Azadi Ka Amrit Mahotsav: క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించింది తుపాన్ సేన. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది హౌసాతాయి. తండ్రి నానాపాటిల్ కొలువు వదిలేసి.. స్వాతంత్య్ర సమరంలో దూకారు. ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేసింది బ్రిటిష్ సర్కారు. వారి ఇంటిని, ఆస్తిని.. ప్రభుత్వం జప్తు చేసింది. నానాపాటిల్ అజ్ఞాతంలో ఉంటే కుటుంబమంతా రోడ్డున పడింది. ఆస్తులను వేలం వేస్తే నానాపాటిల్‌పై గౌరవంతో కొనడానికి గ్రామంలోని ఎవ్వరూ ముందుకు రాలేదు. అలాగని వారి కుటుంబాన్ని ఆదుకున్నారనీ కాదు. ప్రభుత్వానికి భయపడి కుటుంబంతో మాట్లాడటం మానేశారు. గ్రామంలో సరకులు కూడా పుట్టని పరిస్థితి. కూలీ పని చేస్తామన్నా ఇవ్వలేదు. సమీప గ్రామంలోని బంధువొకరు సాయం చేయటంతో బతుకు గడిచేది.
అజ్ఞాతంలో ఉంటూనే.. రాంచంద్ర శ్రీపతి లాడ్, కెప్టెన్ భావ్, మరి కొంతమందితో కలసి ఓ దళాన్ని ఏర్పాటు చేశారు నానాపాటిల్. అదే తుపాన్ సేన. పాటిల్ కుమార్తె హౌసాతాయి కూడా అందులో చేరింది. ఆంగ్లేయులు గుర్తు పట్టకుండా.. రహస్యాలు, సందేశాలు, ఆయుధాలు చేరవేసేది. ఓ రోజు పోలీసు స్టేషన్ ముందు హౌసాతాయిని భర్త చితకబాదాడు. ఇది చూసిన పోలీసులు లోపలి నుంచి పరుగెత్తుకొని వచ్చి.. వారికి సర్దిచెప్పి ఇంటికి పంపించారు. నిజానికి.. దెబ్బలు తిన్నది హౌసాతాయినేగాని.. కొట్టింది నిజమైన భర్త కాదు. పోలీసుల కళ్లుగప్పి ఆయుధాలు కొట్టేసేందుకు తుపాన్ సేన పథకంలో భాగంగా ఆడిన నాటకం అది. అప్పటికి హౌసాతాయి వయసు 17 సంవత్సరాలే. ఇది మొదలుగా.. పోలీసు స్టేషన్ల నుంచి ఆయుధాలు కొట్టేయటం; బ్రిటిష్ ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టడం ద్వారా ఆంగ్లేయుల్లో భయాందోళనలు సృష్టించారు. 1943 జూన్‌లో.. షెనోలి అనే ప్రాంతంలో.. బ్రిటిష్ సర్కారు సొమ్ము తరలిస్తున్న రైలును కొల్లగొట్టారు. ఇందులో హౌసాతాయి, కెప్టెన్ భావ్ కీలక పాత్ర పోషించారు. ఎలాంటి ఆయుధాలూ లేకుండానే.. బండలు అడ్డం పెట్టి.. గార్డును బోల్తా కొట్టించి.. సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తాన్ని పేదలకు పంచి పెట్టారు.