ఇస్లామిక్ వ్యవహారాల నిపుణుడు సర్ సయ్యద్ కుమారుడు జస్టిస్ సయ్యద్ మహమూద్. 1850 మే 24న దిల్లీలో జన్మించిన ఆయన.. లండన్‌లో న్యాయశాస్త్రం చదువుకొని అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. అరబిక్, సంస్కృతం, ఆంగ్లం, లాటిన్ భాషల్లో నైపుణ్యం ఆయనకు కలసి వచ్చింది. 1879లో మహమూద్ అవధ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తండ్రి సర్ సయ్యద్ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి సాయం చేసినందుకు కుమారుడికి ఈ పదవి ఇచ్చారనుకున్నవాళ్లు లేకపోలేదు. కానీ అవన్నీ తప్పని కొద్దిరోజుల్లోనే తేలిపోయింది. ఓ కేసులో మహమూద్ తీర్పును ఇంగ్లాండ్ ప్రివీకౌన్సిల్ మెచ్చుకుంది. ఇలాంటి తీర్పులిచ్చే న్యాయమూర్తి ఉండాల్సింది సెషన్స్ కోర్టులో కాదు.. హైకోర్టులో అంటూ కితాబిచ్చింది. ఫలితంగా.. 1882లో ఆయన 32 ఏళ్ల వయసులోనే అలహాబాద్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ హైకోర్టులో ఈ స్థాయికి చేరిన తొలి భారతీయుడు ఆయనే. మరో ఐదేళ్ల తర్వాత పూర్తి హోదా ఇచ్చినా.. ఆంగ్లేయ న్యాయమూర్తులకంటే స్థాయి తక్కువ.
జస్టిస్ మహమూద్ తీర్పులు మాత్రం వారి కంటే ఉన్నతంగా ఉండేవి. సమానత్వానికి, హక్కులకు ఆయన పెద్దపీట వేశారు. న్యాయస్థానంలో తన శ్రేణి తక్కువే అయినా.. శ్వేతజాతి న్యాయపద్ధతులను తప్పుపట్టడంలో ఏమాత్రం వెరవలేదు. అప్పట్లో... నిందితులు ప్రత్యక్షంగా కోర్టుకు రాకున్నా, వారి తరఫున వాదించేవారు లేకున్నా కూడా.. వారి వాదన విన్నట్లుగానే పరిగణించి తీర్పు చెప్పే సంప్రదాయం ఉండేది. దీన్ని తప్పుగా పరిగణించిన జస్టిస్ మహమూద్... ఈ విషయాన్ని ధర్మాసనానికి నివేదించారు. ప్రధాన న్యాయమూర్తి జాన్ ఎడ్జ్ సారథ్యంలోని నలుగురు సభ్యుల ధర్మాసనం (ఇందులో జస్టిస్ మహమూద్ కూడా సభ్యులే) విచారించింది. ఆంగ్లేయ న్యాయమూర్తులు ముగ్గురూ పాత పద్ధతికే ఓటు వేయగా... జస్టిస్ మహమూద్ మాత్రం విభేదిస్తూ తీర్పు రాశారు. 'ప్రజలకు సరైన, సమాన అవకాశం కల్పించని ఈ బ్రిటిష్ ఇండియా చట్టాన్ని సాధ్యమైనంత త్వరగా రద్దు చేయాలి' అని ఘాటుగా వ్యాఖ్యానించారాయన. మరో సందర్భంలో ఆంగ్ల భాషపై పట్టుదలను కూడా ఆయన తప్పు పట్టారు. బ్రిటిష్ న్యాయమూర్తులకు అర్థమయ్యేలా కేసు వివరాలను ఆంగ్లంలోకి తర్జుమా చేయించటం అప్పీల్ చేసిన వారి బాధ్యత. అలా చేయకుంటే కేసును విచారించకుండానే కొట్టేసేవారు. 'ఈ పద్ధతి డబ్బులున్నవారికి అనుకూలంగా ఉంది. తర్జుమా పేరుతో కేసును నిరాకరించటమంటే.. పేదలకు న్యాయాన్ని నిరాకరిస్తున్నట్లే!' అని జస్టిస్ మహమూద్ నిరసన తెలిపారు.