Azadi Ka Amrit Mahotsav: ఆంగ్లేయుల ఆక్రమణకు ముందు... అడవులన్నీ దాదాపుగా ఆదివాసీలు, సమీప గ్రామాల ప్రజల చేతుల్లో ఉండేవి. వారు తమ జీవికకు పూర్తిగా అడవిపైనే ఆధారపడేవారు. ఒకరకంగా అడవి తమదనే భావనలో దాని రక్షణ బాధ్యత కూడా చూసుకునేవారు. కులాలు, సంప్రదాయాల్లాంటి సామాజిక కట్టుబాట్లతో అడవుల నిర్వహణ సాగేది. కలప, మరే ఇతర అటవీ ఉత్పత్తులు అమ్ముకున్నా అవన్నీ జీవనాధారం కోసమేగాని వ్యాపార దృక్పథంతో చేసేవారు కాదు. చక్రవర్తులు, రాజులు, జమీందార్లకు అటవీ ఉత్పత్తులో, పులి, జింక చర్మాల్లాంటివో బహుమతులుగా ఇచ్చేవారు. అలా... దేశంలో ఐదోవంతు భాగమైన అడవి.. ఆదాయ వనరుగా కాకుండా ఆదివాసీల, గ్రామీణుల జీవికగా కొనసాగింది. ఆంగ్లేయుల రాక తర్వాత ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు రావటం మొదలైంది.
British occupying forest land:వ్యాపారం పేరుతో వచ్చి అధికారం చేబట్టిన ఆంగ్లేయులు భారత్‌లో అన్ని ప్రాంతాలనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రతి రంగాన్నీ, అందులోని ప్రజలను ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేసుకున్నారు. కానీ చాలారోజులు వారి కంట పడకుండా బతికిపోయింది అడవి తల్లి! ఈస్టిండియా కంపెనీ హయాంలోనూ కొన్ని ఆదివాసీ ఘర్షణలు చోటు చేసుకున్నా అవి స్థానిక ఆధిపత్యం కోసం సాగిన చెదురుమదురు సంఘటనలే. ఈస్టిండియా కంపెనీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ భూమి విస్తీర్ణం పెంచటానికి అడవుల నరికివేతను ప్రోత్సహించారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్‌ల్లో ఓక్ చెట్లు తగ్గటంతో ఓడల నిర్మాణం కోసం మలబార్, బర్మా అడవుల్లోని టేకు చెట్లను వాడుకునేవారు. అంతేతప్ప అడవులను ఆదాయ వనరుగా చూడలేదు.
Jal Jangal Jameen movement:1858లో బ్రిటిష్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక... కథ మారింది. తమ వ్యాపార, రవాణా అవసరాల కోసం మొదలెట్టిన రైల్వే లైన్లను బ్రిటిష్ సర్కారు విస్తరించటం మొదలెట్టింది. ఈ క్రమంలో రైలు పట్టాల మధ్య వేసే స్లీపర్ల కోసం భారీస్థాయిలో కలప అవసరమైంది. ఏటా 10 లక్షల స్లీపర్లకు డిమాండ్ ఉండేది. ప్రతి మైలు ట్రాకు వేయటానికి సుమారు 860 స్లీపర్లు అవసరమయ్యేవి. వీటి జీవితకాలం గరిష్ఠంగా 14 సంవత్సరాలు. తర్వాత మళ్లీ కొత్తవి వేయాల్సి వచ్చేది. భారత అడవుల నుంచే టేకు, సాల్ తదితర రకాల చెట్లుకొట్టి స్లీపర్‌లు తయారు చేసినా... డిమాండ్‌కు సరిపడా సమయానికి అందేవి కావు. అది మొదలుగా ఆంగ్లేయ సర్కారు కన్ను అపారమైన అటవీ సంపదపై పడింది. అడవిని ఆదాయ వనరుగా మార్చుకుంటే... చెట్లకు డబ్బులు రాలతాయని గుర్తించారు. సంపదతో పాటు రైల్వే అవసరాలూ తీరుతాయని ఎత్తుగడ వేశారు. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ 1864లో తొలిసారిగా అటవీశాఖను ఏర్పాటు చేశాడు. కానీ ఆంగ్లేయుల వద్ద అడవుల నిర్వహణ, నిపుణులు లేరు. దీంతో... జర్మనీ నుంచి నిపుణుడైన డైట్రిచ్ బ్రాండిస్‌ను తీసుకొచ్చి భారతీయ అటవీశాఖ తొలి ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమించారు. తర్వాత 1865లో భారత అటవీ చట్టం తీసుకొచ్చి అడవులన్నింటినీ కూడా ఆంగ్లేయ సర్కారు అధీనంలోకి తీసుకున్నారు. 1878లో దీన్ని సవరించారు. ఈ చట్ట ప్రకారం శతాబ్దాలుగా, సంప్రదాయంగా వస్తున్న ఆదివాసీల హక్కులన్నింటినీ కాలరాస్తూ... దేశంలోని అడవులను బ్రిటిష్ ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు. దేశంలో చెట్లతో కూడిన ఏ భూమినైనా, ప్రాంతాన్నైనా అడవిగా ప్రకటించి, దాని నిర్వహణను స్వాధీనం చేసుకునే హక్కు ఆంగ్లేయులకు ఈ చట్టం ద్వారా దఖలు పడింది.
British using trees for Railway sleepers:ఇక్కడితో ఆగకుండా... రైల్వే స్లీపర్ల తయారీ కోసం... అడవుల్లో చెట్లను కొట్టే బాధ్యతను జమీందార్లకు కట్టబెట్టారు. ఎవరెక్కువ కప్పం చెల్లిస్తే వారికి అటవీ టింబర్లను అప్పగించారు. ఇలా గుత్తకు తీసుకున్న జమీందార్లు అదివాసీలు, గ్రామీణులను కూలీలుగా మార్చుకున్నారు. ఇలా అప్పటిదాకా అడవి మాదనుకొని బతుకుతున్న జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. చాలాచోట్ల వీరు వెట్టికూలీలుగా కూడా మారిపోయారు. ఆ నిర్బంధాలు, అణచివేతల నుంచి పుట్టినవే అనేక తిరుగుబాట్లు! తమ చేతుల్లో ఉన్నవి సంప్రదాయ బాణాలు, విల్లులే అయినా...ఆధునిక ఆయుధాలున్న ఆంగ్లేయులపై తిరగబడ్డారు ఆదివాసీ యోధులు! బ్రిటిష్ సర్కారు పద్ధతులనే చాలా సంస్థానాల్లోని భారతీయ రాజులూ పాటించారు. హైదరాబాద్ నిజాంపై జల్ జంగల్ జమీన్ అంటూ కొమరం భీం ఎలుగెత్తినా, ఆంధ్రలో తెల్లవారిపై అల్లూరి శంఖం పూరించినా అన్నీ... ఆ 'అడవి' ఆక్రందనలే!
ఇదీ చదవండి:ఉరితో ఆగలేదు.. భగత్‌సింగ్ మృతదేహాన్ని ముక్కలు చేసి.. సంచిలో కుక్కి..