AZADI KA AMRIT MAHOTSAV: ఏటా బడ్జెట్ రాగానే జీడీపీ లెక్కలు వేయటం... ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగటంపై కలలు కనటం మనకు ఆనవాయితీ. కానీ ఇప్పుడు కంటున్న ఈ కల ఎన్నడో సాకారమైందనీ... ఆంగ్లేయుల పాలన కారణంగా అది కుప్పకూలిందనేది చరిత్ర చెప్పే సత్యం. బ్రిటన్, అమెరికాల కంటే ఎంతో సంపన్నంగా ఉండేది భారతావని. ఇది భారత్ తనకు తానిచ్చుకునే కితాబు కాదు. బ్రిటన్ ఆర్థిక చరిత్రకారుడు ఆగ్నస్ మాడిసన్ వెల్లడించిన నగ్నసత్యం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాల పునర్‌వ్యవస్థీకరణ కోసం ఏర్పడింది ఆర్గనైజేషన్ ఫర్ యూరోపియన్ ఎకనామిక్ కో ఆపరేషన్ (ఓఈఈసీ). తర్వాత 60ల్లో ఇది ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్)గా రూపాంతరం చెందింది. ప్రపంచంలో అత్యధిక ఆదాయంగల దేశాలకు ఇందులో సభ్యత్వముంది. వీరంతా కలసి ఆర్థికాభివృద్ధిపై ఓ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. ఈ మేరకు... అధ్యయనం చేసి... మార్గదర్శనానికి ఓ నివేదిక ఇవ్వాలని ఆగ్నస్ మాడిసన్‌ను కోరారు. కేవలం వర్తమానాన్ని చూడకుండా... చరిత్ర పుటల్లోకి తవ్వి చూశారు మాడిసన్. 'ది వరల్డ్ ఎకానమీ... ఎ మిలేనియల్ పర్‌స్పెక్టివ్' అనే నివేదికను 2001లో సమర్పించారు. మాడిసన్ పరిశోధనలో అందరినీ ఆశ్చర్య పరిచే అనేక అంశాలు వెలుగు చూశాయి.
దాదాపు వెయ్యికిపైగా సంవత్సరాల్లో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను, ప్రపంచ యవనికలో వాటి స్థానాన్ని అధ్యయనం చేసిన మాడిసన్... క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నుంచి 15వ శతాబ్ది దాకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది అగ్రశ్రేణి అని తేల్చారు. క్రీస్తు శకం 1000 నాటికి ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 28శాతం. ఈస్టిండియా కంపెనీ మనదేశంలో అడుగుపెట్టే నాటికి ఇది సుమారు 23 శాతంగా ఉంది. యావత్ ఐరోపా అంతా కలిపినా అంత లేదు. అలనాటి భారతీయుల నైపుణ్యమే ఈ ఆర్థిక పరిపుష్టికి కారణం. నూలు దుస్తులు, పట్టుకుంటే జారిపోయే మెత్తటి పట్టు, ఊలు వస్త్రాలు, ఉక్కు, ఇనుము వస్తువులు... సుగంధ ద్రవ్యాలు, వ్యవసాయ ఉత్పత్తులు, కళాకృతులు, ఆభరణాలు... ఇలా భారత్‌లో తయారయ్యే ఏ ఉత్పత్తైనా అత్యంత నాణ్యమైనదై ఉండేది. సముద్రమార్గాల ద్వారా విదేశాలకు వెళ్లేవి. విదేశీయులను ఆకర్షించేవి. వాటి స్థానంలో వెండి, బంగారంతో ఓడలు భారత్‌కు తిరిగి వచ్చేవి. భారత నౌకాపరిశ్రమకు ఆ కాలంలో ప్రపంచంలోనే మంచి పేరు ఉండేది. 400 నుంచి 500 టన్నుల బరువుగల మన్నికైన నౌకల్ని భారత్‌లో తయారు చేసేవారు.