1886కాంగ్రెస్ సమావేశంలోనే.. దాదాభాయ్ నౌరోజి.. భారత్‌కు స్వరాజ్యం కావాలన్నారు. కానీ ఆ స్వరాజ్యానికి అర్థం.. బ్రిటిష్ నీడలోనే ఉంటూ.. స్వయంగా పాలించుకునే అధికారం. కెనడా, ఆస్ట్రేలియాల మాదిరిగా! తర్వాత వచ్చిన తిలక్, అరబిందోలు పూర్ణ స్వరాజ్యానికి తక్కువగా ఏదీ వద్దన్నారు. కానీ బ్రిటిషర్లు నానాటికీ పట్టుబిగిస్తూ వెళుతున్న అప్పటి పరిస్థితుల్లో.. పూర్ణ స్వరాజ్యమనేది చాలామందికి కొండమీది కోతిలా.. అందని ద్రాక్షలా అనిపించింది. గుడ్డిలో మెల్లలా స్వయంపాలనైనా ఫర్వాలేదనిపించింది. గాంధీజీలాంటివారు కూడా తొలినాళ్లలో భారతీయులకు స్వయం పాలనాధికారం ఇస్తే చాలన్నారు. అదిస్తామనే హామీ వచ్చినందునే.. తొలి ప్రపంచయుద్ధంలో బ్రిటిష్ వారి తరఫున పోరాడటానికి భారతీయులను సిపాయిలుగా మార్చారు.
బదులుగా.. ఆంగ్లేయులు కృతజ్ఞత చూపటం అటుంచి భారతీయులను తేలిగ్గా తీసుకున్నారు. బంగారుబాతులాంటి భారత్‌ను విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశం లేదని తేల్చేశారు. లక్షలమంది సిపాయిలనిచ్చామనే కనీస గౌరవమైనా లేకుండా.. జలియన్‌వాలాబాగ్‌లో ఊచకోత కోశారు. రౌలత్ చట్టం తీసుకొచ్చి.. స్వేచ్ఛను పూర్తిగా హరించారు. భారతీయులను మనుషులుగా చూడటం మానేశారు. అయినా.. కాంగ్రెస్ ఓపికతో.. స్వయంపాలనను కోరుతూ.. అహింసాపద్దతుల్లో నిరసనలు, డిమాండ్లు చేస్తూ వచ్చింది. దీన్ని అలుసుగా తీసుకున్న తెల్లవారు.. 1927లో సైమన్ సారథ్యంలో భారత్‌లో పాలన సంస్కరణలపై కమిషన్ వేశారు. ఇందులో భారతీయులెవరికీ చోటు కల్పించలేదు. ఈ కమిషన్‌ను బహిష్కరించిన భారత నేతలు.. తమంతట తామే పాలనా సంస్కరణలపై నివేదిక తయారు చేశారు. దాన్నే నెహ్రూ (మోతీలాల్) నివేదిక అంటారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది.
ఇక జాతీయ కాంగ్రెస్‌లో ఓపిక నశించింది. యువతరం.. ముఖ్యంగా జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్‌లాంటివారు.. బ్రిటిషర్ల పట్ల మెతకవైఖరి ఇక అవసరం లేదని వాదించసాగారు. స్వయంపాలన అంటూ బ్రిటిష్‌వాడు విదిల్చే మెతుకుల కోసం ఎదురు చూడకుండా తాడోపేడో తేల్చుకుందామనే భావన ఊపందుకుంది. ఈ నేపథ్యంలో.. 1929 డిసెంబరులో లాహోర్ సమావేశం మొదలైంది. ఈ సదస్సు వాడీవేడిగా జరగబోతోందని గుర్తించిన సీనియర్ నేతలు.. చివరి ప్రయత్నంగా.. వైస్రాయ్ ఇర్విన్‌ను కలిశారు. రాబోయే రౌండ్‌టేబుల్ సమావేశంలో స్వయంపాలనపై చర్చ జరుగుతుందా అని అడగ్గా.. చెప్పలేమంటూ ఇర్విన్ సమాధానమిచ్చారు. దీంతో.. కాంగ్రెస్‌లోని కొందరిలో ఇంకా అంతోఇంతో మిణుకుమిణుకుమంటున్న ఆశలు కూడా పూర్తిగా ఆవిరయ్యాయి. యువతరంతో పాటు సీనియర్లు.. గాంధీజీ నుంచి బోస్ దాకా అందరికీ స్పష్టత వచ్చేసింది. స్వయంపాలన కాదిక.. సంపూర్ణ స్వరాజ్యమే కావాలని తీర్మానించేశారు. ఈ సమావేశంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన యువ జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్‌లు ముక్తకంఠంతో 'బ్రిటిష్ బానిసత్వం వద్దు.. ఏ రూపంలోనూ వారి నీడా మనమీద పడవద్దు. సంపూర్ణ స్వరాజ్యమే మన లక్ష్యమిక. అంతకు తక్కువ ఏదీ వద్దు' అంటూ తీర్మానించారు. "బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల స్వేచ్ఛను హరించటమే గాకుండా.. ప్రజల్ని దోచుకుంది. భారత్‌ను ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా చిదిమేసింది. కాబట్టి ఇక బ్రిటిష్‌తో అన్ని విధాలుగా తెగతెంపులు చేసుకొని పూర్ణ స్వరాజ్యం సంపాదించటమే కర్తవ్యం!" అని ప్రకటించారు. గాంధీజీ రాసిన ప్రతిజ్ఞనంతా చదివారు.