తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రిటిషర్లను చిత్తు చేసిన భారత పహిల్వాన్​!

Azadi Ka Amrit: బుద్ధికుశలతలోనే కాదు.. శారీరకంగా కూడా భారతీయులకంటే తాము బలీయులమని విర్రవీగేవారు ఆంగ్లేయులు. సౌష్ఠవంలో, దేహదారుఢ్యంలోనూ తమ యూరోపియన్ల ముందు భారతీయులు బలాదూర్‌లని నమ్మేవారు. మనల్ని నమ్మించే ప్రయత్నం చేసేవారు. కానీ మన గామా పహిల్వాన్‌ దెబ్బకు అవన్నీ పటాపంచలైపోయాయ్‌! ఐరోపా బలం భళ్లున బద్ధలైంది.

azadi ka amrit
azadi ka amrit

By

Published : May 23, 2022, 6:55 AM IST

Gama pehlwan: 1878 మే 22లో పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలో కుస్తీ వస్తాదుల కుటుంబంలో జన్మించాడు గులాం మహమ్మద్‌ బక్ష్‌ భట్‌. చిన్నతనం నుంచే ఆడిన ప్రతి పోటీలోనూ నెగ్గుతూ గామా పహిల్వాన్‌గా పేరొందాడు. పదేళ్ల వయసులోనే జోధ్‌పుర్‌ రాజా నిర్వహించిన పోటీలో ఆ కాలంలో అత్యుత్తమం అని భావించిన భారతీయ పహిల్వాన్‌లను ఓడించి సంచలనం సృష్టించాడు. 1900 నాటికి భారత్‌లో ఎక్కడ కుస్తీ పోటీ జరిగినా గామాదే విజయంగా మారిపోయింది. ఫలితంగా దాట్లా సంస్థాన కుస్తీవీరుడిగా చేరారు.

అదే సమయంలో 1905 బెంగాల్‌ విభజన.. తదనంతరం జాతీయోద్యమం ఊపందుకుంటున్న వేళ.. భారతీయులను అన్ని విధాలుగానూ తమకంటే హీనులుగా చిత్రీకరించసాగారు ఆంగ్లేయులు. భారతీయులది బలహీన జాతి అని ఎద్దేవా చేసేవారు. ఇది తప్పని నిరూపించాలని మౌలానా ఆజాద్‌, వీర్‌ సావర్కర్‌, లజపతిరాయ్‌, తిలక్‌ తదితరులు అవకాశం కోసం ఎదురు చూడసాగారు. గామా రూపంలో వారికి ఆ తరుణం వచ్చింది.

బెంగాల్‌కు చెందిన సంపన్న వ్యాపార వేత్త, జాతీయోద్యమ నాయకుడు శరత్‌మిత్రా సాయంతో గామాను 1910లో లండన్‌ తీసుకొని వెళ్లారు. అక్కడ ప్రపంచ కుస్తీ ఛాంపియన్‌షిప్‌లో ఆడించాలనుకున్నారు. కానీ కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తటం వల్ల పాల్గొనలేని పరిస్థితి తలెత్తింది. దీంతో.. లండన్​లోనే ప్రైవేటుగా గామాతో కుస్తీ పోటీ ఏర్పాటు చేశారు. దమ్ముంటే గామాను ఎదుర్కోవాలని.. 5 నిమిషాలకంటే ఎక్కువ సేపు బరిలో ఉంటే ఐదు పౌండ్లు ఇస్తామని.. అక్కడి పత్రికల్లో ప్రకటనలతో సవాల్‌ విసిరారు. తొలి రెండురోజుల్లో 15 మంది ఇంగ్లిష్‌ రెజ్లర్లు వచ్చి గామా చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఈ విషయం ప్రచారం కావటం వల్ల ఏకంగా అమెరికా రెజ్లింగ్‌ ఛాంపియన్‌ బెంజిమన్‌ రోలర్‌ రంగంలోకి దిగాడు. అతగాడినీ 3 నిమిషాల్లో చిత్తు చేశాడు మన గామా. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గామాను అనుమతించి.. అప్పటి ఛాంపియన్‌ జైస్కోతో తలపడమన్నారు.

1910 సెప్టెంబరు 10న లండన్‌లో వీరిద్దరి పోరు హోరాహోరీగా మొదలైంది. 12వేల మంది సమక్షంలో పొట్టిగా ఉన్న గామా.. మూడు గంటల పాటు జైస్కోని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు.. వెలుతురు తగ్గిపోతుండటం వల్ల మ్యాచ్‌ను ఆ రోజుకు ఆపేసి తర్వాతి శనివారానికి వాయిదా వేశారు. ఆ సమయానికి గామా సిద్ధమై వచ్చినా.. జైస్కో లండన్‌ నుంచి పారిపోయాడు. దీంతో గామా పహిల్వాన్‌ను ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌గా ప్రకటించారు. తిరిగి వచ్చిన గామా పహిల్వాన్‌కు భారత్‌లో అఖండ స్వాగతం లభించించింది. లండన్‌లో యూరోపియన్లను చిత్తుగా ఓడించి రావటం.. స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న భారతీయులకు అద్వితీయమైన బలాన్నిచ్చింది. అలహాబాద్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సమావేశానికి గామా పహిల్వాన్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి సత్కరించారు. 1928లో పటియాలా మహారాజు మళ్లీ జైస్కోను పిలిపించి.. గామాతో పోరు ఏర్పాటు చేశారు. ఈసారి పటియాలాలో జరిగిన ఈ పోరును తిలకించటానికి సామాన్య ప్రజానీకంతో పాటు ఎంతో మంది సంస్థానాధీశులు, గవర్నర్లు వచ్చారు. భారత్‌- బ్రిటన్‌ మధ్య పోరుగా ప్రచారమై.. అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిన ఈ పోటీలో కేవలం 42 సెకన్లలోనే జైస్కోను మట్టికరిపించి ఆశ్చర్య పరిచాడు 50 ఏళ్ల గామా పహిల్వాన్‌! 'గామా బరిలో దిగిన ప్రతిసారీ భారత స్వాతంత్య్రోద్యమానికి ప్రతీకగా నిలిచాడు. ఆంగ్లేయులపై పోరులో సగటు భారతీయుడి ప్రతిబింబంగా తోచాడు' అని అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుడు జోసెఫ్‌ ఆల్టర్‌ వ్యాఖ్యానించారు.

పహిల్వాన్‌ గామా.. లక్షల మంది భారతీయులకే కాదు.. కరాటే వీరుడు బ్రూస్‌లీకి కూడా స్ఫూర్తి ప్రదాత. దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిన గామా... విభజన సమయంలో జరిగిన గొడవల్లో అల్లరి మూకల నుంచి అనేక మంది హిందువుల ప్రాణాలు కాపాడారు. తానుంటున్న వీధిలో హిందువులకు రక్షణ కల్పిస్తానని మాటిచ్చి నిలబడ్డారు. కానీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటం వల్ల నిస్సహాయ స్థితిలో ఓరోజు అక్కడి హిందువులందరినీ క్షేమంగా సరిహద్దు దాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్లారు. చివరి రోజుల్లో పాకిస్థాన్‌ ప్రభుత్వం నుంచి సాయం లేక.. ఆర్థికంగా ఇబ్బందుల పాలై 82 ఏళ్ల వయసులో కన్నుమూశారు గామా. ఇప్పటికీ భారత రెజ్లింగ్‌ అఖాడాల్లో గామా పహిల్వాన్‌ పేరు వినిపిస్తునే ఉంటుంది.

ఇదీ చదవండి:జాత్యహంకారం రగిల్చిన కసి... 'మేడిన్ బ్రిటిష్ ఇండియా'

ABOUT THE AUTHOR

...view details