పూర్వం మన గ్రామాల్లో మనిషి బతకడానికి అవసరమైన వస్తువులన్నీ ఎక్కడికక్కడే లభించేవి. భారతావని బ్రిటిషర్ల చేజిక్కాక మొత్తం వ్యవస్థ నాశనమైంది. తమ అవసరాలన్నీ తామే తీర్చుకునే స్థాయిలో ఉన్న స్వయం సమృద్ధ పల్లెలు.. అన్నీ దిగుమతి చేసుకునే అధ్వానస్థితికి చేరుకున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించే నాటికి దేశ జనాభాలో 83% మంది పల్లెసీమల్లోనే ఉండేవారు. వారిలో అత్యధికులు నిరుపేదలే. గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా స్వతంత్ర భారతంలో ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం సాగింది. స్వయంపాలన సాధనలో భాగంగా స్థానిక సంస్థలకు రాజ్యాంగంలో చట్టబద్ధ హోదా దక్కింది. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమిస్తూనే ఉన్నాయి. అయినా.. పల్లెలు ఇప్పటికీ సమస్యలతో సతమతమవుతూనే ఉన్నాయి.
పల్లెల్లో నివసిస్తున్న ప్రజల బతుకులకు కొత్తదారి చూపడమే గ్రామీణాభివృద్ధి ప్రధాన లక్ష్యం. ఇది వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, కులవృత్తులు, ఉద్యోగిత, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అభ్యున్నతుల సమ్మేళనం. అందుకే 1952లో కమ్యూనిటీ డెవలప్‌మెంట్, 1953లో నేషనల్ ఎక్స్‌టెన్షన్ పథకాలను తీసుకొచ్చారు. నిధులు ఖర్చయినా ఎలాంటి ఫలితాలు రాలేదు. వాటిని సమీక్షించేందుకు 1957 జనవరిలో బల్వంత్‌రాయ్ మెహతా కమిటీని వేశారు. గ్రామాల్లోని సమస్యలు అక్కడే పరిష్కారం కావాలని, ఇందుకు పాలన వికేంద్రీకరణే శరణ్యమని ఆ కమిటీ సూచించింది. ఈ మేరకు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలంది. స్థానిక ప్రణాళికల రూపకల్పన, ఆచరణ బాధ్యత గ్రామ పంచాయతీలకే అప్పగించాలంది. ఈ కమిటీ సిఫారసుల అమలుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇదే సమయంలో హరితవిప్లవం తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో పెనుమార్పులకు నాందిపలికారు. అయితే.. ఇరవై ఏళ్లపాటు కొనసాగిన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా గ్రామాల బాగుకు పూర్తిస్థాయిలో పాటుపడలేదని, అమలులో లోపాలను సరిదిద్దాలనే లక్ష్యంతో 1977లో కేంద్రం ప్రభుత్వం అశోక్‌మెహతా కమిటీని వేసింది. ఇది రెండంచెల వ్యవస్థను సిఫారసు చేసింది. స్థానిక సంస్థల పాలనలో రాష్ట్రాల భాగస్వామ్యం ఉండాలని సూచించింది. పంచాయతీ సంస్థలను రాజ్యాంగంలో చేర్చాలని అభిప్రాయపడింది. ఈ మేరకు పలురాష్ట్రాలు ముందడుగు వేశాయి.
నరేగా.. నమ్మకమైన నేస్తం:గ్రామాల్లో నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఏడాదిలో వంద రోజుల పని కల్పించాలనే లక్ష్యంతో 2006లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) ప్రారంభించారు. మొదట 200 జిల్లాల్లో ప్రారంభించి, 2007-08లో మరో 230 జిల్లాలకు విస్తరించారు. 2008 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు ప్రారంభించారు. మార్చి 27 నాటికి 83.82 లక్షల పనులు, 133.09 లక్షల పనిదినాలు కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని 2020 నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది.
పథకాలు.. ఎన్నెన్నో మలుపులు:గ్రామీణ ప్రాంతాల స్వయం ఉపాధికి స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (ఎస్‌జీఎస్‌వై), వెనుకబడిన జిల్లాల్లో వంద రోజుల పని కల్పించడానికి సంపూర్ణ రోజ్‌గార్ యోజన (ఎస్‌జీఆర్‌వై) తీసుకొచ్చారు. దేశంలో బాగా వెనుకబడిన జిల్లాల్లోని వారికి ఉపాధిహామీగా జయప్రకాశ్ రోజ్‌గార్ గ్యారెంటీ యోజన ప్రారంభించారు. దీని అమలులో భాగంగా గిరిజన ఆవాసాలు, గ్రామీణ రోడ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, మార్కెట్ సెంటర్ల ఏర్పాటు దిశగా దృష్టి సారించారు. వర్షాభావ ప్రాంతాల్లో వ్యవసాయాభివృద్ధికి వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కార్యక్రమం చేపట్టారు. భారత్ నిర్మాణ్ పథకం కింద విద్యుత్, తాగునీటి సౌకర్యం, వెయ్యి జనాభాకంటే ఎక్కువ ఉన్న గ్రామాలకు అన్ని కాలాల్లో వెళ్లేలా రహదారుల నిర్మాణం కీలకంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వసతుల పెంపునకు రూరల్ హెల్త్ మిషన్ కార్యక్రమం, సంపూర్ణ పారిశుద్ధ్య పథకం (టీఎస్‌సీ), 2014 నుంచి అమలు చేస్తున్న స్వచ్ఛభారత్ పథకాలు కొంతవరకు సత్ఫలితాలనిచ్చాయి.
పంచవర్ష ప్రణాళికలతో కొత్త పథం
- దేశాభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలు కీలకబాటలు వేశాయి. తొలి ప్రణాళిక (1951-56) కాలంలో అమలైన సామాజిక అభివృద్ధి విధానం పల్లె ప్రగతికి తొలిబాట వేసింది.
- రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో సహకార సేద్యంపై దృష్టి సారించారు.
- మూడో ప్రణాళిక ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, పంచాయతీ వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా ముందుకు వెళ్లింది.
- నాలుగో ప్రణాళిక కాలంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం అమలు చేశారు. ఇది గ్రామీణాభివృద్ధిలో మరో మేలిమలుపు.
- అయిదో ప్రణాళికాకాలంలో గ్రామీణ పేదరిక నిర్మూలన లక్ష్యంగా కనీస అవసరాల పథకం అమలైంది.
- ఆరో ప్రణాళిక కాలంలో సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా బహుముఖ కార్యాచరణకు దిగారు. గ్రామాల సామాజిక, ఆర్థికాభివృద్ధికి, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమిచ్చారు.
- ఏడో ప్రణాళికలో గ్రామాలే లక్ష్యంగా భూసంస్కరణలు మొదలయ్యాయి.
- ఎనిమిదో ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చారు. రోడ్లు, చిన్న నీటి వనరుల అభివృద్ధి, భూసార సంరక్షణ, సామాజిక అడవుల పెంపకంపై శ్రద్ధ చూపారు.
- తొమ్మిదో ప్రణాళికలో సంస్కరణలకు పెద్దపీట వేశారు. ప్రణాళికల రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం దిశగా అడుగులు పడ్డాయి. పారదర్శకత, జవాబుదారీతనం లక్ష్యంగా పంచాయతీరాజ్, ప్రజా సంఘాల బలోపేతానికి ప్రాధాన్యమిచ్చారు.
తర్వాతి ప్రణాళికల్లో గరీబీ హఠావో నినాదాన్ని పునాదిగా చేసుకుని వివిధ పథకాలను తీసుకొచ్చారు. 1992 సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా ఇచ్చారు. 2015 జనవరి నుంచి అమలులోకి వచ్చిన నీతిఆయోగ్ ద్వారా స్థానిక సంస్థలకు నేరుగా నిధులు ఇస్తున్నారు.