిరామ్‌ను దీవాన్‌గా నియమించారు.
క్రమక్రమంగా ఆంగ్లేయుల వ్యాపార ఎత్తుగడలు, వ్యూహాలు మణిరామ్‌కు అర్థం కావటం మొదలయ్యాయి. స్థానికులను కాదని బయటి రాష్ట్రాల వారిని తీసుకొచ్చి తేయాకు తోటల్లో కొలువులివ్వటం; స్థానికుల స్థలాలు లాక్కొని వెళ్లగొట్టడం.. పన్నులు భారీగా విధించటం.. ఇవన్నీ మణిరామ్‌లో ఆగ్రహం కలిగించాయి. దీవాన్ పదవికి రాజీనామా చేసి సొంతంగా జొర్హాట్‌లో తేయాకు సాగు ఆరంభించారు. మరికొన్ని ప్రాంతాలకు విస్తరించటంతో పాటు అస్సాం వాసులనూ ప్రోత్సహించారు. క్రమశిక్షణతో వారు చేస్తున్న వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగింది. ఆంగ్లేయులతో పోటీగా.. లండన్ ఎగ్జిబిషన్‌కు తమ ఉత్పత్తులనూ మణిరామ్ పంపించారు.