Azadi Ka Amrit Mahotsav Coastal Farmers: ఈస్టిండియా కంపెనీ ధన దాహానికి మద్రాసు ప్రెసిడెన్సీ దారుణంగా బలైంది. రైతులు, చేతివృత్తిదారులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఆంగ్లేయ అధికారులు కొత్త పన్నులు రుద్దారు. పాత పన్నులను పునరుద్ధరించారు. వాటి వసూళ్ల పేరిట కంపెనీ ఉద్యోగులు చేసిన దోపిడీ కారణంగా కోస్తాంధ్ర జిల్లాల రైతులు సర్వం కోల్పోయారు. ఈ కష్టాలు చాలవన్నట్లు 1811, 1823, 1832-33, 1839, 1841 సంవత్సరాల్లో కరవుకాటకాలు కరాళ నృత్యం చేశాయి. ముఖ్యంగా 1832-33లో వచ్చిన డొక్కల కరవు ఏకంగా లక్షన్నర మంది ప్రజలను, దాదాపు 5లక్షల పశు సంపదను పొట్టన పెట్టుకుంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల గోడును కంపెనీ, జమీందార్లు పట్టించుకోలేదు. పైగా పన్నుల వసూలు పేరిట మరింత పీడించారు. ఆ కష్టాలను ఏమాత్రం భరించలేని స్థితిలో కోస్తాంధ్ర జిల్లాల రైతులు సహనం కోల్పోయారు. వినూత్న నిరసనకు దిగారు. సాగు చేస్తేనే పన్నుల వసూలుకు అధికారులు ఇళ్ల ముందుకు వస్తారని, అసలు పంటలే వేయకుంటే ఏం చేస్తారో చూద్దామంటూ పొలాల వైపు వెళ్లడమే మానేశారు. తాము పంటలేసే స్థితిలో లేమనే సంకేతం ఇచ్చేలా కొందరు తమ పొలాల్లో ‘మేడిని తిప్పి పాతడం’ ప్రారంభించారు. ఒకర్ని చూసి ఒకరు రైతులంతా ఈ నిరసనలో పాల్గొన్నారు. కొందరు ఔత్సాహికులు భజన బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో పర్యటిస్తూ ఉద్యమాన్ని విస్తరించేలా చూశారు. ఫలితంగా ఏఊరిలో చూసినా పంట పొలాలు బీళ్లుగా మారాయి.
మేడి తిప్పి... ఆంగ్లేయుల మెడలు వంచిన కోస్తాంధ్ర రైతులు - ఆజాదీ కా అమృత్ మహోత్సవా్
Coastal Farmers: భయంకరమైన కరవు. తినడానికి తిండిలేదు. తాగడానికి నీరూ లేదు. వారంతా దుంపలు, ఆకులతోనే ఆకలి తీర్చుకున్నారు. కొన్నిసార్లు చెరువుల్లోని బురదను తాగారు. ప్రాణాంతక అంటురోగాల బారిన పడ్డారు. కళ్లముందే కుటుంబ సభ్యులూ మృత్యువాత పడుతున్నారు. పాడిపశువులు కళ్లుతేలేస్తున్నాయి. అయినా... తమ పట్టువీడలేదు. కాడిని పడేసి, మేడిని పాతిపెట్టి నిరసన కొనసాగించారు. ఆఖరికి ఆంగ్లేయుల మెడలు వంచారు.
అధికారులకు ముచ్చెమటలు...రైతులు, చేతివృత్తిదారులు చేతులు ఎత్తేయడంతో ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది. ఇతర ప్రావిన్సుల్లోనూ ఇలాంటి పరిస్థితులే తలెత్తడంతో... ఇంగ్లాండులోని పరిశ్రమల్లో వస్తువుల ఉత్పత్తికి సైతం ముడిసరకుల కొరత ఏర్పడింది. అక్కడి వ్యాపారవర్గాల ఆందోళనతో భారతదేశంలో జలవనరులను, రవాణా మార్గాలను వెంటనే అభివృద్ధి చేయాలని ఈస్టిండియా కంపెనీని బ్రిటిష్ పార్లమెంటు ఆదేశించింది. ముఖ్యంగా రాజమండ్రి (ప్రస్తుత ఉభయ గోదావరి) జిల్లాలో పరిస్థితులపై అధ్యయనానికి హెన్నీ కానింగ్‌హోం మౌంట్‌గోమరీ కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదికను అనుసరించి... రైతుల పాత పన్నుల బకాయిలను రద్దు చేశారు. వాటి హేతుబద్ధీకరణకు పొలాలను రీసర్వే చేయించారు. చెరువులు, కాలువలను బాగు చేయించారు. గోదావరిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి సర్ ఆర్థర్ కాటన్ చేసిన ప్రతిపాదనను ఆమోదించగా... 1848లో మొదలైన పనులు 1852లో పూర్తయ్యాయి. అదే ఏడాది వైనతేయ పాయపై అక్విడెక్టును నిర్మించారు. అలాగే విజయవాడ వద్ద కృష్ణా నదిపై 1852లో బ్యారేజి పనులను ప్రారంభించి 1855లో పూర్తిచేశారు. మొత్తానికి... రైతుల ఆందోళనలు, కాటన్ దొర ముంద]ుచూపుతో రెండు భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుని కరవు పీడిత ప్రాంతాలకు జీవం పోశాయి.
ఇదీ చదవండి:ఆంగ్లేయుల హింసలకు.. బెదరని 'గదర్ వీరుడు'