Azadi ka Amrit Mahotsav: ప్రజల స్వేచ్ఛను హరించిన రౌలత్ చట్టం, అత్యంత దారుణమైన జలియన్‌వాలాబాగ్ ఊచకోతల తర్వాత... సహాయ నిరాకరణకు పిలుపునిచ్చిన గాంధీజీ.. ప్రజలను చైతన్యపరుస్తూ యంగ్ ఇండియాలో వ్యాసాలు రాశారు. ఇవి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ.. గాంధీజీపై భారత నేర శిక్షాస్మృతి 124ఏ కింద రాజద్రోహం కేసు నమోదు చేశారు ఆంగ్లేయులు. గాంధీజీతో పాటు యంగ్ ఇండియా ప్రచురణకర్త ఎస్.జి.బంకర్‌ను కూడా ఈ కేసులో ఇరికించారు. 1922 మార్చి 18న అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌లో ‘మహా విచారణ’ మొదలైంది.
విచారణ ఆరంభం కాగానే గాంధీజీ తనపై అభియోగాలన్నింటినీ అంగీకరించారు. వెంటనే న్యాయమూర్తి బ్రూమ్‌ఫీల్డ్ తీర్పు ఇవ్వబోతుండగా... అడ్వొకేట్ జనరల్ స్ట్రాంగ్‌మన్ కల్పించుకొని.. 'అహింస పేరుతో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రజలను గాంధీ రెచ్చగొడుతున్నారు. ముంబయి, మలబార్, చౌరీచౌరా సంఘటనల్లోని హింసాకాండను కూడా దృష్టిలో ఉంచుకొని తీర్పునివ్వాలని కోరుతున్నాను' అన్నారు. జడ్జి స్పందించేందుకు అవకాశం ఇవ్వగా.. గాంధీజీ తన వాదన వినిపించారు.
నిప్పుతో ఆడుతున్నా..
"అడ్వొకేట్ జనరల్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. ఈ ప్రభుత్వ వ్యవస్థ పట్ల అయిష్టమనేది నాకో అలవాటుగా మారింది. మంచికి సహకారం ఎలాంటిదో.. చెడుకు సహాయ నిరాకరణ కూడా అలాంటిదే. అయితే హింసాయుతమైన సహాయ నిరాకరణ అనేది చెడును మరింత పెంచుతుందే తప్ప తగ్గించదనేది నా దేశవాసులకు తెలియజెప్పాలనుకుంటున్నాను. ముంబయి, చౌరీచౌరా సంఘటనలు తప్పే. బాధ్యతగల వ్యక్తిగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటి పరిణామాలను కూడా ఊహించి ఉండాల్సింది. నిప్పుతో ఆడుకుంటున్నానని నాకు తెలుసు. కానీ, దేశానికి తీరని హాని చేస్తున్న మీ ప్రభుత్వాన్ని సమర్థించలేనుగదా! హింస లేకుండా ఉద్యమం ఉండాలనుకున్నా. కొన్నిసార్లు నా ప్రజలు పిచ్చిగా వ్యవహరించారు. అందుకు క్షమాపణలు చెబుతున్నా. అలాగని నేను క్షమాభిక్ష కోరటం లేదు. అందుకే నాకు అత్యంత కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని కోరుకుంటున్నా. అహింస అంటే.. చెడుకు సహాయ నిరాకరణ చేసినందుకు విధించే శిక్షను భరించటం కూడా. అందుకే.. మీచట్టం ప్రకారం కఠినాతి కఠిన శిక్ష విధించండి. మీ దృష్టిలో నాది నేరం కావచ్చు. నా దృష్టిలో ఇది పౌరుడిగా నా బాధ్యత.
నేనేదైతే నేరం చేశానంటున్నారో.. అదే నేరాన్ని అనేకమంది ఆంగ్లేయులు, మీ అధికార యంత్రాంగంలోని భారతీయ సహచరులు కూడా చేస్తున్నారు. భారత్‌కు బ్రిటిష్ వ్యవస్థ చేసినంత హాని మరేదీ చేయలేదు. ప్రజల స్వేచ్ఛను హరించే రౌలత్ చట్టం తీసుకొచ్చారు. జలియన్‌వాలాబాగ్‌లో, పంజాబ్‌లో దారుణాలకు తెరదీశారు. అత్యంత నిపుణులైన నేతగాళ్లను బిచ్చగాళ్లను చేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థ పట్ల ఆరాధన పెంచుకుంటే పాపం చేసిన వాడినవుతాను. ఒకవేళ మీరు పాటిస్తున్న చట్టం ప్రజలకు హాని చేస్తోందని భావిస్తే.. మీ పదవికి రాజీనామా చేసి, ఆ చెడుకు దూరంగా ఉండండి. లేదూ.. మా చట్టం ప్రజలకు మేలు చేసేదే అని అనుకుంటే నన్ను దోషిగా నిర్ధారించి కఠినాతి కఠిన శిక్ష విధించండి" అంటూ గాంధీజీ ముగించారు.