Jamsetji Tata: భారత్‌ను పారిశ్రామికంగా ముందుకు తీసుకుపోవాలని తపించిన జంషెడ్‌జీ నుసెర్‌వాంజీ టాటా.. 1868లో వస్త్ర పరిశ్రమలో అడుగుపెట్టి విజయం సాధించాక ఒక్కొక్కటిగా విస్తరించుకుంటూ వెళ్లారు. దేశవిదేశాల్లో పర్యటిస్తూ.. అక్కడి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, భారత్‌కు అనువైన, ఉపయుక్తమైన పరిశ్రమల కోసం ఆలోచించారు. ఈ క్రమంలో తట్టిందే.. ఉక్కు పరిశ్రమ. 1880ల్లోనే ఆయనకు ఆలోచన వచ్చింది. అయితే ఉక్కు పరిశ్రమకు అవసరమైన ఇనుప ఖనిజం తవ్వకాలకు అప్పట్లో బ్రిటిష్ సర్కారు భారతీయ ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించేది కాదు. అసలు అలాంటి పరిశ్రమల స్థాపన అనేది భారతీయుల ఊహకు కూడా అందనిదన్నట్లుగా ఆంగ్లేయ సర్కారు ఆలోచనలుండేవి.
భారత్‌లో రైలుమార్గం పనులు ఆరంభించిన బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్దమొత్తంలో స్టీల్ అవసరం కావటం వల్ల.. తప్పనిసరిగా మైనింగ్ నిబంధనలను సరళీకరించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనికోసమే ఎదురు చూస్తున్న జంషెడ్‌జీ రంగంలోకి దూకారు. భారత జియాలజిస్టు పి.ఎన్.బోస్... స్వర్ణరేఖ నదికి సమీపంలోని సాక్చి గ్రామం వద్ద అపారమైన ఇనుపఖనిజ వనరులున్నాయని నివేదిక ఇచ్చారు. మరికొంతమంది అమెరికా నిపుణులను కూడా జెంషెడ్‌జీ రంగంలోకి దించారు. ఈలోపు టాటా స్వయంగా బ్రిటన్, అమెరికాల్లో పర్యటించి అక్కడి ఉక్కు పరిశ్రమలపై అవగాహన పెంచుకున్నారు. అయినా భారత్‌లోని ఆంగ్లేయ బ్యూరోక్రసీ టాటా ప్రయత్నాలకు గండికొట్టే ప్రయత్నం చేసింది. అనుమతులకు కొర్రీలు పెట్టడమేగాకుండా... బహిరంగంగా అవహేళన చేసింది. అప్పటి భారతీయ రైల్వే చీఫ్ కమిషనర్ ఫ్రెడ్రిక్ అప్కాట్ ఏకంగా... "ఏంటి టాటాలు మా బ్రిటిష్ ప్రమాణాలకు అనుగుణంగా స్టీల్ తయారు చేస్తారా? చేస్తే... ప్రతి ముక్కా అరిగించుకుంటా" అంటూ.. వారు తయారు చేసేది మెత్తగా ఉంటుందన్నట్లు వెటకారపు ప్రకటన విడుదల చేశాడు. స్థానిక ఆంగ్లేయ అధికారులతో వేగలేని జంషెడ్‌జీ 1900లో లండన్ వెళ్లి భారత వ్యవహారాల మంత్రి లార్డ్ హామిల్టన్‌ను కలిశారు. తన ఆలోచనలను ఆయనతో పంచుకున్నారు. ఆంగ్లేయ అధికారుల తీరునూ ఆయనకు వివరించారు. టాటా ప్రణాళికను వినగానే ఫిదా అయిన హామిల్టన్ అన్ని విధాలా సహకరించేందుకు హామీ ఇచ్చారు. లార్డ్ కర్జన్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తానని చెప్పి పంపించారు. 'అత్యంత నమ్మదగిన రాజకీయ దార్శనికుడు' అని జంషెడ్‌జీని హామిల్టన్ ప్రశంసించారు.
అమెరికా నుంచి ప్రపంచ ప్రసిద్ధ నిపుణులను దించిన జంషెడ్‌జీ... సరైన స్థలం కోసం వారితో గుర్రాలు, ఎడ్లబండ్లు, కాలినడకన... అడవుల్లో పర్యటించారు. చివరకు సాక్చి వద్ద (తర్వాత పేరును జంషెడ్‌పుర్‌గా మార్చారు) పరిశ్రమను ఆరంభించారు. 1912 ఫిబ్రవరి 16న తొలి ఉత్పత్తి బయటకు వచ్చింది.