Azadi Ka Amrit Mahotsav: జాతీయోద్యమానికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్... అతివాదులు, మితవాదులుగా చీలుతున్న తరుణంలో వెలిసింది అనుశీలన్ సమితి. 1902 మార్చి 24న విద్యార్థి నేత సతీశ్‌చంద్రబసు, బారిస్టర్ ప్రమథ్‌నాథ్ మిత్రల ఆధ్వర్యంలో మొదలైన ఈ సమితి.. తొలుత వ్యాయామవిద్యకు పరిమితమైంది. వివేకానందుడి బోధనలు, బంకించంద్ర ఛటర్జీ రచనలు స్ఫూర్తిగా బెంగాల్‌లో అనేక వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. యువతరంలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక దారుఢ్యం పెంచే లక్ష్యంతో మొదలైన ఈ సమితి పనితీరు ఆంగ్లేయులు తీసుకున్న ఓ నిర్ణయంతో అనూహ్యంగా మారిపోయింది.
1905లో వైస్రాయ్ కర్జన్... బెంగాల్‌ను తూర్పు, పశ్చిమ రాష్ట్రాలుగా విభజించాడు. ఇది మొదలుగా దేశంలో జాతీయోద్యమం కొత్త పుంతలు తొక్కింది. ముఖ్యంగా బెంగాల్‌లో చదువుకున్న యువతరం ఆంగ్లేయ సర్కారుపై రగిలిపోయింది. వారందరికీ అనుశీలన్ సమితి కేంద్రమైంది. వ్యాయామశాలలు విప్లవవాద కేంద్రాలుగా మారాయి. జిమ్‌లలో ఆయుధాలు చేరాయి. అరబిందోఘోష్, వివేకానందుడి సోదరుడైన విప్లవకారుడు భూపేంద్రనాథ్‌దత్, దేశబందు చిత్తరంజన్‌దాస్, సురేన్ ఠాగూర్ (రవీంద్రుడి సమీప బంధువు), బిపిన్‌చంద్రపాల్, సరళాదేవి లాంటివారంతా సమితిలో కీలకపాత్ర పోషించారు. ఢాకాలోనూ పులిన్ బిహారీదాస్ సారథ్యంలో అనుశీలన్ సమితి శాఖ మొదలైంది. అలా ఆంగ్లేయులపై ఆగ్రహంతో ఉన్న యువతరానికి అనుశీలన్ సమితి ఓ వేదికగా నిలిచింది. పాఠశాలల్లోని పిల్లల్లోనూ చైతన్యం తెచ్చేలా బాల సమితులు ఏర్పడ్డాయి. బెంగాల్‌లోనైతే అనేక మంది కాలేజీ అమ్మాయిలు కూడా అనుశీలన్ సమితిలో చేరి ఆయుధాలు పట్టేందుకు సిద్ధమయ్యారు. అనుశీలన్ సమితికి అనుబంధంగా ఏర్పడ్డదే యుగాంతర్ పత్రిక. అస్సాం, త్రిపుర, పంజాబ్, బిహార్, యూపీ, మహారాష్ట్రలకూ సమితి ప్రాబల్యం పాకింది.
బెంగాల్‌లోనే రెండు మూడు బృందాలుగా సమితి కార్యకలాపాలుండేవి. సమన్వయం ఉన్నా... దేనికదే స్వతంత్రంగా పనిచేసేది. 1907 నుంచి అన్ని బృందాల సభ్యులూ విప్లవ కార్యకలాపాలను విస్తృతం చేశారు. బరోడా మహారాజు వద్ద ఉన్నత పదవిలో ఉన్న అరబిందో సాయంతో బాఘా జతిన్ సహా అనేక మందికి బరోడా సైన్యంతో శిక్షణ ఇప్పించారు. విరాళాలు సేకరించి సాయుధ శిక్షణ, బాంబులు, ఆయుధాల తయారీ కోసం కొంతమందిని విదేశాలకు కూడా పంపించారు. ముఖ్యంగా తూర్పు బెంగాల్‌లో కార్యకలాపాలు చురుగ్గా సాగాయి. 1907 డిసెంబరులో తూర్పు బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రయాణిస్తున్న రైలును పేల్చివేయటానికి ప్రయత్నించారు. అది విఫలమవటంతో బెంగాల్ రాష్ట్ర న్యాయమూర్తి కింగ్స్‌ఫోర్డ్‌ను హతమార్చటానికి ప్రఫుల్ల, ఖుదీరాంబోస్‌లు సిద్ధమయ్యారు. న్యాయమూర్తిని కాకుండా మరో ఇద్దరు ఆంగ్లేయులను చంపేశారు. ఇదే అలీపుర్ కేసుగా పేరొందింది. ఈ కేసులో జైలు జీవితం తర్వాత అరబిందో ఆయుధ పంథా వీడి ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లారు. ఈ సమయంలోనే మహారాష్ట్ర నుంచి హెడ్గేవార్ (తర్వాతికాలంలో ఆరెస్సెస్‌ను స్థాపించారు) వైద్యవిద్య చదవటానికని వచ్చి కోల్‌కతా అనుశీలన్ సమితిలో శిక్షణ పొందారు.
అలీపుర్ కేసులో తప్పించుకున్న బాఘా జతిన్ సమితిలోని ఒక బృంద బాధ్యతలు చేపట్టి యుగాంతర్ పార్టీగా పేరుపెట్టాడు. జతిన్‌తో పాటు రాస్‌బిహారీ బోస్ సహకారంతో యుగాంతర్ విప్లవకార్యకలాపాలు ఉత్తర భారతంలో విస్తృత మయ్యాయి. రాస్ బిహారీ బోస్ ఏకంగా వైస్రాయ్ హార్డింగ్‌నే బాంబుతో భయపెట్టారు. విదేశాల్లోని భారత విప్లవవాదులు లాలా హర్‌దయాళ్ (గదర్‌పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు)లాంటివారితో కలసి జర్మనీ సాయంతో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులను ఇరుకున పెట్టేందుకు యత్నించారు. కానీ వీటన్నింటినీ ఆంగ్లేయ సర్కారు తన నిఘావర్గాల సాయంతో విఫలం చేసింది. అనేక మంది విప్లవకారులను చంపేసింది. అరెస్టు చేసింది. రాస్‌బిహారీ బోస్ తప్పించుకొని జపాన్ చేరారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత విప్లవవాదుల్లో చాలామంది కాంగ్రెస్‌లో చేరారు. సుభాష్ చంద్రబోస్ సాయుధ మార్గానికీ మూలాలు ఈ సమితిలోనే ఉన్నాయి. శచీంద్రనాథ్ సాన్యాల్‌లాంటివారు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్‌ను స్థాపించారు. చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద్ బిస్మిల్, భగత్‌సింగ్‌లను తయారు చేశారు. 1938 కల్లా అనుశీలన్ సమితి, యుగాంతర్‌లు దాదాపుగా మాయమయ్యాయి. మిగిలిన కొద్దిమంది కమ్యూనిస్టువాద విప్లవకారులు రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్‌ఎస్‌పీ)గా రూపాంతరం చెందారు. లక్ష్య సాధనలో చివరివరకు నిలవలేక పోయినా ప్రజల్ని తమవంతుగా చైతన్యం చేయడంలో అనుశీలన్ సమితి సఫలీకృతమయ్యింది.
ఇదీ చదవండి:Azadi Ka Amrit Mahotsav: పచ్చని అడవిలో ఆంగ్లేయుల చిచ్చు