భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ వీరవనిత రాణి ఝాన్సీ లక్ష్మీబాయితో ముఖాముఖి మాట్లాడిన ఏకైక శ్వేతజాతీయుడు జాన్‌లాంగ్. సిడ్నీలో జన్మించి లండన్‌లో న్యాయశాస్త్రం అభ్యసించిన లాంగ్ ఆస్ట్రేలియాలో లాయర్‌గా స్థిరపడటానికి ప్రయత్నించాడు. కానీ అక్కడంత లాభదాయకంగా కనిపించలేదు. అప్పటికే ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న భారత్‌లో ఆయన సమీప బంధువు మంచి న్యాయవాదిగా పేరుగాంచాడు. ఆయన సలహా మేరకు జాన్‌లాంగ్ భారత్ బాట పట్టాడు. 1842లో భార్య, ఇద్దరు పిల్లలతో కలసి కలకత్తాలో అడుగుపెట్టాడు. ఆ ప్రదేశం అంతగా నచ్చని లాంగ్ మేరఠ్ చేరాడు. లాయర్‌గా చేస్తూనే.. అక్కడే 'ది మఫిసిలెట్' అనే పత్రిక స్థాపించాడు. ఇందులో.. ఈస్టిండియా కంపెనీని, వలసవాదాన్ని విమర్శిస్తూ వ్యాసాలు రాసేవాడు. ఈ క్రమంలో.. ఓ కేసులో విజయంతో ఆయన పేరు ఝాన్సీ రాణి దృష్టిలో పడింది.
ఆంగ్లో-సిక్కు యుద్ధం సందర్భంగా ఈస్టిండియా కంపెనీకి సరకులు సరఫరా చేశాడు లాలా జ్యోతీ ప్రసాద్ అనే వర్తకుడు. యుద్ధానంతరం అందుకు చెల్లించాల్సిన మొత్తాన్ని కంపెనీ ఎగ్గొట్టింది. పైగా.. లాలా జ్యోతిప్రసాద్‌పైనే ఫోర్జరీ కేసు పెట్టింది. ఈ కేసులో లాలా తరఫున జాన్‌లాంగ్ వాదించి 1851లో కేసు గెలిచాడు. ఆ సమయంలో ఈస్టిండియా కంపెనీ లాలాకు లక్షల్లో చెల్లించాల్సి వచ్చింది. ఈ కేసులో విజయంతో జాన్‌లాంగ్‌కు భారీ సొమ్ముతోపాటు లాయర్‌గా పేరు ప్రతిష్ఠలూ వచ్చిపడ్డాయి. ఉర్దూ, పర్షియన్ భాషలు నేర్చుకున్న లాంగ్‌పై చాలామంది భారతీయులకు గురి కుదిరింది.
కొన్నాళ్ల తర్వాత వారసులు లేరనే వాదనతో రాణి లక్ష్మీబాయి నుంచి ఝాన్సీ రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు ఈస్టిండియా కంపెనీ ఆదేశాలు జారీ చేసింది. ఆమె దత్త పుత్రుడిని వారసుడిగా గుర్తించి, 'రాజ' కిరీటం ఇవ్వటానికి నిరాకరించింది. భర్త చనిపోవటానికి ముందే పిల్లవాడిని దత్తత తీసుకున్నామంటూ.. లక్ష్మీబాయి వాదించింది. రాజ్యాన్ని కాపాడుకునే క్రమంలో ఈస్టిండియా కంపెనీతో జాన్‌లాంగ్ అయితే సమర్థంగా వాదిస్తాడని ఆయన్ను పిలిపించింది. బంగారు పత్రంపై పర్షియన్‌లో లేఖ రాసి పంపించింది.ఆ సమయానికి జాన్ లాంగ్ ఆగ్రాలో ఉన్నాడు. సకల సౌకర్యాలు, సిబ్బందిని పంపించి భారీ పల్లకీలో ఝాన్సీకి రప్పించారు. రాణి లక్ష్మీబాయితో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఆనాటి కాలంలో పరదాల మాటునే ఉండే రాణిని చూడటమంటే మాటలు కాదు. ఆ సందర్భాన్ని జాన్ లాంగ్ తన పుస్తకంలో వివరించాడు.