DR Babasaheb Ambedkar: మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబెవాడకు చెందిన రామ్‌జీ మాలోజీ సక్పాల్, భీమాబాయిలు అంబేడ్కర్ తల్లిదండ్రులు. బ్రిటిష్ ఇండియా సైన్యంలో సుబేదార్‌గా పనిచేసిన రామ్‌జీ.. పదవీ విరమణ అనంతరం బ్రిటిష్ సైనిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు. అందులో భాగంగానే మధ్యప్రదేశ్‌లోని మావ్ అనే గ్రామంలో రామ్‌జీ పని చేస్తున్నప్పుడు 1891 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జన్మించారు. మహారాష్ట్రలోని సతారాలో ఆయన ప్రాథమిక విద్యాభాస్యం పూర్తయింది. తన ఐదో ఏటనే తల్లి మరణించడం వల్ల తీవ్ర కుంగుబాటుకు లోనైన అంబేడ్కర్‌ను గ్రామంలోనూ, పాఠశాలలోనూ నెలకొన్న అస్పృశ్యత వాతావరణం మరింత బాధించింది. అయినా చదువును ఏనాడూ అశ్రద్ధ చేయలేదు. కొడుకు భవిత కోసం తండ్రి తన మకాం బొంబాయికి మార్చారు. అక్కడ ఆరో తరగతిలో చేరిన అంబేడ్కర్... అక్షరాలే ఆలంబనగా అలుపెరుగని ప్రయాణం చేశారు. 1912లో బీఏ ఉత్తీర్ణత సాధించిన తొలిబహుజన యువకుడిగా చరిత్ర సృష్టించారు. అమెరికాలో 1917లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పొంది, ఆసియా నుంచి తొలిసారి ఈ ఘనత సాధించిన విద్యావేత్తగా ప్రసిద్ధికెక్కారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఆర్థికశాస్త్రంలో డీఎస్సీ, అక్కడి నుంచే ఎమ్మెస్సీ ఆర్థిక శాస్త్రంలో డబుల్ పీహెచ్‌డీ పొందారు. లండన్‌లోనే న్యాయవిద్యను అభ్యసించారు. మరాఠీ, హిందీ, పార్శీ, ఇంగ్లిషు, గుజరాతీ, పాళీ, సంస్కృతం, జర్మన్, ఫ్రెంచ్ భాషల్లో పూర్తి ప్రావీణ్యం సాధించారు.
అస్పృశ్యతపై అంతులేని పోరాటం..ఆంగ్లేయులను వెళ్లగొట్టడానికి జరిగిన మహా పోరాటంలోని ఘట్టాలను ఆయన నిశితంగా పరిశీలించారు. అయితే.. దేశంలో కులాల పేరిట పాతుకుపోయిన అస్పృశ్యతను రూపుమాపకపోతే స్వాతంత్య్రం సాధించినా బడుగు, బలహీనవర్గాలకు ఏమీ దక్కదని ప్రతిచోటా నినదించారు. 'సమన్యాయం... సామాజికన్యాయం' పునాదిగా అలుపెరగని పోరాటం సాగించారు. మహిళల సాధికారతకు బాటలు వేయకుండా వచ్చే స్వేచ్ఛతో సమాజం ప్రగతి సాధించలేదని కుండబద్దలు కొట్టారు. అందరికీ చదువు లేకుంటే స్వాతంత్య్ర ఫలాలు కొందరికే దక్కుతాయని ఆందోళన చెందారు. ఈ క్రమంలో డిప్రెస్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సొసైటీ(1928), పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ(1945), సిద్ధార్థ్ కాలేజీ(1946), మిళింద్ కాలేజీ(1950) స్థాపించారు. వారికి రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ(1936), షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్(1942) స్థాపించారు. దేశం ఆర్థికంగా బలపడేందుకు 1935లో ఆర్‌బీఐ స్థాపనకు రోడ్‌మ్యాప్ ఇచ్చారు. వివిధ సందర్భాలలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలలో అంటరాని కులాల ప్రజలకు, మహిళలకు ప్రత్యేక సౌలభ్యాలు కల్పించేలా తీవ్ర ఒత్తిడి తెచ్చారు. తన వాదనను నెగ్గించుకోవడానికి న్యాయవాదిగా, జర్నలిస్టుగా, ఉద్యమకారునిగా, గ్రంథ రచయితగా ఎన్నో బాధ్యతలను అవలీలగా నిర్వర్తించారు. బాబాసాహెబ్ ఆశయాల సాధనకు ఆయన మరణాంతరం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(1957)ను ఆయన అనుయాయులు ప్రారంభించారు.