తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా ఒంటిపై ఒక్కో దెబ్బ.. బ్రిటిష్ సామ్రాజ్య శవపేటికపై మేకులా దిగుతుంది' - లాలా లజపతి రాయ్‌ తాజా వార్తలు

AZADI KA AMRIT MAHOTSAV: ఆంగ్లేయ పాలనను సమర్థిస్తూ, వారితో కలసి నడవటానికే ఇష్టపడుతున్న వేళ.. స్వాతంత్య్రం, స్వదేశం అనే పదాల్ని ఉచ్ఛరించటానికి ధైర్యం చేశారాయన! భారత సమాజంలో సంస్కరణలతో పాటే స్వపరిపాలన కూడా కావాలని డిమాండ్‌ చేశారు. ఆంగ్లేయులతో మెతగ్గా ఉండాల్సిన అవసరం లేదని భారతావనిని నిద్రలేపారు. సహాయ నిరాకరణ విఫలమవుతుందని గాంధీజీని ముందే హెచ్చరించారు. భగత్‌సింగ్‌ను కదిలించి.. కన్నుమూసిన పంజాబ్‌ కేసరి లాలా లజపతి రాయ్‌!

lala Lajpat Rai
లాలా లజపతి రాయ్‌

By

Published : Jan 29, 2022, 7:30 AM IST

AZADI KA AMRIT MAHOTSAV: 1885లోనే ఏర్పడ్డా.. చాన్నాళ్లపాటు భారత జాతీయ కాంగ్రెస్‌ - బ్రిటిష్‌ ప్రభుత్వానికి వంత పాడుతూ.. విజ్ఞాపనలు సమర్పించటానికే పరిమితమైంది. ఈ మెతక వైఖరిని నిరసిస్తూ.. ఆంగ్లేయులపైనా, కాంగ్రెస్‌లోని మితవాదులపైనా సమరశంఖం పూరించారు లాల్‌-బాల్‌-పాల్‌ (లాలా లజపతి రాయ్‌, బాలగంగాధర్‌ తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌)త్రయం.

1865 జనవరి 28న పంజాబ్‌లో జన్మించిన లాలా న్యాయశాస్త్రంలో పట్టా సంపాదించారు. లాహోర్‌లో చదివేప్పుడే స్వామి దయానంద సరస్వతి ప్రభావంతో ఆర్యసమాజ్‌ సభ్యుడిగా చేరారు. కులవ్యవస్థను, వరకట్నాన్ని, అంటరానితనాన్ని నిరసిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టారు. భారతీయ సమాజంలో సంస్కరణల కోసం సర్వెంట్స్‌ ఆఫ్‌ పీపుల్‌ సొసైటీని స్థాపించారు. డీఏవీ పాఠశాలల స్థాపనలోనూ ఆయన సాయపడ్డారు. 1907 సూరత్‌ కాంగ్రెస్‌ సమావేశంలో అతివాదులు- మితవాదుల మధ్య బాహాబాహీ యుద్ధమే సాగింది. స్వరాజ్యం కోసం పోరాడాల్సిందేనంటూ లాలా వర్గం వాదించింది.

భారత్‌లో ఉద్యమంతో పాటు విదేశాల్లోనూ భారతీయుల దుస్థితిని, ఆంగ్లేయుల దుష్టపాలనను ప్రపంచానికి తెలియజేయాలని ఆయన భావించారు. 1917లో అమెరికా వెళ్లి అక్కడి మేధావులను కలిసి వారికి భారత జాతీయోద్యమం, స్వాతంత్య్ర ఆవశ్యకత గురించి వివరించారు. న్యూయార్క్‌లో హోంరూల్‌ లీగ్‌ను స్థాపించారు. లాలా రూపొందించిన నివేదికపై 1917లో అమెరికా సెనెట్‌లో చర్చ కూడా జరగటం గమనార్హం. 1919లో భారత్‌కు తిరిగి వచ్చాక.. గాంధీజీతో కలిసి పనిచేశారు. 1920లో కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యారు. అయితే గాంధీ అహింసా పద్ధతి లాలాను పెద్దగా ఆకట్టుకోలేదు. అహింసా పద్ధతిలో సహాయ నిరాకరణ అంటూ గాంధీజీ ప్రకటించగానే.. ఈ ఉద్యమం విఫలమవుతుందంటూ ముందే హెచ్చరించారు. అందుకు తగ్గట్లుగానే.. చౌరీచౌరా సంఘటనతో గాంధీజీ ఈ ఉద్యమాన్ని మధ్యలోనే ఆపేశారు. గాంధీజీతో పద్ధతితో విభేదించినా దేశం కోసం సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని రెండేళ్లపాటు జైల్లో ఉన్నారు లాలా.

భారతీయులకూ ఉన్నత చదువులు అందించటానికి ఏర్పడిన జాతీయ కాలేజీల పరంపరలో భాగంగా లాహోర్‌లో జాతీయ కళాశాలను ఆరంభించారు. భగత్‌సింగ్‌లాంటివారెందరో అక్కడ చదువుకున్నారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌లాంటి వారూ లాలా అనుయాయులే. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్థాపనలో భాగమయ్యారు. లాహోర్‌లో తన తల్లి పేరిట క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేకంగా ఆసుపత్రి కట్టించారు. పంజాబ్‌ కేసరిగా పేరొందారు.

నా ఒంటిపై ఒక్కో దెబ్బ..

1928లో సైమన్‌ కమిషన్‌ రాక లాలా పాలిట మృత్యువైంది. భారత్‌లో పాలన సంస్కరణల కోసం ఏర్పాటైన సైమన్‌ కమిషన్‌లో భారతీయులను ఎవ్వరినీ నియమించలేదు. దీంతో భారతావని ఈ కమిషన్‌ను బహిష్కరించాలని నిర్ణయించింది. 1928 అక్టోబరు 30న సైమన్‌ బృందం లాహోర్‌ చేరుకుంది. లాలా లజపతిరాయ్‌ సారథ్యంలో కాంగ్రెస్‌ వాదులంతా శాంతియుతంగానే నిరసన ర్యాలీ చేపట్టారు. వారిపై.. పోలీసు సూపరింటెండెంట్‌ జేమ్స్‌ స్కాట్‌ లాఠీఛార్జీ చేయించాడు. లాలాను లాఠీలతో తీవ్రంగా బాదారు. భగత్‌సింగ్‌ తదితరులు లాలాపై దాడిని ప్రత్యక్షంగా చూశారు. గాయాలతో బాధపడుతూనే ఆయన ఉద్యమకారులను ఉద్దేశించి ప్రసంగించారు.

"ఇవాళ నా ఒంటిపై పడిన ఒక్కో దెబ్బ భారత్‌లో బ్రిటిష్‌ సామ్రాజ్య శవపేటికపై మేకులా దిగుతుంది" అంటూ గర్జించింది పంజాబ్‌ సింహం. ఆ గాయాల తీవ్రత పెరిగిందే తప్ప తగ్గలేదు. చివరకు 1928 నవంబరు 17న లాలా కన్నుమూశారు. పోలీసు దెబ్బలవల్లే ఆయన తొందరగా మరణించారని వైద్యులు అభిప్రాయపడ్డారు. బ్రిటిష్‌ పార్లమెంటులోనూ దీనిపై ఆందోళన వ్యక్తమైంది. బ్రిటిష్‌ ప్రభుత్వం తమ పాత్ర ఏమీ లేదని చేతులు దులుపుకుంది.

కానీ.. లాలాపై దాడికి ప్రత్యక్ష సాక్షులైన భగత్‌సింగ్‌ తదితరుల గుండెలు రగిలాయి. ప్రతీకారం తీసుకోవాలని నిర్ణయించి.. శివరామ్‌ రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌లతో కలసి భగత్‌సింగ్‌ ఎస్పీ స్కాట్‌ను చంపటానికి ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ పొరపాటున స్కాట్‌కు బదులు ఆయన డిప్యూటీ శాండర్స్‌ను కాల్చి చంపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:'ఎద్దుల బండి లైబ్రరీ'లో పిల్లల ఇంటికే పుస్తకాలు!

ABOUT THE AUTHOR

...view details