India pakistan partition history: 1947 జూన్ 3న ప్రకటించిన మౌంట్‌బాటెన్ ప్లాన్ ప్రకారం.. దేశ విభజన ఖాయమైంది. తమ రాష్ట్రాలను విభజించాలో లేదో తేల్చుకునే అవకాశాన్ని పంజాబ్, బెంగాల్ అసెంబ్లీలకు ఇచ్చారు. ఒకవేళ విభజన కావాలనుకుంటే వైస్రాయ్ సరిహద్దు కమిషన్‌ను ఏర్పాటు చేస్తాడని ఆ ప్లాన్‌లోనే స్పష్టం చేశారు. తదనుగుణంగా ఏర్పాటైందే భారత్, పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దులను ఖరారు చేసిన రాడ్‌క్లిఫ్ కమిషన్. 1947 జులై 8న భారత్‌లో అడుగుపెట్టి.. 10న వైస్రాయ్‌ని కలిసి విభజన గీతలు గీసే పని మొదలెట్టిన లండన్ లాయర్ రాడ్‌క్లిఫ్... భారత రాజకీయ నాయకులెవరినీ కలవడానికి ఇష్టపడలేదు. వారేమైనా చెప్పాలనుకుంటే.. లాహోర్, కోల్‌కతాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు రాతపూర్వకంగా ఇవ్వాలని స్పష్టంచేశాడు. విభజనకు ముందు 40% దేశం సంస్థానాల పాలనలో ఉంది. అంటే వాటిపై ఆంగ్లేయులకు నేరుగా అధికారం లేదు. కాబట్టి వాటిని విభజించే అధికారం బ్రిటన్‌కు లేకుండా పోయింది. మతపరమైన విభజన కావడంతో సమస్యంతా పంజాబ్, బెంగాల్ రాష్ట్రాల్లో కేంద్రీకృతమైంది. అంటే రాడ్‌క్లిఫ్ బృందానికి అప్పగించిన పని.. రెండు ప్రాంతాల్లోనూ విస్తరించి, 55% దాకా ముస్లింలున్న బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలను ఇరుదేశాల మధ్య విభజించడమే. ఇందుకోసం రాడ్‌క్లిఫ్ సారథ్యంలో రెండు సరిహద్దు కమిషన్లు ఏర్పడ్డాయి. జులై 16-24 మధ్య కోల్‌కతాలో బెంగాల్ కమిషన్, జులై 21-31 మధ్య లాహోర్‌లో పంజాబ్ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేశాయి. అస్సాంలోని సిల్హేట్ జిల్లాపై ఆగస్టు 4-6 దాకా అభిప్రాయాలు సేకరించారు. రాడ్‌క్లిఫ్ నేరుగా ఎక్కడా ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనలేదు. కానీ ఈ సమావేశాల్లో వివిధ వర్గాల నుంచి వచ్చిన సమాచారం, నివేదికల్ని చదివే ఏర్పాటు చేసుకున్నాడు.
సాగు భూములపై లీగ్ కుట్ర:పంజాబ్, బెంగాల్‌ల్లో ముస్లిం జనాభా అధికంగా ఉండటంతో ఆ రెండు రాష్ట్రాలనూ పూర్తిగా తమకే కేటాయించాలని ముస్లింలీగ్ కోరింది. తద్వారా పంజాబ్‌లోని సారవంతమైన భూములు తమ పరమవుతాయని ఆశించింది. ఆ తర్వాత కాస్త తగ్గి కొన్ని ప్రాంతాలను భారత్‌కు ఇవ్వడానికి అంగీకరించింది. కేవలం మతప్రాతిపదికనే విభజన జరగాలని తొలుత అనుకున్నా.. ఆచరణలోకి వచ్చేసరికి వ్యూహాత్మక ప్రాంతాలు, రహదారులు, సాగునీటి వ్యవస్థల్లాంటి అంశాలూ ప్రభావితం చేశాయి. ఇందులో కొన్ని భారత్‌కు, మరికొన్ని పాకిస్థాన్‌కు ప్రయోజనం కల్గించాయి. ఉదాహరణకు కోల్‌కతా నుంచి గంగానదికి జలమార్గం విషయంలో ఇబ్బంది లేకుండా ఉండటానికి అత్యధిక ముస్లిం జనాభాగల ముర్షీదాబాద్‌ను భారత్‌కు ఇచ్చారు. హిందూ మెజార్టీ ఖుల్నా జిల్లా పాకిస్థాన్‌కు (తర్వాత బంగ్లాదేశ్‌కు) వెళ్లింది. ఈశాన్య భారతంలోని ఇతర ప్రాంతాలను భారత్‌కు అనుసంధానించేందుకు వీలుగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పలు ముస్లిం మెజార్టీ ప్రాంతాలను భారత్‌లో కలిపారు. ఇక పంజాబ్‌లో ముస్లింలు అధికంగా ఉన్నప్పటికీ గురుదాస్‌పూర్ జిల్లాను భారత్‌లో కలిపారు. కారణం దీన్నుంచి కశ్మీర్‌కు నేరుగా వెళ్లే దారులుండటమే. అలాగే సింధ్‌లోని అనేక హిందూ మెజార్టీ ప్రాంతాలను పాకిస్థాన్‌లో ఉంచారు. ఒకప్పటి సిక్కు సామ్రాజ్య రాజధాని లాహోర్‌ను తొలుత భారత్‌కు కేటాయించారు. కానీ పాకిస్థాన్‌కు పెద్ద నగరం ఏదీ ఉండదనే భావనతో మళ్లీ దాన్ని తొలగించారు. చాలా అంశాలపై కాంగ్రెస్-ముస్లింలీగ్‌లు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో రాడ్‌క్లిఫ్ అంతిమంగా తనకు తోచిన నిర్ణయం తీసుకుని ఆమోదముద్ర వేసేశాడు. విశాల దేశాన్ని 4 వారాల్లో 2 ముక్కలు చేసేశాడు. ఆగస్టు 9 కల్లా విభజన పూర్తి చేసిన రాడ్‌క్లిఫ్ అదే రోజు.. తొలి ముసాయిదాను మౌంట్‌బాటెన్‌కు చూపించాడు. ఆయన సూచనల మేరకు 12 నాటికి విభజన తుది ముసాయిదా సిద్ధం చేశాడు.