Azadi Ka Amrit Mahotsav: ఖిలాఫత్ తర్వాత గాంధీజీ ఆరంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం జోరుగా సాగింది. ఆంగ్లేయుల పాఠశాలలు, కోర్టులు, విదేశీ వస్తువులను బహిష్కరించాలని, జాతీయ పాఠశాలలు,కళాశాలలను, ఖద్దరును ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఎక్కడ చూసినా ఉప్పెనలా వెల్లువెత్తుతున్న ప్రజానీకం- సంబరం కలిగించేదే అయినా... సమస్యలు కూడా సృష్టిస్తుందని ఊహించారు గాంధీజీ. అందుకే... జాతీయోద్యమానికి ఓ క్రమశిక్షణ అవసరమని భావించారు. లేదంటే ఇది మూకస్వామ్యంగా మారి అదుపు తప్పుతుందన్నది ఆయన ఆందోళన. సరైన క్రమశిక్షణలో పెడితే వీరినే ప్రజాస్వామ్య పద్ధతుల్లోకి మళ్లించ వచ్చనుకున్నారు. ఇందుకోసం సుశిక్షితులైన కార్యకర్తలను సిద్ధం చేశారు. 1921 నాటికి వేలమంది స్వచ్ఛంద కాంగ్రెస్ కార్యకర్తలు తయారయ్యారు. ఖద్దరు ధరించటం; అహింసను పాటించటం; పార్టీ ఆదేశాలను శిరసావహించటం; అంటరానితనానికి, అవినీతికి దూరంగా ఉండటం, సర్వమత సమానత్వ భావన కలిగి ఉండటం... ఈ కార్యకర్తల కర్తవ్యం.
అలా... 1922 జనవరిలో యునైటెడ్ ప్రావిన్స్ (ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్) గోరఖ్‌పుర్ జిల్లాలోని చౌరీచౌరా దగ్గరగల చోట్కి దుమ్రి అనే గ్రామంలో కూడా స్వచ్ఛంద కార్యకర్తలు తయారయ్యారు. వీరి ఆధ్వర్యంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో ఫిబ్రవరి 2న మద్యం దుకాణాల ముందు ధర్నా చేశారు. ఈ ఆందోళనకారులందరిపైనా స్థానిక పోలీసు ఇన్‌స్పెక్టర్ గుప్తేశ్వర్ సింగ్, ఇతర పోలీసులు విరుచుకుపడ్డారు. కొంతమందిని చౌరీచౌరా పోలీసు స్టేషన్‌లో బంధించారు. దీనికి నిరసనగా ఫిబ్రవరి 4న ప్రదర్శన నిర్వహించాలని కాంగ్రెస్ కార్యకర్తలు పిలుపునిచ్చారు. సుమారు 2500 మంది చౌరీచౌరా మార్కెట్‌వైపు కదిలారు. ఈ పరిణామాన్ని ముందే ఊహించిన ఇన్‌స్పెక్టర్ గుప్తేశ్వర్ గోరఖ్‌పుర్ నుంచి అదనపు బలగాలను దించాడు. ముందుకు కదులుతున్న ఆందోళన కారులను భయపెట్టడానికి గాల్లో కాల్పులు జరిపారు. దీంతో ఆగ్రహించిన ప్రజానీకం రాళ్లు విసరటంతో... తుపాకుల్ని ప్రజలపై ప్రయోగించారు. ముగ్గురు మరణించారు. ఆందోళన కారుల్లో ఆగ్రహం వెల్లువై దూసుకురావటంతో... పోలీసులంతా వెనకడగువేసి స్టేషన్లో దాక్కున్నారు. ఉత్తి పుణ్యానికి అమాయకులను బలితీసుకున్నారనే కోపంతో స్టేషన్‌కు తాళం వేసి... బజార్‌లోంచి కిరోసిన్ తీసుకొచ్చి ఆందోళనకారులు స్టేషన్‌కు నిప్పుపెట్టారు. 23 మంది పోలీసులు నిలువునా దహనమయ్యారు.
బ్రిటిష్ ప్రభుత్వం చౌరీచౌరా, దాని పరిసర ప్రాంతాల్లో మార్షల్ లా ఆంక్షలు విధించింది. ఇల్లిల్లూ... ఊరూరూ జల్లెడ పట్టింది. 228 మందిని పట్టుకొని విచారించింది. ఎనిమిది నెలల విచారణ అనంతరం 172 మందికి ఉరిశిక్ష విధించింది. ఇంతమందికి ఒక్కసారిగా మరణశిక్ష విధించటంపై యావద్దేశం ఆగ్రహించింది. అలహాబాద్ హైకోర్టులో వాదోపవాదాల అనంతరం... 172 మందిలోంచి 19 మందికి మాత్రమే ఉరిశిక్ష ఖరారు చేశారు. మిగిలిన వారి శిక్షలను తగ్గించారు. ఉద్యమాన్ని ఉపసంహరించుకున్న కొద్దిరోజుల తర్వాత గాంధీపైనా రాజద్రోహనేరం మోపి జైలులో బంధించింది.