తెలంగాణ

telangana

By

Published : Oct 13, 2021, 8:55 AM IST

ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: మెట్టింట.. 'పుట్టింటి'పై పోరు

భారతీయురాలు కాదు.. భారత్‌ గురించి తెలియదు. కానీ, కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించారు. బ్రిటిష్‌ వస్తువులను బహిష్కరించారు. ఇంటింటికీ తిరిగి ఖాదీ పంచారు. భారత స్వాతంత్య్రం కోసం జైలుకెళ్లారు. భారత జాతీయోద్యమంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆమె.. నేెలి సేన్‌గుప్తాగా మారిన ఎడిత్‌ ఎలెన్‌ గ్రేది.

Edith Ellen Gray
ఎడిత్‌ ఎలెన్‌ గ్రేది

నేెలి సేన్‌గుప్తాగా మారిన ఎడిత్‌ ఎలెన్‌ గ్రేది భారత జాతీయోద్యమంలో ప్రత్యేక స్థానం. 1886లో లండన్‌లో జన్మించిన ఎలెన్‌ గ్రే ఉన్నత చదువుల కోసం కేంబ్రిడ్జ్‌లో చేరారు. అదే సమయంలో లా చదవటం కోసం అక్కడికి వచ్చారు చిట్టగాంగ్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌లోనిది)కు చెందిన జతీంద్రమోహన్‌ సేన్‌గుప్తా! కాలేజీ విద్యార్థి క్లబ్‌లో ఇద్దరికీ స్నేహం కుదిరింది. అంతేగాకుండా.. చాలామంది భారతీయ విద్యార్థులకు ఎలెన్‌గ్రే కుటుంబం తరచూ ఆతిథ్యం ఇచ్చేది. ఎలెన్‌ - జతీంద్ర స్నేహం కాస్తా ప్రేమగా మారింది. చదువు పూర్తికాగానే ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ఎలెన్‌ తల్లిదండ్రులు అస్సలు అంగీకరించలేదు. ఏకైక కుమార్తె తమకు దూరంగా భారత్‌కు వెళ్లటాన్ని వారు ఇష్టపడలేదు. ఇక్కడ జతీంద్ర తల్లిదండ్రులు కూడా ఆంగ్లేయ అమ్మాయి కోడలుగా రావటం ఇబ్బందిగా భావించారు. కానీ, వారందరి అభ్యంతరాలను పక్కనబెట్టి ఇద్దరూ పెళ్లాడారు. జతీంద్రతో కలసి ఎలెన్‌ భారత్‌కు వచ్చేశారు. భారతీయ సంప్రదాయాలను అర్థం చేసుకుంటూ జతీంద్రవారి భారీ ఉమ్మడి కుటుంబంలో కలసిపోయారు. నేలి సేన్‌గుప్తాగా పేరు మారింది.

కొద్దిరోజులకు జతీంద్ర న్యాయవాద వృత్తిలో ప్రవేశించటానికి కోల్‌కతాకు కాపురం మార్చారు. మంచి లాయర్‌గా పేరుతో పాటు డబ్బూ సంపాదించారు. ఇంతలో జాతీయోద్యమం ఊపందుకోసాగింది. మహాత్ముడి సహాయ నిరాకరణ ఉద్యమ ప్రభావంతో.. న్యాయవాదవృత్తిని వదిలేసి ఉద్యమంలోకి అడుగుపెట్టారు జతీంద్ర. బెంగాల్‌లో గాంధీజీకి కుడిభుజంగా మారారు. ఐదుసార్లు కోల్‌కతా మేయర్‌గా ఎన్నికయ్యారు. 1923లో బెంగాల్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన నేలి సేన్‌గుప్తా కూడా.. భర్తతో పాటు అనివార్యంగా రాజకీయాలకు దగ్గరయ్యారు. అనేకమంది కీలక జాతీయోద్యమ నేతలు వీరి ఇంటిని సందర్శించేవారు. అలా.. అందరికీ పరిచయమైన నేలి భారత దుస్థితిని, బ్రిటిష్‌వారి దమనకాండను క్షుణ్నంగా అర్థం చేసుకున్నారు. భర్తతో పాటు తానూ ఉద్యమంలో కీలకపాత్ర పోషించటం ఆరంభించారు. జతీంద్ర సారథ్యంలో తొలిసారి రైల్వే సమ్మె జరగటంతో.. ఆయన్ను జైలులో పెట్టింది ప్రభుత్వం. ఈ సమయంలో తాను రంగంలోకి దిగి.. బ్రిటిష్‌వారిపై ఆందోళన చేపట్టారు నేలి సేన్‌గుప్తా! వీధివీధీ తిరుగుతూ.. బ్రిటిష్‌ వస్తువులను బహిష్కరించాలని ఆమె ప్రచారం చేస్తుంటే తెల్లవారు ఏమీ చేయలేని పరిస్థితి! ఇంట్లో వడికి తయారు చేసిన ఖాదీ దుస్తులను కట్టుకొని.. వాటిని అమ్మి కాంగ్రెస్‌ పార్టీకి నిధులు జమచేశారు కూడా!

1931 నుంచి 33 మధ్య అనేకమార్లు అరెస్టయిన క్రమంలో జతీంద్ర ఆరోగ్యం దెబ్బతింది. 1933లో రాంచీ జైలులో గుండెపోటుతో మరణించారు. తన సర్వస్వాన్ని అర్పించి.. ఆయన్ను నమ్ముకొని దేశంగాని దేశం వచ్చిన నేలి సేన్‌గుప్తా కదలిపోయారు. అలాగని ఆమె పట్టుదల మాత్రం సడలలేదు. భర్త బాటలో తెల్లవారిపై యుద్ధాన్ని కొనసాగించాలనే నిర్ణయించుకున్నారు. ప్రధాన నేతలంతా అరెస్టయిన నేపథ్యంలో.. 1933లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. భర్త తరహాలోనే అసెంబ్లీలో కూడా అడుగుపెట్టారు. స్వాతంత్య్రానంతరం ప్రధాని నెహ్రూ సూచన మేరకు చిట్టగాంగ్‌లోనే ఉండి.. అక్కడి మైనారిటీ హిందువుల రక్షణ కోసం నిలబడ్డారు. 1970లో కిందపడి తుంటి ఎముక విరగటంతో భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాలతో ప్రత్యేక విమానంలో ఆమెను కోల్‌కతాకు తీసుకొచ్చారు. స్వాతంత్య్రోద్యమంలో సేవలకుగాను 1973లో ఆమెను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ అవార్డుతో సన్మానించింది. మెట్టినింటిలో అడుగుపెట్టి పుట్టింటి ప్రభుత్వంపై అలుపెరగకుండా పోరాడిన ధీరవనిత నేలి సేన్‌గుప్తా!

ఇదీ చూడండి:Azadi Ka Amrit Mahotsav: గాంధీ గూగ్లీకి ఆ ఐపీఎల్‌ క్లీన్‌బౌల్డ్‌

ABOUT THE AUTHOR

...view details