తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అలా జీవచ్ఛవంలా బతికే బదులు చావడం మేలు కదా!' - Indian Independence

Azadi Ka Amrit Mahotsav: మహాత్మాగాంధీ మాట్లాడుతున్నారంటే అంతా ఆసక్తిగా వినేవారు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని ప్రశాంత వదనంతో, నెమ్మదిగా, పూసగుచ్చినట్లు వివరించడం ఆయన నైజం. కానీ.. మనదేశంలో తొలినాళ్లలో గాంధీజీ చేసిన ఓ ప్రసంగం సంచలనం సృష్టించింది. ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకోవాల్సి వచ్చింది.

mahatma-gandhi
మాహాత్మాగాంధీ గాంధీ

By

Published : Apr 16, 2022, 8:01 AM IST

Azadi Ka Amrit Mahotsav: జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ మాటంటే వేదవాక్కుగా సాగింది. సభలు, సమావేశాల్లో ఆయన మాట్లాడుతున్నారంటే అంతా ఆసక్తిగా వినేవారు. ప్రసంగాల్లో ఎక్కడా ఉద్రేకానికి గురిచేసే పదాలు ఉండేవి కావు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని ప్రశాంత వదనంతో, నెమ్మదిగా, పూసగుచ్చినట్లు వివరించడం ఆయన నైజం. కానీ.. మనదేశంలో తొలినాళ్లలో గాంధీజీ చేసిన ఓ ప్రసంగం సంచలనం సృష్టించింది. యువకులు కేరింతలు కొట్టగా.. ప్రముఖులు ఖిన్నులై, వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. గాభరా పడిన నిర్వాహకులు ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకోవాల్సి వచ్చింది.

దక్షిణాఫ్రికా నుంచి 1915 జనవరి 9న భారత్‌ గడ్డపై అడుగుపెట్టిన గాంధీజీకి అనూహ్య స్వాగతం లభించింది. వెంటనే జాతీయోద్యమంలోకి దిగాలనే డిమాండూ బలంగా వినిపించింది. గాంధీజీ కూడా అందుకు సిద్ధమయ్యారు. ఆయన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే మాత్రం తొందరపడవద్దని సూచించారు. 'మొదట దేశమంతా పర్యటించి పరిస్థితులను అవగాహన చేసుకో. ఈలోపు ఎక్కడా నోరు తెరవకుండా, ప్రసంగాలు చేయకుండా నిగ్రహించుకో' అంటూ హెచ్చరించారు. ఆయన ఆదేశంతో గాంధీజీ దేశ పర్యటన చేశారు. కానీ.. కొన్ని సందర్భాల్లో ప్రసంగించాల్సి వచ్చింది. అందులో ప్రధానమైంది బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ సభ ప్రసంగం. పండిత మదన్‌మోహన్‌ మాలవీయ చొరవతో ఈ విశ్వవిద్యాలయం నిర్మితమైంది. 1916 ఫిబ్రవరిలో మూడు రోజులపాటు సాగిన సంబరానికి బ్రిటిష్‌ వైస్రాయ్‌ లార్డ్‌ హార్డింగ్‌తోపాటు నిర్మాణానికి విరాళాలిచ్చిన అనేక మంది సంస్థానాధీశులు హాజరయ్యారు. గాంధీజీని కూడా ఆహ్వానించారు. వైస్రాయ్‌ రాక కారణంగా విశ్వవిద్యాలయంతోపాటు బెనారస్‌ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మూడోరోజు చివర్లో గాంధీజీని మాట్లాడమన్నారు.

గాంధీ... ఇక చాల్లే.. కూర్చో!!:గుజరాతీ సంప్రదాయ ధోతీ, తలపాగా ధరించి వేదికపైకి వచ్చిన గాంధీజీ... వక్తల ప్రసంగాలు తనకేమాత్రం ఉత్సాహాన్నివ్వలేదంటూ నిర్మొహమాటంగా విమర్శలు కురిపించారు. దేశ భాషలను విస్మరించి ఆంగ్లంపై మోజు చూపడం మంచిదికాదని తేల్చి చెప్పారు. "మీ అందరి ముందూ మనదికాని మన భాషలో (ఆంగ్లంలో) మాట్లాడాల్సి వస్తున్నందుకు బాధగా, సిగ్గుగా ఉంది. రెండ్రోజులుగా సాగుతున్న ప్రసంగాల్లో ఏమాత్రం పసలేదు. వైస్రాయ్‌ వచ్చారని బెనారస్‌ అంతటినీ దిగ్బంధనం చేశారు. ఎక్కడ చూసినా గూఢచారులే. ఎందుకింత అపనమ్మకం? ఇలా భయంభయంగా జీవచ్ఛవంలా బతికే బదులు చావడం మేలు కదా! ఇక మహారాజులు, సంస్థానాధీశులు రెండ్రోజులుగా మనదేశ పేదరికం గురించి కన్నీరు కార్చారు. కానీ.. వారు మాత్రం కాళ్ల నుంచి తలదాకా ఒంటినిండా వజ్రాలు, వైఢూర్యాలు, బంగారు నగలను దిగేసుకొచ్చారు. ఆభరణాల ప్రదర్శనకు వచ్చినట్లు వచ్చారు. ఈ మహారాజులంతా తమ నగలన్నింటినీ మూటగట్టి దేశ ప్రజలకు ఉపయోగించేలా ఓ ట్రస్టు కింద ఉంచితే మేలు. ఇదంతా ఎవడబ్బ సొమ్ము. మన రైతుల కష్టఫలం. మన దేశానికి ముక్తి సామాన్య రైతుల నుంచే వస్తుంది. డాక్టర్లు, లాయర్లు, భూస్వాములు, మహారాజులతో కాదు. అందుకే... మనం మహారాజులకు, వైస్రాయ్‌లకు, కింగ్‌ జార్జ్‌కు కూడా భయపడాల్సిన అవసరం లేదు" అంటూ గాంధీజీ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడసాగారు.

సభ నిర్వాహకులు మాలవీయ, అనీబిసెంట్‌లు అయోమయంలో పడగా... సంస్థానాధీశులకు కోపం వచ్చేసింది. సభ మధ్యలోంచి విసవిసా వెళ్లిపోయారు. గాంధీ ప్రసంగాన్ని ఆపుతామంటూ మాలవీయ వారిని బతిమిలాడారు. అనిబీసెంట్‌ వెంటనే రంగంలోకి దిగి... గాంధీని ప్రసంగం ఆపేసి కూర్చోమన్నారు. యువకుల అరుపులు, కేకల కారణంగా... సభాధ్యక్షుడి అనుమతితో గాంధీజీ ప్రసంగం కొనసాగించారు. 'అపనమ్మకాలతో కాకుండా పరస్పర విశ్వాసపూరిత వాతావరణంలో పాలన కొనసాగాలి. ముఖస్తుతి చేయడం నా వల్ల కాదు. స్వయం పాలన అనేది ఒకరిచ్చేది కాదు. మనమే సాధించుకోవాలి. దీనికి ముందే మనం అన్ని విధాలుగా సిద్ధం కావాలి' అంటూ గాంధీజీ ప్రసంగిస్తుంటే మళ్లీ గొడవ మొదలై ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details