Azadi Ka Amrit Mahotsav: దేశ విభజన ఖాయమయ్యాక సంస్థానాల విలీనంతో పాటు.. అందరిలోనూ ఆసక్తి రేకెత్తించిన ప్రాంతం అండమాన్ నికోబార్. ప్రకృతి సౌందర్యమేగాదు.. బంగాళా ఖాతంలో భౌగోళికంగా ఎంతో వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్నాయీ దీవులు. అండమాన్ సముద్రం, బంగాళాఖాతం కలిసే చోట మొత్తం 572 దీవుల సమూహమిది. సహజ ప్రకృతి సంపదతో పాటు అత్యంత పురాతనమైన ఆదివాసీ తెగలు ఇంకా ఇక్కడ నివాసం ఉంటున్నాయి. ఇండోనేసియాకు సమీపంలో ఉండే ఈ దీవులకు చోళ సామ్రాజ్యకాలం నుంచీ భారత్‌తో బంధముంది. మరాఠాలు కూడా ఇక్కడ తమ నౌకాస్థావరాన్ని ఏర్పాటు చేశారు. యూరోపియన్ వలసలు మొదలయ్యాక 18వ శతాబ్దిలో డచ్ ఈస్టిండియా కంపెనీ తొలుత ఈ ద్వీపాన్ని తమ కాలనీగా మార్చుకుంది. నయా డెన్మార్క్‌గా అండమాన్ దీవులు పేరొందాయి. చివరకు 1868లో డచ్‌వారు అమ్మేయడంతో ఇది బ్రిటిష్ ఇండియా ఆస్తిగా మారింది. అంతకుముందే ఆంగ్లేయులు అండమాన్‌లో నేరస్థుల కోసం కాలనీ ఏర్పాటు చేసినా.. వ్యాధుల కారణంగా ఎత్తేశారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం (సిపాయిల తిరుగుబాటు-1857) తర్వాత ఈ దీవుల్లో కొత్త జైలు కట్టి.. కాలాపానీగా పేరుపెట్టి అండమాన్ అంటేనే భయపడేలా చేశారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ బాంబుల వర్షం కురిపిస్తూ.. ఈ దీవులను స్వాధీనం చేసుకుంది. బ్రిటిష్ సైన్యం చేతులెత్తేసి జపాన్‌కు అప్పగించింది. ఆ సమయానికి ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు సుభాష్ చంద్రబోస్ జపాన్‌తో కలసి నడుస్తున్నారు. దీంతో జపాన్ ప్రభుత్వం అండమాన్ బాధ్యతలను బోస్‌కు అప్పగించింది. అలా.. బ్రిటిష్ నుంచి భారత్ చేతుల్లోకి వచ్చిన తొలి ప్రాంతంగా అండమాన్ నిలిచింది. ఈ దీవులను సందర్శించిన బోస్ వీటి పేరు మార్చారు. అండమాన్ నికోబార్‌ల బదులు షాహీద్-స్వరాజ్ దీవులుగా పేరు పెట్టారు. జపాన్ సేనలదే ప్రాబల్యమైనప్పటికీ ఆజాద్ ఫౌజ్ ప్రభుత్వం ఏర్పడింది. ఫౌజ్‌కు చెందిన జనరల్ లోకనాథంను 1943లో దీవుల గవర్నర్‌గా బోస్ నియమించారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోవటంతో 1945లో మళ్లీ ఇవి బ్రిటిష్ ఇండియా సర్కారు అధీనంలోకి వెళ్లాయి.
భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలని నిర్ణయించాక రాజకీయం ఊపందుకుంది. దేశవిభజన, సంస్థానాల భవిష్యత్తుపై కాంగ్రెస్, ముస్లింలీగ్, వైస్రాయ్‌ల మధ్య చర్చలు సాగుతుంటే.. తెరవెనక బ్రిటిష్ సైనిక అధికారులు అండమాన్ కోసం పట్టుబట్టారు. 'అత్యంత కీలకమైన ఈ దీవులను మనం విడిచిపెట్టకూడదు. భౌగోళికంగానే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు రాకపోకలకు, నౌకా, విమానదళాల ఏర్పాటుకు ఇది అత్యంత అనువైన ప్రదేశం' అంటూ భారత్‌లోని బ్రిటిష్ సైనికాధికారులు తమ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీన్ని పరిశీలించాలని బ్రిటన్ సర్కారు వైస్రాయ్ మౌంట్‌బాటెన్‌కు సూచించింది. ఇదే సమయంలో ముస్లింలీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నా.. అండమాన్ పాకిస్థాన్‌కే చెందుతుందంటూ డిమాండ్ చేయటం మొదలెట్టారు. "తూర్పు, పశ్చిమ పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలకు, రాకపోకలకు అండమాన్ కీలకం. అయినా అండమాన్ నికోబార్ దీవులు ఎన్నడూ భారత్‌లో భాగం కావు. భౌగోళికంగా చూసినా, సైనిక, వ్యాపార అవసరాల రీత్యా చూసినా అవి పాకిస్థాన్‌కే చెందుతాయి" అంటూ వాదించారు. కానీ నెహ్రూ ఈ వాదనను కొట్టిపారేశారు. 'అక్కడ ముస్లిం జనాభా అధికంగా లేదు. అండమాన్‌లోని ప్రజలకు ఏ రకంగానూ పాకిస్థాన్‌తో సంబంధం లేదు. వారి కోర్టు కూడా కలకత్తాలో ఉంది. భౌగోళికంగా పాకిస్థాన్‌కు కీలకమైతే భారత్‌కు అంతకంటే కీలకం' అంటూ నెహ్రూ వాదించారు. దీంతో జిన్నా.. బ్రిటన్ మాజీ ప్రధాని చర్చిల్‌కు, ప్రధాని అట్లీకి ఫిర్యాదు చేశారు. 'త్వరగా అండమాన్ విషయాన్ని తేల్చని పక్షంలో దేశ విభజన బిల్లు పరిధి నుంచి దీన్ని తప్పించి... తర్వాత తేల్చండి' అని మెలిక పెట్టారు. ఇంతలో ఆస్ట్రేలియా రంగంలోకి దూకింది. అండమాన్ నికోబార్ దీవులను బ్రిటిష్ సర్కారు ఉంచుకోవాలని లేదంటే తమకు లీజుకు ఇవ్వాలని ప్రతిపాదించింది.
అప్పటికే విభజన సమస్యలతో సతమతమవుతున్న వైస్రాయ్ మౌంట్‌బాటెన్... అండమాన్ రూపంలో కొత్త సమస్యను తలకెత్తుకోదలచుకోలేదు. అండమాన్ దీవులు సహజంగానే భారత్‌లో భాగమవుతాయని తేల్చిచెప్పారు. కావాలంటే తర్వాత భారత ప్రభుత్వంతో మాట్లాడి బ్రిటిష్ అవసరాలకు వాడుకునేలా చర్చిద్దామంటూ ప్రతిపాదించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సమస్యను మరింత సంక్లిష్టం చేయటం ఇష్టలేని లండన్‌లోని అట్లీ ప్రభుత్వం కూడా మౌంట్‌బాటెన్ మాటకే తలూపింది. అలా అండమాన్ నికోబార్ దీవులు భారత్‌లో అంతర్భాగమై నిలిచాయి.
ఇదీ చూడండి:'ఇంక్విలాబ్' ఊపిరిగా.. సంపూర్ణ స్వరాజ్యమే ఆశగా..