తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: లఖ్‌నవూ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన జిన్నా.. - అజాదీ కా అమృత్ మహోత్సవ్​

Azadi Ka Amrit Mahotsav: భారత స్వాతంత్య్రోద్యమంలోని అద్భుతమైన ఘట్టాల్లో అరుదైనదీ, నేటికీ అందరినీ ఆశ్చర్య పరిచేది.. లక్నో (ప్రస్తుత లఖ్‌నవూ) ఒప్పందం! ఉప్పు నిప్పుగా ఉన్న హిందూ-ముస్లింలు ఏకమై మా దేశాన్ని మేమే ఏలుకుంటామంటూ స్వయం పాలనకు ఆంగ్లేయులను డిమాండ్‌ చేసిన అద్వితీయ ఘట్టానికి వేదిక ఈ ఒప్పందం. బలమైన హిందూవాది బాలగంగాధర్‌ తిలక్‌.. దేశ విభజనను బలంగా కోరుకున్న మహమ్మద్‌ అలీ జిన్నాల ప్రోద్బలంతో కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌ల మధ్య కుదిరిందీ ఒప్పందం. ఎంత ఆశ్చర్యకరంగా కుదిరిందో అంతే అనూహ్యంగా ఆచరణలో ఆవిరైంది.

Azadi Ka Amrit Mahotsav
Azadi Ka Amrit Mahotsav

By

Published : Apr 25, 2022, 7:25 AM IST

Azadi Ka Amrit Mahotsav: బ్రిటిష్‌ వారి 'విభజించు-పాలించు' విధానంలో భాగంగా 1906లో ఆవిర్భవించిన ముస్లింలీగ్‌ మొదట్నుంచీ కాంగ్రెస్‌ సారథ్యాన్ని ప్రశ్నిస్తూ వచ్చింది. కాంగ్రెస్‌ యావద్దేశానికి ప్రతినిధి కాదని.. ముస్లింలందరికీ తామే ప్రతినిధులమని చెప్పేది. బెంగాల్‌, యూపీల్లోని కొందరు బ్రిటిష్‌ అనుకూల ముస్లింలతో కూడిన ఈ లీగ్‌ను కాంగ్రెస్‌ మొదట్లో పట్టించుకోలేదు. చాలామంది ముస్లింలు కాంగ్రెస్‌ గొడుగు కిందే ఉండేవారు. 1911లో బెంగాల్‌ విభజన రద్దవడం, ముస్లింలీగ్‌లో కొత్తతరం అడుగుపెట్టడం వల్ల.. లీగ్‌లో కాసింత బ్రిటిష్‌ వ్యతిరేకత కనిపించింది. టర్కీలో ఖలీఫాను ఆంగ్లేయులు వ్యతిరేకించడమూ ముస్లింలపై ప్రభావం చూపింది.

తిలక్‌-జిన్నాల స్నేహం:1913లో మహమ్మద్‌ అలీ జిన్నా కాంగ్రెస్‌లో ఉంటూనే ముస్లింలీగ్‌ సభ్యత్వం తీసుకున్నారు. ఇంతలో మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. యుద్ధంలో తమకు సాయం చేస్తే.. యుద్ధానంతరం రాజ్యాంగ సంస్కరణల గురించి ఆలోచిస్తామంటూ భారతీయులకు బ్రిటన్‌ గాలం వేసింది. అదే సమయంలో ఆరేళ్ల తర్వాత మాండలే జైలు నుంచి తిలక్‌ విడుదలయ్యారు. రాజద్రోహం కేసులో తన తరఫున వాదించిన జిన్నాతో తిలక్‌కు మంచి స్నేహం ఉండేది. ముస్లింలీగ్‌తో స్నేహంగా ఉంటే దేశానికి స్వయం పాలన త్వరగా వస్తుందని కాంగ్రెస్‌ నేతలను తిలక్‌, జిన్నాలు ఒప్పించారు. అంతకుముందు ముస్లింలకు చట్టసభల్లో ప్రత్యేక సీట్ల ప్రతిపాదనను వ్యతిరేకించిన జిన్నా సైతం.. స్వయం పాలన వచ్చేదాకా ఈ ఏర్పాటు ఉండాలని అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ చర్చల అనంతరం 1916 డిసెంబరులో లఖ్‌నవూలో జరిగిన రెండు పార్టీల సదస్సుల్లో ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. అదేనెల 31న జరిగిన ముస్లింలీగ్‌ సమావేశానికి తిలక్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. తర్వాత లఖ్‌నవూ ఒప్పందంలోని కీలక అంశాలను తమ ఉమ్మడి డిమాండ్లుగా కాంగ్రెస్‌-లీగ్‌లు ఆంగ్లేయ సర్కారు ముందుంచాయి. "భారతీయులకు స్వయం పాలన కల్పించాలి. సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో సగం మంది భారతీయులు ఉండాలి. ముస్లింలకు కౌన్సిల్‌లో మూడోవంతు సీట్లివ్వాలి. రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ వారికి కచ్చితమైన సంఖ్యలో ప్రత్యేక సీట్లు కేటాయించాలి" అనేవి ఒప్పందంలోని ప్రధానాంశాలు. ఈ ఒప్పందంలోని చాలా అంశాలను ఆంగ్లేయ సర్కారు.. భారత ప్రభుత్వ చట్టం-1919లో పొందుపరిచింది. దీని ప్రకారం.. ముస్లింలు అధికంగా ఉన్న బెంగాల్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో వారికి సీట్లు స్వల్పంగా తగ్గగా.. జనాభా ఎక్కువగా లేని రాష్ట్రాల్లో భారీగా పెరిగాయి. అప్పటి జనాభాలో మూడోవంతు లేని ముస్లింలకు మూడోవంతు సీట్లను కేటాయించాలనడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మత రాజకీయాలకు తెర తీసిందనీ కాంగ్రెస్‌పై విమర్శలు చెలరేగాయి. ముస్లింలీగ్‌లోనూ వ్యతిరేకత వ్యక్తమవడం గమనార్హం.

ప్రాధాన్యమివ్వని ఆంగ్లేయులు:హిందూ-ముస్లిం ఐక్యతను సహించని ఆంగ్లేయ ప్రభుత్వం మొదటి ప్రపంచ యుద్ధానంతరం లఖ్‌నవూ ఒప్పందాన్ని పట్టించుకోలేదు. పైగా.. స్వయం పాలన హామీనీ అటకెక్కించింది. 1919లో ప్రకటించిన మాంటెగ్‌-ఛెమ్స్‌ఫోర్డ్‌ సంస్కరణల్లో లఖ్‌నవూ ఒప్పంద కీలక డిమాండ్లను ప్రస్తావించనే లేదు. ఒప్పందం అమలుకు డిమాండ్‌ చేయాల్సిన కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ నేతలు సైతం ఆంగ్లేయ సర్కారు కమిటీల ముందు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. వీటన్నింటికీ తోడు.. తిలక్‌ మరణించడం, కాంగ్రెస్‌ పగ్గాలను గాంధీజీ చేపట్టడం, ఆయన పోరాట పంథా జిన్నాకు నచ్చకపోవడం, కాంగ్రెస్‌లో జిన్నా ప్రాబల్యం తగ్గటంతో లఖ్‌నవూ ఒప్పందం క్రమంగా మరుగున పడింది. హిందూ-ముస్లిం ఐక్యతకు గాంధీజీ పెద్దపీట వేసినా.. మతం, కులం ఆధారంగా ప్రత్యేక సీట్లను ఆయన వ్యతిరేకించారు. హిందూ-ముస్లింలు కలసి పాలన చేద్దామని ఒప్పందం కుదరడంలో భాగమైన జిన్నాయే తర్వాతి కాలంలో ప్రత్యేక పాకిస్థాన్‌కు పట్టుబట్టడం రాజకీయ వైచిత్రి..!

ఇదీ చదవండి:Azadi ka amrit mahotsav: 'మేరఠ్'​ కేసులో ఆంగ్లేయుల కుట్రపై ఐన్‌స్టీన్‌ నిరసన

ABOUT THE AUTHOR

...view details