మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో లక్షల మంది భారతీయులను సైన్యంలోకి తీసుకొని పదాతిదళంలో విదేశాల్లో తమ తరఫున బరిలోకి దించిన ఆంగ్లేయులు.. వాయుసేన రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లోకి మాత్రం వారిని దాదాపు దూరంగానే ఉంచారు. కొంతమందిని సాంకేతిక, ఇతర పనులకు వాడుకున్నా.. భారతీయులకు యుద్ధ విమానాలు నడిపే తెలివి లేదని భావించారు. ఈ భావన.. చాలాకాలం కొనసాగింది. అందుకే.. బ్రిటిష్ వాయుసేన మాజీ అధిపతి ఎయిర్‌మార్షల్ సర్ జాన్ స్టీల్.. "భారతీయులకు యుద్ధవిమానాలు నడిపే శక్తియుక్తులు లేవు. అది మగవారి పని" అంటూ వ్యాఖ్యానించాడు. ఆంగ్లేయులకు ఇలాంటి చిన్నచూపున్న నేపథ్యంలో నలుగురు భారతీయులు- కృష్ణచంద్ర వెలింకర్, సర్దార్ హర్దీత్ సింగ్ మాలిక్, ఎరోల్ సువో చందర్‌సేన్, ఇంద్రాలాల్ రాయ్‌లు.. అనూహ్యంగా రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రవేశించారు. తమ వీరోచిత పోరాటాలతో ఆంగ్లేయులను ఆశ్చర్యపరిచారు. తర్వాతి కాలంలో భారత వాయుసేన ఆవిర్భావానికి బీజాలు వేశారు. ఈ నలుగురిలో ఇద్దరు (కృష్ణచంద్ర, ఇంద్రాలాల్ రాయ్) వీరమరణం పొందారు. తర్వాత తెల్లవారి కళ్లు తెరుచుకోవటం ఆరంభమైంది. మొదటి ప్రపంచయుద్ధం ముగిశాక భారతీయులకు సైన్యంలో ప్రాధాన్యం పెంచాలని.. పదోన్నతులివ్వాలని, సొంతంగా వాయుసేన ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెరిగాయి. రాయ్, సర్దార్ మాలిక్, కృష్ణచంద్ర, చందర్‌సేన్‌ల వీరత్వం, ప్రతిభను ఆంగ్లేయ అధికారులే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో.. 1932 అక్టోబరు 8న భారత వాయుసేన ఆరంభానికి బ్రిటిష్ సర్కారు అంగీకరించింది. ఆరుగురు భారతీయులను యుద్ధ పైలట్లుగా ఎంపిక చేసి శిక్షణ కోసం ఇంగ్లాండ్‌కు పంపించింది. వీరికి తోడుగా ఆంగ్లేయ పైలట్లూ సేనలో ఉండేవారు. కానీ భారతీయులెంతగా అల్లుకుపోయారంటే.. తమ తెల్లవారందరినీ బ్రిటిష్ సర్కారు వెనక్కి తీసుకొని.. 1939 సెప్టెంబరు 3న పూర్తిగా భారతీయులతోనే తొలి వాయుసేన దళాన్ని ఆవిష్కరించింది. భారతీయుడు సుబ్రతో ముఖర్జీని కమాండింగ్ అధికారిగా నియమించింది.
మార్చురీ నుంచి లేచివచ్చి..:సంపన్న బెంగాలీ కుటుంబంలో 1898లో కలకత్తాలో జన్మించిన ఇంద్రాలాల్ రాయ్ మొదటి ప్రపంచయుద్ధం నాటికి లండన్ స్కూల్లో చదువుతున్నాడు. చదువుల్లో చురుకైన రాయ్ ఓ ఆధునిక మోర్టార్ డిజైన్ గీసి.. యుద్ధ కార్యాలయానికి పంపించాడు. అవి నచ్చిన సర్కారు.. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపకారవేతనం ఇచ్చింది. రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా చేరతానంటూ దరఖాస్తు చేసుకుంటే.. ఆంగ్లేయులు వైద్య కారణాలతో నిరాకరించారు. ఆ కారణాలు తప్పని నిరూపించటంతో చేర్చుకోక తప్పింది కాదు. 18 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన రాయ్.. జర్మనీ విమానాలపై దాడులతో అందరినీ ఆశ్చర్యపర్చటం మొదలెట్టాడు. ఈ క్రమంలో 1917 డిసెంబరు 6న ఆయన నడుపుతున్న విమానం జర్మనీ దాడిలో ఫ్రాన్స్‌లో కూలింది. చనిపోయాడనుకొని రాయ్‌ని మార్చురీలో పెట్టారు. సృహలోకి వచ్చాక మార్చురీ తలుపులు బాదటం వల్ల.. చూసిన సిబ్బంది ఆయనను ఇంగ్లాండ్‌కు తరలించారు. 1918లో మళ్లీ యుద్ధ విమానమెక్కాడు. నెలరోజుల్లో.. పది జర్మనీయుద్ధ విమానాలను నేలకూల్చి ఫ్లయింగ్ ఏస్ అవార్డు సాధించాడు. దురదృష్టవశాత్తు.. 1918 జులై 22న జర్మనీ దాడిలో విమానం కూలి 19 ఏళ్ల రాయ్ కన్నుమూశారు.