Azadi Ka Amrit Mahotsav Chicago Radio Speakers: నాయకులను చూడాలని.. చెప్పేది వినాలని వారు ఎక్కడికెళ్లినా అశేష జనవాహిని వచ్చేది. కానీ అప్పట్లో ఇప్పటిలా ప్రత్యక్ష ప్రసారాల్లేవు. స్క్రీన్‌లు లేవు. అంతెందుకు లౌడ్‌స్పీకర్లే లేవు. ఫలితంగా.. ఒకేసభలో వివిధ వేదికల వద్దకు వెళ్లి చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పాల్సి వచ్చేది. ప్రజల్ని పదేపదే మౌనంగా ఉండాలని కోరుతూ.. తాము చెప్పేది వినిపించేలా నాయకులు కష్టపడాల్సి వచ్చేది. తన సన్నటి గొంతుతో ప్రజల్ని చేరటానికి గాంధీజీ పడుతున్న కష్టాన్ని.. కాంగ్రెస్ కార్యకర్తగా ఓసారి ప్రత్యక్షంగా చూసిన గెయిన్‌చంద్ మోత్వానే.. వేలమందికి సులువుగా ఆ గొంతు చేరేలా చేయాలనుకున్నారు. ఫలితమే.. షికాగో టెలిఫోన్, రేడియో కంపెనీ (ప్రస్తుతం మోత్వానే ప్రైవేట్ లిమిటెడ్)! అదే గాంధీ, నెహ్రూ, పటేల్ తదితర నాయకుల గొంతులనూ, స్వాతంత్య్ర నినాదాలనూ.. యావత్ భారతీయుల చెవుల్లో మార్మోగేలా చేసింది.
గెయిన్‌చంద్ మోత్వానేది సింధ్ రాష్ట్రం (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది). తండ్రి దీవాన్ చందుమల్ మోత్వానే ప్రముఖ న్యాయవాది. 1890లో.. గెయిన్‌చంద్‌కు 12 ఏళ్ల వయసులోనే చందుమల్ మరణించారు. తండ్రి పోయాక కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. ఉన్న కొద్దిపాటి సొమ్ముతో కుటుంబాన్ని నడుపుతూ.. బుక్‌బైండింగ్, రబ్బర్ స్టాంపులు, పతంగులు తయారు చేస్తూ రోజుకు రూ.2 సంపాదించేవారు గెయిన్‌చంద్. మెట్రిక్యులేషన్‌కు ముందే చదువు ఆపేసినా.. ఆయనలోని సాంకేతిక జిజ్ఞాస తగ్గలేదు. టెలిగ్రఫీ నేర్చుకోవటంతో రైల్వే సిగ్నల్ విభాగంలో కొలువు వచ్చింది. పనితీరు బాగుండటంతో తొందరలోనే.. వాయువ్య రైల్వే పోస్ట్స్-టెలిగ్రాఫ్స్‌లో టెలిగ్రాఫ్ మాస్టర్‌గా పదోన్నతి లభించింది. నిరంతర పరిశోధనలు ఆయన్ను నిలవనివ్వలేదు.
1909లో ఉద్యోగానికి రాజీనామా చేసి.. రూ.300లతో ఈస్టర్న్ ఎలక్ట్రిక్ ట్రేడింగ్ కంపెనీ ఆరంభించారు. జర్మనీ నుంచి ఫ్లాష్‌లైట్లను తెప్పించి అమ్మేవారు. కార్యాలయంలో క్లర్క్, టైపిస్ట్, ఇంజినీర్ పనులతోపాటు వస్తువులను మూటగట్టి పంపించే పని కూడా తానే చేసేవారు గెయిన్‌చంద్. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా జర్మనీ నుంచి దిగుమతులు ఆగిపోయాయి. అమెరికా, గ్రేట్ బ్రిటన్‌ల వైపు దారులు తెరచి.. 1919లో కంపెనీని బొంబాయికి మార్చారు. షికాగో టెలిఫోన్ సప్లయ్ కంపెనీని కొత్తగా మొదలెట్టారు. అమెరికాలోని షికాగో కంపెనీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగా.. వారి అనుమతితో అదే పేరు వాడుకున్నారు గెయిన్‌చంద్. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో... సొంతగా రేడియో ట్రాన్స్‌మిటర్ తయారు చేసి.. బొంబాయి ప్రెసిడెన్సీ రేడియోక్లబ్ లిమిటెడ్ ద్వారా బ్రాడ్‌కాస్టింగ్ కూడా ఆరంభించారు.