అప్పటి బొంబాయి రాష్ట్రంలో రెండో అతిపెద్ద పట్టణంగా ఎదిగిన అహ్మదాబాద్ ఆధునిక వస్త్ర పరిశ్రమలకు పేరొందింది. అనేక మిల్లులతో పారిశ్రామిక కేంద్రంగా కళకళలాడుతుండేది. 1915 సంవత్సరంలో భారత్‌కు వచ్చిన గాంధీజీ అహ్మదాబాద్‌నే తన స్థావరంగా మలచుకున్నారు. అయితే 1917లో వాతావరణ విపత్తులతోపాటు ప్లేగు మహమ్మారి అహ్మదాబాద్‌ను అతలాకుతలం చేసింది. పట్టణ జనాభాలో 10% ప్రజలు మృత్యువాత పడ్డారు. చాలామంది బతికితే చాలనుకొని నగరాన్ని విడిచిపెట్టసాగారు. వీరిలో వస్త్ర పరిశ్రమ కార్మికులూ ఉన్నారు. కార్మికులు వెళ్లిపోతే వ్యాపారం దెబ్బతింటుందనే ఉద్దేశంతో మిల్లు యజమానులు.. జీతాలకు అదనంగా 80% మహమ్మారి పరిహారంగా చెల్లించారు. 1918 జనవరిలో ప్లేగు తగ్గుముఖం పట్టగానే ఈ పరిహారాన్ని ఉపసంహరించారు. అయితే.. అప్పటికే మొదటి ప్రపంచయుద్ధం కారణంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమై ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తమ జీతాలను 50% పెంచాలంటూ కార్మికులు పట్టుబట్టారు. యజమానులు ససేమిరా అనడం వల్ల కార్మికులు సమ్మెకు దిగారు. వారిని భయపెట్టేందుకు యజమానులు కొందరు కార్మికులను ఉద్యోగాల్లోంచి తీసేశారు. ఏకంగా బొంబాయి నుంచి కార్మికులను తీసుకురావడం ప్రారంభించారు.
సమ్మె కాలంలో మధ్యవర్తిత్వ చర్చలు:దిక్కుతోచని కార్మికులు సామాజిక కార్యకర్త అనసూయ సారాభాయ్‌ని సంప్రదించారు. ఆమె అహ్మదాబాద్ మిల్లు యజమానుల సంఘం అధ్యక్షుడు అంబాలాల్ సారాభాయ్‌కి స్వయనా సోదరి అవుతారు. తనకు తానుగా ఏమీ చేయలేని అనసూయ సమస్యను గాంధీజీ ముందుంచారు. మిల్లు యజమానుల్లో చాలామంది గాంధీజీకి సన్నిహితులు. అంబాలాల్ సారాభాయ్ కూడా ఆయనకు మిత్రుడే. అయినా గాంధీజీ కార్మికుల పక్షానే నిల్చున్నారు. ఇరుపక్షాలూ మధ్యవర్తిత్వ మండలి (ఆర్బిట్రేషన్ బోర్డు) ద్వారా చర్చించుకుని, సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. చర్చలు ప్రారంభమైనా.. పరస్పర అపనమ్మకం కారణంగా ముందుకు సాగలేదు. దీంతో సమ్మె కొనసాగింది. గాంధీజీ సైతం సమ్మెకే మద్దతిచ్చారు. అయితే హింసకు తావులేకుండా అహింసా పద్ధతిలో సాగాలని స్పష్టం చేశారు. ప్రతిరోజూ కార్మికులకు గాంధీజీ ఆశ్రమంలో వివిధ పనుల్లో శిక్షణ కూడా ఇచ్చేవారు. పౌరులు ఉద్యోగాలపైనే కాకుండా అవసరమైతే తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలన్నది ఆయన ఉద్దేశం.