Hedgewar RSS: బ్రిటిష్ సామ్రాజ్ఞికి పట్టాభిషేకం జరిగి 60 ఏళ్లు అవుతున్న సందర్భమది. ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు మిఠాయిలు పంచుతున్నారు. పిల్లలంతా నిశ్శబ్దంగా వాటిని తీసుకుంటున్నారు. నిండా 15 ఏళ్లు కూడా లేని ఓ బాలుడు మాత్రం అనూహ్యంగా మిఠాయిని నేలకేసి కొట్టడంతో అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు. అసలే తల్లిదండ్రులు లేని పిల్లాడు.. ఇప్పుడు అధికారుల ఆగ్రహానికి బలయ్యేలా ఉన్నాడంటూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అతను మాత్రం 'ఇప్పుడు మనకు కావాల్సింది మిఠాయిలు కాదు.. మనల్ని మనమే పాలించుకునే స్వాతంత్య్రం' అని ధైర్యంగా పలికాడు. పైగా తోటి విద్యార్థులంతా వందేమాతరం అంటూ నినదించేలా చేశాడు. నాటి ఆ బాలుడే కేశవరావు బలిరాం హెడ్గేవార్.
azadi ka amrit mahotsav: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో బలిరాం పంత్, రేవతి దంపతులకు 1889 ఏప్రిల్ 1న ఉగాది రోజు కేశవరావు బలిరాం హెడ్గేవార్ జన్మించారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తికి చెందిన వారి పూర్వీకులు నాగ్‌పుర్‌కు వలస వెళ్లారు. హెడ్గేవార్ తల్లిదండ్రులిద్దరూ 1902లో ప్లేగు బారినపడి మృతిచెందారు. అప్పుడాయన వయసు 13 ఏళ్లు మాత్రమే. నాటి నుంచి హెడ్గేవార్ బాగోగులను ఆయనకు వరుసకు మామ, హిందూ మహాసభ అధ్యక్షుడైన బి.ఎస్. ముంజే చూసుకున్నారు. హైస్కూలులో ఉండగానే ఆంగ్లేయులు పంచిన మిఠాయిని నేలకు కొట్టి.. పరాయి పాలనను నిరసించారు హెడ్గేవార్. దేశాన్ని పట్టిపీడిస్తున్న రాణిని కీర్తించడం మాని.. తల్లి భారతిని ప్రార్థించాలంటూ విద్యార్థులందరితో వందేమాతరం పలికించారు. పాఠశాల నుంచి బహిష్కరణకు గురైనా బెదరకుండా.. చిన్నవయసులోనే తనలో స్వాతంత్య్ర కాంక్ష ఎంత బలీయంగా ఉందో చాటిచెప్పారు. తర్వాత చదువులను యవత్మాల్, పుణెలో పూర్తిచేశారు. మెట్రిక్యులేషన్ తర్వాత వైద్య విద్యను అభ్యసించేందుకు 1910లో కలకత్తా వెళ్లిన హెడ్గేవార్ 1917లో ఫిజిషియన్‌గా పట్టా అందుకున్నారు.
ఆలోచనలకు దారిచూపిన కలకత్తా:భారత స్వాతంత్య్ర పోరాటంలో అతివాద బాట పట్టిన తొలి గ్రూపు అనుశీలన్ సమితి. హెడ్గేవార్ కలకత్తాలో చదువుకుంటున్న రోజుల్లో అందులో చేరారు. సాయుధ తిరుగుబాటు ద్వారా దేశానికి స్వేచ్ఛను తీసుకురావచ్చని నమ్మేవారు. ఒకవైపు వైద్యవిద్యను అభ్యసిస్తూనే అనుశీలన్ సమితిలో క్రియాశీల సభ్యుడిగా కొనసాగారు. మరోవైపు బంకించంద్ర ఛటర్జీ ఆనంద్‌మఠ్, వినాయక్ దామోదర్ సావర్కర్ రాసిన హిందుత్వ, సమర్థ రామదాసు రాసిన దశ్‌బోధ్, బాలగంగాధర్ తిలక్ రచించిన గీతారహస్యం పుస్తకాలు ఆయనపై తీవ్ర ప్రభావం చూపాయి.