తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆంగ్లేయుల హింసలకు.. బెదరని 'గదర్‌ వీరుడు'

Azadi Ka Amrit: ఆయన ఒక చిన్న గదిలో రాజకీయ ఖైదీ. చెక్కతో పూర్తిగా మూసేసిన పైకప్పు. లోపల ఏం జరుగుతుందో చూడటానికి గాజుతో కప్పిన సూక్ష్మ రంధ్రం. తినడానికి మూణ్ణాలుగు రోజులకోసారి రెండంటే రెండు చపాతీలు. గొంతు తడవడానికి కూడా సరిపోని తాగునీళ్లు. మలవిసర్జనకు ఓ గిన్నె. స్నానం చేయడానికి వారం రోజులకు ఒక బకెట్‌ నీళ్లు. నెలకోసారి వ్యాయామం పేరిట మిట్ట మధ్యాహ్నం పూట కాలుతున్న గులకరాళ్లపై నడక. ఒళ్లంతా బొబ్బలు. వాటిని చేతులతో చిదిమేసే కర్కోటక సైనికులు. గారపట్టిన దంతాలు. నోట్లో పొక్కులు. కడుపులో నొప్పితో ఆగకుండా రక్త విరేచనాలు. పైగా ఆరు నెలల ఏకాంతంతో వేధిస్తున్న మనో వ్యాధి. స్వాతంత్య్ర పోరాటంలో విప్లవ పంథాను ఎంచుకున్న ఓ మహావీరుడు ఆంగ్లేయుల చేతుల్లో అనుభవించిన దారుణ చిత్రహింసలివి. ఆ వీరుడే... దక్షిణ భారతదేశంలోనే తొలి రాజకీయ ఖైదీ, గదర్‌ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మన తెలుగు వ్యక్తి దరిశి చెంచయ్య.

Azadi Ka Amrit Mahotsav
Azadi Ka Amrit Mahotsav

By

Published : Apr 11, 2022, 5:07 AM IST

Updated : Apr 11, 2022, 6:46 AM IST

Darishi Chenchayya: స్వాతంత్య్ర పోరాటంలో విప్లవ పంథాను ఎంచుకున్న మహావీరుడు దరిశి చెంచయ్య. ఆంగ్లేయుల చిత్రహింసలకు అదరని.. బెదరని చెంచయ్య.. ప్రకాశం జిల్లా కనిగిరిలో 1890 డిసెంబరు 28న ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటసుబ్బయ్య, లక్ష్మమ్మ. చెంచయ్య కనిగిరిలో ప్రాథమిక విద్యను, ఒంగోలులో మెట్రిక్యులేషన్‌ను, మద్రాసులో పీయూసీని పూర్తిచేశారు. అమెరికాలోని యూటా రాష్ట్రంలోని లోగన్‌టౌన్‌లో బీఎస్సీలో వ్యవసాయశాస్త్రం చదివారు.

దరిశి చెంచయ్య

తహసీల్దారువి కావాలి నాయనా...కనిగిరి దుర్భిక్ష ప్రాంతం. వేసవిలో తాగునీటి కోసం ప్రజలు ఊరికి రెండు కి.మీ. దూరంలోని చట్టుబావి వద్ద రేయింబవళ్లు బారులు తీరేవారు. గొడవలు, కొట్లాటలు నిత్యకృత్యం. అయితే కనిగిరి తహసీల్దార్‌ కుటుంబ సభ్యులు తమ నౌకర్లతో వచ్చి ప్రజలను భయపెట్టి, నేరుగా నీళ్లు తోడుకుని వెళుతుండేవారు. ఒకరోజు చెంచయ్య సామాజిక వర్గానికి చెందిన కొందరు ఎదిరించగా నౌకర్లు వారిపై దాడి చేశారు. ఆయన తండ్రికీ అవమానాలు తప్పలేదు. అందుకే తహసీల్దారు ఉద్యోగం తెచ్చుకో నాయనా...! అంటూ చెంచయ్యను కుటుంబ సభ్యులు ప్రోత్సహించేవారు. దాంతో చిన్న వయసులోనే తహసీల్దారు ఉద్యోగమే లక్ష్యమంటూ ఆయన పుస్తకాలను తెగ చదివేవారు.

'గదర్‌' స్థాపన... విప్లవవాదిగా అవతరణ..అప్పట్లో చాలామంది బ్రిటన్‌ వెళ్లి చదువుకునేవారు. మన దేశాన్ని పీల్చిపిప్పి చేస్తున్న బ్రిటన్‌ వెళ్లడానికి మనస్కరించక... చెంచయ్య అమెరికాను ఎంచుకున్నారు. ఆ మేరకు జపాన్‌ మీదుగా 1912 డిసెంబరులో శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. అప్పటికే అమెరికాకు వెళ్లిన లాలా హరదయాళ్‌(పంజాబ్‌), జితేంద్రనాథ్‌ లాహిరి(బెంగాల్‌) ఇద్దరూ కలిసి... ఆంగ్లేయులను మనదేశం నుంచి తరిమి వేయాల్సిన అవసరాన్ని భారత విద్యార్థులకు వివరించేవారు. వారితో చెంచయ్య కలిసిపోయారు. ఎన్నో చర్చలు, వాదోపవాదాల అనంతరం 1913 తొలినాళ్లలో చెంచయ్యతోపాటు మొత్తం పది మంది కలిసి విప్లవ పార్టీ ‘గదర్‌’ను స్థాపించారు. ఒకవైపు చదువుకుంటూనే... పార్టీ ఆదేశం మేరకు కర్ర, కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ కాల్చడం, బుల్లెట్ల తయారీని నేర్చుకున్నారు.

భారత్‌కు సాయుధులుగా..మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే... అమెరికా నుంచి గదర్‌ కార్యకర్తలంతా భారత్‌కు ఏదోవిధంగా రావడం మొదలైంది. చెంచయ్య మరికొందరు ముఖ్య కార్యకర్తలు... ఆయుధాలతో కూడిన రెండు స్టీమర్లలో జపాన్‌, ఫిలిప్పీన్స్‌, మలేసియా, సింగపూర్‌, థాయిలాండ్‌ మీదుగా బర్మా చేరుకుని, అక్కడి నుంచి ఆయుధాలను కోల్‌కతా చేర్చాలనేది లక్ష్యం. ద్రోహుల కారణంగా ఏడుగురు గదర్‌ వీరులు 1915లో బ్యాంకాక్‌లో పోలీసులకు దొరికిపోయారు. వారిని సింగపూర్‌ తీసుకెళ్లి ఆరు నెలలు చిత్రహింసలు పెట్టి, ఇద్దరిని హత్య చేశారు. చివరికి చెంచయ్య సహా అయిదుగురిపై యుద్ధనేరాలు మోపి కోల్‌కతా పంపించారు. అక్కడి నుంచి లాహోర్‌, దిల్లీ, కోయంబత్తూరు, రంగూన్‌, చెన్నై జైళ్లలో రాజకీయ ఖైదీగా కఠిన జీవితం గడిపారు. ఆఖరికి 1919 డిసెంబరులో విడుదలయ్యారు. ఇంటికి చేరుకున్నాక... స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు స్థాపించిన స్వరాజ్య పత్రికను నడిపేందుకు సాయం చేశారు. భరతమాత దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందడాన్ని కళ్లారా వీక్షించారు. తర్వాతి కాలంలో కందుకూరిని ఆదర్శంగా తీసుకుని సంఘసంస్కరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. బాల్య వివాహాలను అడ్డుకున్నారు. వితంతువులకు పునర్వివాహాలు చేశారు. కులవివక్షపై పోరాడారు. స్వయంగా కులాంతర వివాహం చేసుకున్నారు. బాలికల పాఠశాలలు నడిపారు. చివరికి తగిన గుర్తింపు లేకుండానే... 1964 డిసెంబరు 30న పరమపదించారు.

ఇదీ చదవండి: దోపిడీ కోసమే 'రైత్వారీ'.. రైతులను దారుణంగా హింసించి...

Last Updated : Apr 11, 2022, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details