Azadi Ka Amrit Mahotsav Palvaankar Baloo: ధార్వాడ్‌లోని ఓ పేద చర్మకారుల కుటుంబంలో 1875లో జన్మించిన పల్వాంకర్ బాలూ.. తండ్రి బ్రిటిష్ సైన్యంలో సిపాయిగా చేసేవారు. దీంతో కుటుంబం పుణెకు మారింది. అక్కడ ఆంగ్లేయులు ఆడిపారేసిన క్రికెట్ బ్యాటు, బంతితో బాలూ, ఆయన తమ్ముడు శివరాం క్రికెట్ ఆడుకునేవారు. 1892లో పుణె క్లబ్ బాలూను నెలకు రూ.4 జీతంతో పనిలో పెట్టుకుంది. ఆంగ్లేయ జట్టు సాధన చేసుకోవటానికి వీలుగా.. పిచ్, నెట్‌లను సిద్ధం చేయటం ఆయన పని. ఎవ్వరూ లేనప్పుడు ఆంగ్లేయ ఆటగాళ్లు బాలూ చేతికి బంతినిచ్చి విసరమంటూ.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకునేవారు. అలా గంటల తరబడి వేస్తూ వేస్తూ.. బాలూ బౌలింగ్ మెరుగైంది. మంచి ఎడం చేతివాటం స్పిన్నర్‌గా తయారయ్యాడు. ఎంతగా అంటే.. ఇంగ్లాండ్ ఆటగాడు జేజీ గ్రెయిగ్... నెట్స్‌లో తనను ఔట్ చేసినప్పుడల్లా బాలూకు ఎనిమిది అణాలిచ్చేవాడు.
అప్పట్లో క్రికెట్ జట్లు.. హిందూ, ముస్లిం, పార్శీ, ఆంగ్లేయ పేర్లతో తలపడేవి. బాలూ బౌలింగ్ ప్రతిభ అందరికీ తెలిసిపోయింది. హిందువులతో కూడిన పుణే హిందు క్లబ్ ఆయన్ను చేర్చుకోవటంపై తర్జనభర్జన పడింది. చివరకు ఆంగ్లేయులను ఓడించాలన్న లక్ష్యం ముందు అంటరానితనం చిన్నదైంది. బాలూను జట్టులోకి తొలిసారి తీసుకున్నారు. కానీ టీ, భోజనం సమయాలలో ఆయన్ను దూరంగానే పెట్టేవారు. ఆయనకు నీళ్లు, చాయ్ దళితులే ఇచ్చేలా ఏర్పాటు చేసేవారు. వాటన్నింటినీ పట్టించుకోని బాలూ తన ఆటను మెరుగుపర్చుకుంటూ వెళ్లారు. పుణెలో ప్లేగు మహమ్మారి కారణంగా కుటుంబం బొంబాయికి మారింది. అక్కడ బాలూను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. భారత్‌లోనే అప్పట్లో ప్రతిష్ఠాత్మకంగా పేరొందిన చతుర్ముఖ టోర్నీ (హిందూ, ముస్లిం, పార్శీ, ఆంగ్లేయులు/ తదితరులు)లో పాల్గొనే అవకాశం లభించింది. పరమానందాస్ జీవన్‌దాస్ హిందూ జింఖానా జట్టుకు ఎంపికయ్యాడు. బాలూతో పాటు ఆయన సోదరులు విఠల్, గణపతి, శివరాంలను కూడా జట్టులోకి తీసుకున్నారు.
బొంబాయిలో 1906లో హిందూ, ఆంగ్లేయ జట్లు ముక్కోణపు టోర్నీ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. తొలుత హిందూ జట్టు 242 పరుగులు చేయగా.. బ్రిటిషర్లు 191కే ఆలౌటయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో హిందూ జట్టు 160 మాత్రమే చేసింది. 212 పరుగుల లక్ష్యంతో ఆంగ్లేయులు రంగంలోకి దిగారు. బాలూ 5 వికెట్లు తీయటంతో.. తెల్లవాళ్లు 102కే ఆలౌట్ అవటంతో బొంబాయితోపాటు యావత్ దేశం సంబరాలు చేసుకుంది. హిందూ జట్టు సభ్యులంతా కులాల అంతరాలను మరచి.. బాలూ, ఆయన సోదరులతో కలసి భోజనం చేశారు. అలా కులపైత్యాన్ని తన ప్రతిభతో చెరిపేశారు బాలూ!