- రోజూ మనం నోట్లో పెట్టుకునే ముద్ద ఆషామాషీగా వచ్చేది కాదు. ఎక్కడో ఎవరో రైతు నారు పోసి, నీరు పెట్టి, కష్టనష్టాలకు ఓర్చి... పండించిన గింజ మన ఇంటికి చేరి ఒంట్లో ప్రాణశక్తిగా మారుతుంది!
- మన స్వాతంత్య్రం కూడా అలాంటిదే. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వరాజ్యం అలవోకగా వచ్చింది కాదు. నిరంతర పోరాటాల ఫలితం!
- ఇవాళ మనం పీలుస్తున్న స్వేచ్ఛా వాయువుల వెనక ఆగిపోయిన ఊపిరిలెన్నో! ఉరితాళ్లకు వేలాడిన ప్రాణాలెన్నో! మనం అనుభవిస్తున్న సౌకర్యాల వెనక కమిలిన కుటుంబాలెన్నో! కనిపించని కష్టాలెన్నో! ఆవిరైన కన్నీళ్లెన్నో... వినిపించని వేదనలెన్నో! ఆస్తులు, సుఖాలను కాదనుకున్న త్యాగాలెన్నో!
- 75వ వసంతోత్సవాన, అమరులిచ్చిన ‘అమృతాన్ని’ జుర్రుతున్న సమయాన... స్వాతంత్య్రం.... అంటే ఏంటి? అది లేకుంటే ఏంటో? ... అర్థం చేసుకోవాలి భారత్ ఎలా ఉండేది? ఎలా మిగిలింది? ఏం కోల్పోయిందో?... శోధించాలి
- ప్రపంచంలోని ప్రతి ఒక్కడి కన్నూ పదేపదే ఎందుకని మన దేశంపై పడింది? ఎంతమంది దోచుకుపోయినా ఈ దేశం ఎలా బతికుందో? ... తెలుసుకోవాలి
- స్వాతంత్య్రం వచ్చింది సరే... ఆంగ్లేయులు నింపిన ఆత్మన్యూనత నుంచి, వలస పాలన వాసనల నుంచి... బ్రిటిష్ పద్ధతుల నుంచి, ఆంగ్ల భాషపై మోజు నుంచి స్వేచ్ఛ వచ్చిందా? .... అని ప్రశ్నించుకోవాలి!
- ఆనందోత్సాహాల మధ్యే ఆ ఆత్మపరీక్షకు సిద్ధ పడితే... 200 ఏళ్లు తెల్లవాడి చేతిలో బానిసలవ్వటానికి కారణం ఆంగ్లేయుల బలమో, ఆయుధమో కాదనీ... మన అనైక్యత, అసూయలు, అంతఃకలహాలేనని అవగతమవుతుంది!
- బహుళత్వం... భిన్నత్వం... ఏకత్వం... సమ్మిళితత్వం మన దేశ జీవనాడులని అర్థమవుతుంది. ఆ స్పృహే మనల్ని అనుక్షణం... స్వాతంత్య్ర విలువను గుర్తించేలా, మళ్లీ తప్పటడుగులు వేయకుండా ఉండేలా స్వరాజ్యంలో సురాజ్యం సాధించేలా నడిపిస్తుంది!
ఆంగ్లేయులను తరిమికొట్టడానికి రెండు వందల ఏళ్లపాటు ఆసేతు హిమాచలం అనుక్షణం పోరాడింది. హింసో అహింసో... తిరుగుబాటో మరోటో... రూపం ఏదైనా భారతావని ఎన్నడూ అశక్తంగా ఆగలేదు. శక్తియుక్తులను కోల్పోలేదు. పోరాటం ఆపలేదు. అబలలు అనుకున్న వారి నుంచి అంతఃపుర స్త్రీల వరకు... అడవుల్లో ఆదివాసీల నుంచి... ఆధునిక చదువులు చదువుకున్నవారి దాకా... మతాలు, కులాలు, పార్టీలు, సంస్థలు, సంస్థానాధీశులు... ఉన్నవారు లేనివారు... దశాబ్దాలు, అలుపెరగని పోరాటం సాగించారు. భారత స్వాతంత్య్ర సమరం అనేక పాయల సంగమమై... వివిధ రంగాల, వ్యక్తుల, ఉద్యమాల సమ్మేళనమై సాగింది. జాతిపిత గాంధీ మహాత్ముడి దిశానిర్దేశంలో స్వేచ్ఛను సాధించింది. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నేపథ్యంలో పోరాటం సాగిన తీరు, బలిదానాలు, సంస్కరణలపై సీనియర్ ఐఏఎస్ అధికారి ఎ.వి.రాజమౌళి ప్రత్యేక కథనం...
మనం ఎలా పరాధీనమయ్యాం?:వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి రాజుల మధ్య కలహాలు సృష్టించి, కుటుంబంలో ఒకరి వేలితో మరొకరి కన్ను పొడిపించిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంపై పట్టు సాధించింది. వ్యవస్థలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ... అవసరమైతే అణచివేస్తూ కొనసాగిన కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా అక్కడక్కడ ప్రతిభావంతులైన వ్యక్తులు పోరాటయోధులు, గిరిజన వీరులు ఎదురు తిరిగినా... కంపెనీ ముందు వారి బలం సరిపోలేదు.
'తిలకం' దిద్దిన పోరాటం:ఆంగ్లేయులను వినతుల(మహజర్లు) ద్వారా ప్రాధేయపడటం బాలగంగాధర్ తిలక్ లాంటి ఉద్యమకారులకు నచ్చలేదు. వినాయక చవితి, విజయదశమిలాంటి ఉత్సవాలలో అశేష జన వాహినిని ఉద్దేశించి వారు ఉత్సాహ, ఉత్తేజ భరిత ప్రసంగాలు చేస్తూ జాతిని స్వాతంత్య్రం సాధించుకోవాలనే ఆలోచన దిశగా మళ్ళింపజేశారు. ఆలోచన, ఆవేశాలతో మిళితమైన వీరి కార్య ప్రణాళిక వేళ్లూనుకోవడాన్ని గమనించిన బ్రిటిష్ పాలకులు... విభజించి పాలించే సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమ భావాలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కుల, మత విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వాటి ఫలితమే 1905లో జరిగిన బెంగాల్ విభజన. స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రంగా రాజుకుంటున్న రాష్ట్రాన్ని తూర్పు, పశ్చిమ బెంగాల్‌గా విభజించారు. వెన్వెంటనే బాల్, లాల్, పాల్ త్రయం దేశవ్యాప్తంగా పర్యటించింది. ఫలితంగా వందేమాతరం నినాదం మారుమోగింది. తమ తప్పిదాన్ని తెలుసుకున్న పాలకులు బెంగాల్ విభజనను 1911లో వెనక్కి తీసుకున్నారు.
దేశమంతటా సహాయ నిరాకరణ:రాజ్యాంగ సంస్కరణలు చేస్తున్నామని చెబుతూ... మరింత కఠిన చట్టాలను రూపొందించేలా తయారు చేసిన రౌలత్ చట్టానికి (విచారణ లేకుండా శిక్ష, వారెంటు లేకుండా అరెస్టు) వ్యతిరేకంగా గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం (1920) దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను అమితంగా ఆకర్షించింది. ప్రజల మనోభావాలను గుర్తించని, గౌరవించని ప్రభుత్వ చట్టాలకు సహాయ నిరాకరణ చేయటం ధర్మబద్ధమని ఉద్యమం సాగించారు. అయితే చౌరీచౌరాలో ఉద్యమకారులు అదుపుతప్పి ఒక ఠాణాను తగలబెట్టడం వంటి హింసాయుత చర్యకు పాల్పడ్డారని తెలిసి ఖిన్నులయ్యారు. ఉన్నత లక్ష్యం ఎంత ముఖ్యమో సమున్నత మార్గమూ అంతే ముఖ్యమని హింసాయుత మార్గాల ద్వారా వచ్చే స్వాతంత్య్రం కలకాలం మనజాలదని, ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమాన్ని ఒక్క పిలుపుతో ఆపివేశారు. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే సైద్ధాంతిక పునాదుల ఆధారంగా చేసే పోరాటంలో స్థితప్రజ్ఞుడికి ప్రశంసలు, విమర్శలు సమానమేనని తన ఆచరణ ద్వారా తన మౌనం, నిరాహార దీక్షల ద్వారా దేశానికి సందేశం ఇచ్చారు. పోరాటానికి తన సమూహ సభ్యులను సన్నద్ధం చేయటం ఎంత ముఖ్యమో అహింసాయుత సిద్ధాంతాల ఆధారంగా పోరాటం చేయడం అంతే ముఖ్యమని... వీటి ఉల్లంఘన ఆ ఉద్యమ ఫలితాలను కలుషితం చేస్తుందనే శాశ్వత పాఠాన్ని తన తరానికి తర్వాతి తరాలకు గాంధీజీ అందించారు.
జలియన్‌వాలాబాగ్‌లో పాశవిక చర్య:రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్ర అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్ ప్రాంగణంలో సమావేశమైన ఉద్యమకారులపై స్థానిక పోలీసు అధికారి జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా జరిపిన కాల్పులతో, ప్రజల ఆగ్రహావేశాలు, ఉద్యమ స్ఫూర్తి మిన్నంటాయి. దమన కాండలకు పాల్పడుతున్న బ్రిటిష్ ప్రభుత్వానికి ఎటువంటి సహకారం అందించకూడదని గాంధీజీ ఉద్యమాన్ని ప్రారంభించారు. జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావటం, ప్రజాక్షేత్రంలో రావాల్సిన మార్పులను సూచించడం, ప్రజల నాడిని అర్థం చేసుకోవడం, బాధ్యతాయుతంగా స్పందించడం, ప్రజా సంక్షేమం, ప్రజల భాగస్వామ్యం, ప్రజలకు మార్గదర్శనం... ఇలా గాంధీ చేపట్టిన ప్రతి ఉద్యమంలో ఒక స్పష్టమైన ప్రణాళిక, నిజాయితీ, దార్శనికత కనిపిస్తాయి. అంతేకాక తన ఆలోచనలను, విభిన్న విషయాలపై తన అభిప్రాయాలను అత్యంత తర్కబద్ధంగా యంగ్ ఇండియా, హరిజన్ వంటి పత్రికలలో స్పష్టంగా వివరించేవారాయన.
మనదేశం నుంచి 200 ఏళ్ల పాలనాకాలంలో ఆంగ్లేయులు పన్నుల రూపంలో దోచుకెళ్లిన మొత్తం ధనం విలువ రూ.45 లక్షల కోట్లు.
తెల్లవాడి అహంకారానికి తొలి హెచ్చరిక: రాజ కుటుంబాలలోని అంతర్గత సమస్యలను, బలహీన వ్యక్తిత్వమున్న వాటి సేనాధిపతులను ప్రలోభపెట్టి ఈస్టిండియా కంపెనీ దేశంలో అత్యధిక భాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది. భారతజాతికి దాస్య శృంఖలాలు వేసింది. అయితే బ్రిటిషర్ల దాస్యానికి తల ఒగ్గలేని... ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియాతోపే, నానాసాహెబ్ లాంటి కొందరు రాజులు, రాణులు, రాకుమారులు, రాజ్య వారసులు, సేనాధిపతులు దేశంలోని విభిన్న ప్రాంతాల్లో 1857లో ఒకేసారి ప్రథమ స్వాతంత్య్ర తిరుగుబాటును ప్రారంభించారు. బ్రిటిష్ వారిని దేశం నుంచి వెళ్లగొట్టడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు. వీరికి కంపెనీలో పనిచేస్తున్న భారతీయ సిపాయిలు కూడా తోడయ్యారు. అయితే ఆంగ్లేయుల సుశిక్షిత సైన్యం, ఆధునిక ఆయుధాల ముందు... భారతీయ పోరాట యోధుల బలం సరితూగలేకపోయింది.
లండన్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో ఆరుగురు సభ్యులు, 60 వేల పౌండ్ల మూలధనంతో 1600 సంవత్సరంలో ఏర్పాటైన ఈస్టిండియా కంపెనీ మన దేశాన్ని 110 ఏళ్లు పాలించింది. బ్రిటన్ ప్రభుత్వం 1858 నుంచి నేరుగా 89 ఏళ్లు ఏలింది.
శాంతియుత జన సమూహంపై కాల్పులు జరిపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురైంది. దాంతో బ్రిటన్ ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం చెల్లించింది. మొత్తం 376 మందికి రూ.22.66 లక్షల పరిహారం ఇచ్చినట్లు రికార్డుల్లో రాశారు.
అసంతృప్తిని చల్లార్చే ప్రయోగాలు: ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం(1857) తర్వాత భారతదేశం ఈస్టిండియా కంపెనీ పాలన నుంచి బ్రిటిష్ రాణి ఆధీనంలోకి వెళ్లింది. భారతీయుల్లో నిగూఢంగా ఉన్న అసంతృప్తిని, ఆత్మక్షోభను చల్లార్చడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ ప్రతినిధులైన వైస్రాయిల ద్వారా పరిపాలనలో కొన్ని సంస్కరణలు, వెసులుబాట్లను ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఎ.ఓ. హ్యూమ్ ప్రతిపాదన మేరకు భారత జాతీయ కాంగ్రెస్‌ను ప్రారంభించి, తొలి అధ్యక్షుడిగా ఉమేష్ చంద్ర బెనర్జీని ఎన్నుకున్నారు. ఆరంభంలో కొందరు భారతీయ విద్యావేత్తలు, ఉద్యోగులు కలిసి బ్రిటిష్ ప్రభుత్వంతో సామరస్యంగా ఉంటూ, వినతుల ద్వారా ప్రజల సమస్యను పరిష్కరించే ప్రయత్నించేవారు. ఈ ప్రయత్నంలో గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్, లాలా లాజ్‌పత్‌రాయ్, బిపిన్ చంద్రపాల్(బాల్, లాల్, పాల్) లాంటి ప్రముఖులు భారతజాతి ఉద్ధరణ దిశగా పనిచేశారు.
1885 డిసెంబరులో 28-31 తేదీల మధ్య ముంబయిలో ఓ సంస్కృత కళాశాలలో 72 మంది ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ ఆవిర్భవించింది.
మువ్వన్నెలు మురిసిన వేళ: దేశంలో ఉద్యమం క్రమంగా ఉగ్రరూపం దాలుస్తున్న సమయంలోనే జర్మనీ, జపాన్ దేశాల రాజ్యవిస్తరణకాంక్షల కారణంగా రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అందులో బ్రిటన్‌తోపాటు దాని మిత్రదేశాలు జర్మనీకి వ్యతిరేకంగా పోరాడటం, భారతీయుల అనుమతి లేకుండానే దేశాన్ని యుద్ధంలోకి దించడంతో గాంధీజీ నేతృత్వంలో ప్రజలంతా భగ్గుమన్నారు. ఇక ‘విజయమో వీర స్వర్గమో’ (డూ ఆర్ డై) అనే నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమం(1942) ప్రారంభమైంది. అదే సమయంలో జపాన్ సహాయంతో భారత్‌కు స్వాతంత్య్రం సమకూర్చి పెట్టేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉద్యుక్తులయ్యారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, ‘చలో దిల్లీ’ అంటూ నినదిస్తూ బర్మా (నేటి మయన్మార్) మీదుగా కవాతు ప్రారంభించారు. అంతలోనే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్, జర్మనీలు ఓడిపోయాయి. సింగపూర్ నుంచి జర్మనీకి వెళ్లే సమయంలో విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ అమరుడయ్యారు. ఆయన లేకపోయినా... ఆయన ఇచ్చిన ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం భారత యువతను ఉత్సాహపరచి, ఉర్రూతలూగించింది. క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అత్యధిక సంఖ్యలో పాల్గొనేలా ప్రేరేపించింది. ఎట్టకేలకు భారత్‌ను వీడిపోవాలని నిర్ణయించిన బ్రిటన్ మన గుండెపై విభజన గాయం చేసింది. చివరికి 1947 ఆగస్టు 15న మనకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు సమకూరాయి.