స్వాతంత్య్రానికి ముందు ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్‌లో భాగంగా ఉండేది 'అవధ్' సంస్థానం. ఫజియాబాద్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించింది ముహమ్మది ఖానుమ్. సరిగ్గా పోషించలేని తండ్రి చిన్నతనంలోనే ఆమెను అమ్మేశాడు. బానిసగా రాజప్రాసాదంలో అడుగుపెట్టి అక్కడే నాట్యం నేర్చుకుని నాట్యగత్తెగా మారింది. అందానికి నాట్యం తోడవటంతో రాజు నవాబ్ వాజిద్ అలీ షా మనసుకు చేరువైంది. ఆమెను తాత్కాలిక భార్యగా చేసుకున్నాడు. ఆ కాలంలో మహారాజుకు అనేక మంది తాత్కాలిక భార్యలుండేవారు. పిల్లలు పుడితే వారు అధికారిక భార్యగా మారటమేగాకుండా రాణిహోదా లభించేది. కుమారుడు జన్మించటంతో.. ఖానుమ్ కాస్తా బేగం హజ్రత్ మహల్‌గా మారి రాజుకు మరింత చేరువైంది.
1856లో బ్రిటిష్ ప్రభుత్వం అవధ్ సంస్థానంపై కన్నేసింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ సంస్థానాన్ని రాజుకింద ఉంచటం కంటే తామే చేపట్టాలని భావించి.. స్వాధీనం చేసుకుంది. నవాబ్ వాజిద్ అలీ షా సంస్థానం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. బ్రిటన్ వెళ్లి విక్టోరియా మహారాణిని కలవాలని భావించిన వాజిద్ అలీ షా.. భార్యలు, సేవకులందరినీ వదలి కోల్‌కతాకు తరలిపోయాడు. అదే సమయంలో.. మధ్యభారతంలో సిపాయిల తిరుగుబాటు మొదలైంది. ఆ ప్రభావం అవధ్‌పైనా పడింది. మేరఠ్, బెంగాల్ సిపాయి దళాల్లో చాలామంది అవధ్ నుంచి భర్తీ అయినవారే ఉండేవారు. వీరందరికీ.. స్థానిక జాగీర్దార్లు తోడవటంతో అవధ్‌లోనూ తిరుగుబాటు మొదలైంది. కానీ వీరందరినీ సమన్వయం చేసే నాయకుడు లేకుండా పోయారు. రాజు చిన్నకుమారుడు 12ఏళ్లవాడే. దీంతో.. బేగం హజ్రత్ మహల్ తానే స్వయంగా రంగంలోకి దూకింది. అందరినీ సమన్వయం చేసుకుంటూ.. హిందువులు, ముస్లింలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది. రాజా జైలాల్ సింగ్, మమ్ముఖాన్‌లను కమాండర్లుగా నియమించి.. పరదాల చాటు బతుకుతున్న మహిళలను కూడా సంగ్రామంలోకి రావాలని పిలుపునిచ్చింది. బేగం సారథ్యంలోని సిపాయిలు.. మే 30న లఖ్‌నవూను స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ రెసిడెంట్ కమిషనర్ హెన్రీ లారెన్స్ తన సైన్యంతో పోరాడినా లాభం లేకపోయింది. దాదాపు ఆరునెలల పోరాటం అనంతరం చివరకు లారెన్స్ మరణించాడు. లఖ్‌నవూ పూర్తిగా బేగం హజ్రత్ మహల్ వశమైంది. కొద్దికాలం ఆమె సారథ్యంలోనే పాలన సాగింది. బ్రిటిష్ ప్రభుత్వం అనేకమార్లు తనతో ఒప్పందానికి సందేశాలు పంపించింది. నెలకు లక్ష రూపాయల పింఛను చెల్లిస్తామని ఆశపెట్టింది. వేటికీ లొంగలేదు బేగం హజ్రత్ మహల్!
లొంగకుండా..