తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో వేడికి ఆంగ్లేయులు విలవిల.. అమెరికా నుంచి ఐస్​..!

Azadi Ka Amrit Mahotsav: దోచుకోవటానికి, దాచుకోవటానికి భారత్‌కు వచ్చారు. నయానో భయానో ప్రజల్నీ లొంగదీసుకున్నారు. కానీ వాతావరణాన్ని ఏం చేయగలరు? ఎండాకాలం రాగానే భారత్‌లో వేడికి ఆంగ్లేయులు తాళలేక విలవిలలాడేవారు. దాన్నుంచి తప్పించుకునేందుకు మన ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన డబ్బుతో ఏకంగా అమెరికా నుంచి ఓడల్లో మంచు తెప్పించుకున్నారు! ఒకదశలో భారత్‌లో మంచు ముక్క విలాస వస్తువై వెలిగింది!

Azadi Ka Amrit Mahotsav
Azadi Ka Amrit Mahotsav

By

Published : Mar 6, 2022, 7:41 AM IST

Azadi Ka Amrit Mahotsav: ఒకవంక భారతీయుల నైపుణ్యాలను చంపుతూ, కుటీర పరిశ్రమలను నాశనం చేస్తూ, వ్యవసాయాన్ని భారంగా మారుస్తూ.. ముక్కుపిండి భారీగా పన్నులు వసూలు చేసిన ఆంగ్లేయులు.. తమ విలాసాల కోసం ఆ సొమ్మును వాడుకున్నారు. భారతీయులను రాచిరంపాన పెడుతూ తమ సౌఖ్యాలకు మాత్రం రాయితీలిచ్చుకున్నారు. ముఖ్యంగా ఈస్టిండియా కంపెనీ పాలన ఆరంభమైన తర్వాత ఇంగ్లాండ్‌ నుంచి చాలామంది భారత్‌కు తరలి వచ్చారు. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం భారత్‌లో దిగారు. అంతా బాగానే ఉన్నా.. ఎండాకాలం వచ్చిందంటే మాత్రం వారికి చుక్కలు కనిపించేవి. చలి ప్రదేశం నుంచి వచ్చిన ఆంగ్లేయులు భారత్‌లోని వేడిని తట్టుకోలేకపోయేవారు. దీనికి కనుగొన్న సమాధానం.. అమెరికా నుంచి ఐస్‌ను(మంచు) దిగుమతి చేసుకోవటం.

పక్కనే ఆకాశమంత ఎత్తున్న హిమాలయాలను వదిలి 16వేల నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్న అమెరికా నుంచి మంచు తెచ్చుకోవటమేంటనే సందేహం రాకపోదు. హిమాలయ పర్వతాల నుంచి మంచు తీసుకు రావటాన్ని ఆంగ్లేయులు చాలా కష్టంతో కూడుకున్న పనిగా భావించారు. అంతేగాకుండా భారీ మొత్తంలో డబ్బు ఖర్చవుతుందని, కూలీలు, సిబ్బంది ఎక్కువ సంఖ్యలో అవసరమవుతారనే ఉద్దేశంతో అటువైపు మొగ్గు చూపలేదు. ఇంతలో.. అమెరికాలోని బోస్టన్‌ వ్యాపారి ఫ్రెడెరిక్‌ ట్యూడర్‌ వీరికి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు దొరికాడు. ఆ కాలంలో మంచు వ్యాపారాన్ని విజయవంతంగా మార్చిన ట్యూడర్‌ వివిధ పద్ధతుల్లో అమెరికా నుంచి అనేక దేశాలకు మంచును ఎగుమతి చేసేవాడు. ఇనుప పెట్టెల్లో.. చెక్కపొట్టుతో నింపి పంపిస్తే మంచు కరగకుండా ఉంటుందని గుర్తించి ట్యూడర్‌ ఈ వ్యాపారంలోకి దిగాడు. తొలిసారిగా 1833లో భారత్‌ వైపు తన దృష్టిసారించాడు. బోస్టన్‌, మసాచుసెట్స్‌లోని చెరువుల్లో గడ్డకట్టిన నీటిని.. పెద్దపెద్ద ముక్కలుగా ప్యాక్‌ చేసి మంచును భారత్‌కు ఓడలో తరలించాడు. 1833 మేలో బయలుదేరిన ఓడ.. నాలుగునెలల పాటు సముద్రయానం చేసి సెప్టెంబరు 6న భారత్‌కు చేరుకుంది. కలకత్తా తీరానికి చేరుకున్న మంచుగడ్డలను చూసి ఆంగ్లేయులు సంబరపడిపోయారు. వాటిని చూడటానికి జనాలు ఎగబడ్డారు. ముట్టుకొని మురిసిపోయారు. కొందరైతే.. 'ఏంటీ అమెరికాలో ఐస్‌ చెట్లకు కాస్తుందా?' అని అడిగారట! ట్యూడర్‌ తెస్తున్న ఈ మంచు అంత తక్కువ వేగంతో కరగటానికి కారణాలను నాటి ప్రముఖ శాస్త్రవేత్త మైఖేల్‌ ఫారెడే పరిశోధించారు. గడ్డకట్టిన నీటిలో ఉప్పుశాతం, వాయుబుడగలు అస్సలు లేకపోవటమే కారణమని తేల్చారు. కలకత్తా, బొంబాయి, మద్రాసుల్లో ఈ మంచు పలకలను నిలవ ఉంచటానికి ట్యూడర్‌ ఐస్‌హౌస్‌లను నిర్మించాడు.

రాయితీల వర్షం

ఆంగ్లేయులు, సంపన్న భారతీయులు అమెరికా నుంచి వచ్చిన మంచును కొనుక్కునేవారు. అలా మంచు ఓ విలాసవంతమైన వస్తువైంది. విందుల్లో మంచు ప్రత్యేక ఆకర్షణగా మారింది. మంచుతో ఐస్‌క్రీమ్‌ చేయటం కూడా నేర్పిన ట్యూడర్‌ ఈ వ్యాపారానికి మరింత హంగులద్దాడు. 1834లో బొంబాయిలోని తమ గృహప్రవేశ విందులో పార్శీ వాణిజ్యవేత్త సర్‌ జెంషెడ్‌జీ జూజీభోయ్‌ ఐస్‌క్రీమ్‌ పెట్టడం సంచలనం సృష్టించింది. అలా ఐస్‌క్రీమ్‌ ఓ హోదా చిహ్నమైంది. దీంతో దిగుమతి తగ్గినప్పుడు మంచుకు రేషన్‌ పాటించేవారు. కొద్దికాలానికి డాక్టర్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే (మంచు వాడినా జలుబు చేయదని) మంచు అమ్మేదశ కూడా కొనసాగింది. అమెరికా నుంచి మంచు ఓడ వచ్చిందంటే.. ఆరోజు మధ్యాహ్నం దాకా ఆంగ్లేయులు వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేసి ఐస్‌హౌస్‌ వద్దే ఉండేవారు.

అంతేగాకుండా.. పార్టీలు జోరుగా సాగేవి.ఎండాకాలంలో తమ జీవితాల్లో చల్లదనం నింపినందుకుగాను.. ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం.. ట్యూడర్‌కు అనేక రాయితీలు ప్రకటించింది. దిగుమతి సుంకాల్ని రద్దు చేసింది. దేశవ్యాప్తంగా వ్యాపారానికి సహకారం అందించింది. అలా ట్యూడర్‌ అనతికాలంలోనే భారత్‌లో వ్యాపారం చేసి లక్షల్లో సంపాదించాడు. 1855నాటికి.. మంచు తయారీ, నిలువ పద్ధతులు సులువవటంతో ట్యూడర్‌ ఓడ రావల్సిన అవసరం లేకపోయింది.

ఇదీ చూడండి:గాంధీ- ఇర్విన్​ ఒప్పందం.. తొలిసారి సమ ఉజ్జీలుగా చర్చలు

ABOUT THE AUTHOR

...view details