తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్ కోసం పోరాడిన ఆంగ్లేయురాలు.. అభినవ మీరాబెన్‌ - ఇండియా ఇండిపెండెన్స్ మీరాబెన్

Azadi ka Amrit Mahotsav: భారత స్వాతంత్య్రం కోసం భారతీయులే కాదు, కొంతమంది ఆంగ్లేయులూ తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు మాడెలీన్‌ స్లేడ్‌! గాంధీజీ కోసం, గాంధీయిజం కోసం తపించి... ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడే సర్వం త్యజించి... బ్రహ్మచారిణిగా మారి భారత్‌కు వచ్చిన అపర మీరాబాయి- మాడెలీన్‌. అందుకు తగ్గట్లుగానే భారత్‌లో ఆమె పేరు మీరాబెన్‌గా మారిపోయింది. కృష్ణుడి కోసం మీరాబాయి ఎంతగా తపించిందో... గాంధీని తన తండ్రిగా భావించి అంతకంటే ఎక్కువగా పూజించారు మీరాబెన్‌!

meera ben mahatma gandhiji
meera ben mahatma gandhiji

By

Published : Jan 19, 2022, 12:57 PM IST

Azadi ka Amrit Mahotsav: సంపన్న బ్రిటిష్‌ కుటుంబంలో 1892లో జన్మించారు మాడెలీన్‌. జర్మన్‌ సంగీతకారుడు బెథోవెన్‌ అంటే చెవి కోసుకునే మాడెలీన్‌ స్లేడ్‌.. ఆయనపై పుస్తకాలు రాసిన ఫ్రెంచ్‌ రచయిత రొమెయిన్‌ రోలండ్‌ను ఓసారి కలుసుకున్నారు. తానప్పుడే గాంధీజీపై రాసిన పుస్తకాన్ని ఆమెకు చూపించారు రోలండ్‌! 'ఈ కాలపు క్రీస్తు' అంటూ గాంధీని ప్రశంసించి.. పుస్తకం చదవమని సిఫార్సు చేశారు. అప్పుడు సరేనన్నా.. తర్వాత మరచిపోయారు మాడెలీన్‌. కొద్దిరోజులకు పారిస్‌ పర్యటనకు వెళ్లగానే గుర్తుకొచ్చింది. పుస్తకం కొనుక్కొని చదవటం మొదలెడితే... ఏకబిగిన సాగి ఒక్కరోజులోనే పూర్తయింది. తన జీవిత పరమార్థం దొరికినంతగా సంబరపడ్డ ఆమెకు... గాంధీజీ పిలుస్తున్నట్లనిపించింది. వెంటనే భారత్‌కు టికెట్‌ బుక్‌ చేసుకున్నారు.

నిగ్రహం కోసం...

Madeleine Slade Indian Independence movement

అంతా సిద్ధమనుకుంటున్న దశలో మాడెలీన్‌ పునరాలోచనలో పడ్డారు. భావోద్వేగంలో నిర్ణయాలు తీసుకోకుండా... గాంధీజీ చెప్పిన సూత్రాలకు తాను నిలబడే నిగ్రహశక్తిని తొలుత సంపాదించుకోవాలనుకున్నారు. లండన్‌లో ఉంటూనే మాంసాహారం వదిలి శాకాహారానికి మారారు. మద్యం మానేశారు. నేలపై పడుకోవటం అలవాటు చేసుకున్నారు. చరఖా వినియోగం, కాసింత హిందీ నేర్చుకొన్నారు. పారిస్‌ వెళ్లి.. ఫ్రెంచ్‌లో భగవద్గీత, రుగ్వేదం చదివారు. పారిస్‌ నుంచి లండన్‌ తిరిగిరాగానే... భారత్‌లో హిందూ-ముస్లింల ఐక్యత కోసం గాంధీజీ ఉపవాస దీక్ష ఆరంభించారని తెలిసింది. 21 రోజులపాటు సాగిన ఆ దీక్ష ఆమెకు 21 యుగాలుగా అనిపించింది. ఎట్టకేలకు దీక్ష విజయవంతం కావటంతో... గాంధీజీకి ఏదైనా బహుమతి పంపాలనుకున్నారు. కానీ అప్పటికే తను దాచుకున్న డబ్బులైపోయాయి. పుట్టినరోజున తాత ఇచ్చిన చిన్న వజ్రాల కడియాన్ని అమ్మేసి.. 20 పౌండ్లను గాంధీజీకి పంపించారు మాడెలీన్‌. తాను భారత్‌కు రావాలనుకుంటున్నట్లు లేఖ రాశారు. గాంధీజీ అంగీకరించటంతో... 1925 నవంబరు 6న ముంబయిలో అడుగుపెట్టారు మాడెలీన్‌. అదేరోజు రాత్రి రైలులో అహ్మదాబాద్‌కు ప్రయాణమయ్యారు.

Mirabehn Mahatma Gandhi

సబర్మతి ఆశ్రమంలో తనకు కేటాయించిన గదిలోకి వెళ్లగానే... చైతన్య కిరణం ఆమెపై ప్రసరించింది. అంతే- ఎదురుగా ఉన్న ఆయన కాళ్లపై పడిపోయారు. రెండుచేతులా ఆమెను లేవనెత్తుతూ ... 'ఇకనుంచి నువ్వు నా బిడ్డవు' అంటూ పలికిందా కంఠం. మెల్లగా లోకంలోకి వచ్చి చూసిన తనకు... తానిన్నాళ్లుగా తపిస్తున్న గాంధీజీ ఎదురుగా కన్పించగానే ఆమెకు కన్నీళ్లాగలేదు. నాటినుంచి ఆమె గాంధీని 'బాపూ' అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆమెను గాంధీజీ మీరా అని సంబోధించేవారు.

తల్లి మరణించినా వెళ్లకుండా...

Mira behn India:33వ ఏట భారత్‌లో అడుగుపెట్టిన మాడెలీన్‌.. మీరాబెన్‌గా మారి ఇంకో 34 సంవత్సరాలపాటు ఇక్కడే ఉండిపోయారు. తల్లిదండ్రులు, సోదరి మరణించినా చూడటానికి వెళ్లలేనంతగా గాంధీజీతో, భారతావనితో మమేకమైపోయారు. పాశ్చాత్యాన్ని పూర్తిగా వీడి... తెల్లటి చీరకట్టుకొని.. భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. మూడుసార్లు జైలుకెళ్లారు. సైమన్‌ గోబ్యాక్‌, శాసనోల్లంఘన, ఉప్పుసత్యాగ్రహం, గాంధీ-ఇర్విన్‌ ఒప్పందాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. లండన్‌ రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌కు కూడా గాంధీతోపాటు వెళ్లారు. ఇటలీ నియంత ముసోలినీతో గాంధీజీ భేటీ సమయంలోనూ ఆయన పక్కనే ఉన్నారామె. బాపూ ప్రత్యేక ప్రతినిధిగా అనేక సందర్భాల్లో బ్రిటిష్‌ వైస్రాయ్‌లు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో చర్చించిన మీరాబెన్‌... భారత స్వాతంత్య్రం కోసం విదేశాలకు వెళ్లి దేశాధ్యక్షులు, రాయబారులతోనూ సంప్రదింపులు జరిపారు. విన్‌స్టన్‌ చర్చిల్‌ నుంచి మొదలెట్టి... అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ దాకా అందరినీ ఒప్పించే ప్రయత్నం చేశారు. దేశ విభజన, రాజ్యాంగ రచన, గాంధీజీ హత్య... ఇలా అన్నింటికీ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు మీరాబెన్‌.

Pashulok Ashram rishikesh

బాపూజీ ఆదేశాల మేరకు 1947లో రుషికేశ్‌ సమీపంలో బాపూగ్రామ్‌ పేరిట పశులోక్‌ ఆశ్రమాన్ని నిర్మించారు. ఆయన మరణానంతరం ఆధ్యాత్మికతలో మునిగితేలారు. 1959లో ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లారు. 1960లో ఆస్ట్రియాకు వెళ్లి స్థిరపడ్డారు. 1982 జులై 20న అక్కడే తుదిశ్వాస విడిచారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details