Azadi Ka Amrit Mahotsav: భారత్‌లో ఫ్రెంచి స్థావరాలపై కన్నేసిన ఈస్టిండియా కంపెనీ.. అప్పటి ఉత్తర సర్కారు జిల్లాలపై దృష్టి సారించింది. అదే సమయంలో 1757లో బొబ్బిలి యుద్ధం ముగిసిన తర్వాత ఫ్రెంచి సైన్యం విడిదిలోనే.. విజయనగరం రాజు పెదవిజయరామ గజపతి హత్యకు గురయ్యారు. ఆయన తర్వాత సింహాసనం అధిష్ఠించిన ఆనంద గజపతి ఫ్రెంచివారితో తెగదెంపులు చేసుకున్నారు. పైగా విశాఖపట్నాన్ని స్వాధీనం చేసుకోవడానికి బ్రిటిష్ సైన్యాన్ని పంపాలంటూ కోల్‌కతాలోని రాబర్ట్ క్లైవ్‌కు ఉత్తరం రాశారు. క్లైవ్ సమ్మతి మేరకు ఆంగ్లేయులు-గజపతి మధ్య 1758 నవంబరు 15న ఒప్పందం కుదిరింది. అనంతరం కర్నల్ ఫోర్డే నాయకత్వంలో క్లైవ్ బ్రిటిష్ సైన్యాన్ని పంపించగా.. 1758 అక్టోబరులో విశాఖపట్నం, డిసెంబరులో మచిలీపట్నంలోని ఫ్రెంచి స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. 1760 ఫిబ్రవరి 25న ఆనంద గజపతిరాజు అనారోగ్యంతో రాజమహేంద్ర వరంలో మృతి చెందగా బ్రిటిషర్లు ఒప్పందాలన్నీ తుంగలోతొక్కి కప్పం వసూలు చేయడం ప్రారంభించారు.
పట్టు కొనసాగించిన విజయనగరం:ఉత్తర సర్కారు జిల్లాలను బ్రిటిషర్లు తమ అజమాయిషీలోకి తెచ్చుకున్నా.. 25 ఏళ్ల వరకు వారి పరిపాలన స్థిరపడలేదు. సుశిక్షిత సైన్యంతో తులతూగుతున్న విజయనగరం రాజుల కిందే అత్యధిక ప్రాంతం కొనసాగింది. మరోవైపు 35 వేల సొంత సైన్యం, కోటలు, దుర్గాలతో బలంగా ఉన్న 20 మంది జమీందారులు సైతం స్వతంత్రంగా పరిపాలన సాగించేవారు. వీరికి ఆంగ్లేయులు, నిజాం సైన్యాలతో యుద్ధాలు చేయడం, ఓడిపోవడం, బలపడ్డాక మళ్లీ ఎదిరించడం.. సర్వసాధారణ విషయంగా మారింది. అందుకే ఈ ప్రాంతంలో తమ పాలనను కట్టుదిట్టం చేసేందుకు 1783లో ఈస్టిండియా కంపెనీ ఒక కమిటీని వేసింది. సర్కారు జిల్లాల్లో తెలుగు రాజులు బలంగా ఉన్నారని, వీరిని ఒకేసారి కాకుండా ఒక్కొక్కరిగా అణచి వేయాలని, ముఖ్యంగా విజయనగరం రాజులను లొంగదీయాలని ఆ కమిటీ సూచించింది. ఈమేరకు పోలవరం, పర్లాకిమిడి వంటి జమీన్లను హస్తగతం చేసుకున్నారు. అప్పట్లో విజయనగరం సంస్థానాన్ని చినవిజయరామ (రెండో విజయరామ) గజపతి పాలిస్తున్నారు. మహారాజు వయసులో చిన్న కావడంతో ఆయన మారుతల్లి కుమారుడు, అన్న సీతారామరాజు దివానుగా (ప్రధాని) ఉన్నారు. సీతారామరాజును ప్రలోభాలతో తమవైపు తిప్పుకొన్న బ్రిటిషర్లు.. సామంతరాజులను ఖైదు చేయడం ప్రారంభించారు. ఇది గ్రహించిన చినవిజయరామ.. ఆయన్ని పదవి నుంచి తొలగించారు. తర్వాత సీతారామరాజు బ్రిటిషర్లతో చేతులు కలిపాడు.