Azadi Ka Amrit Mahotsav Babu Genu Said: మహారాష్ట్రలోని మహాలుంగే పడ్వాల్ ప్రాంతంలో 1908 జనవరి 1న బాబూ గేను సేద్ ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. రెండేళ్ల వయసులోనే తండ్రి మరణించారు. వారి కుటుంబానికి ఏ రోజుకారోజు పూట గడవడమే మహాభాగ్యంగా మారింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో చదువుకు దూరమయ్యారు. పశువుల కాపరిగా కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తూ బాల్యాన్ని నెట్టుకొచ్చిన బాబూ.. ముంబయి వెళ్లి అక్కడ ఓ మిల్లులో కార్మికుడిగా చేరారు. శాసనోల్లంఘనలో భాగంగా స్వదేశీ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయమది. ఉద్యమకారులు పల్లె నుంచి పట్టణం వరకు ఎక్కడికక్కడ విదేశీ వస్త్రాలు, వస్తువులను దహనం చేస్తున్నారు.
ఇంటింటి నుంచి దుస్తులను సేకరించి, ముంబయిలోని ప్రధాన కూడళ్లలో నిప్పంటించేవారు. బాబూ గేను కూడా ఈ ఉద్యమంతో స్ఫూర్తి పొందారు. మిల్లు కార్మికుడిగా వచ్చే జీతంలో కొంత ఇంటికి పంపగా, మిగిలే డబ్బుతో రెండు పూటలా భోజనం చేయడమే ఆయనకు భారంగా తయారైంది. మూడు జతల దుస్తులే ఉండేవి. రేపటికి ధరించడం ఎలాగని ఆలోచించకుండా.. ఆ విదేశీ దుస్తులను మంటల్లో కాల్చేశారు. అతికష్టంగా ఒక జత ఖాదీ దుస్తులను సంపాదించుకున్నారు. అనంతరం ముంబయిలో ప్రత్యేకంగా ఒక బృందాన్ని తయారు చేసిన గేను.. స్వదేశీ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు.
అతను నా సోదర సమానుడు
ముంబయి ఓడరేవుకు ఉద్యమకారులు బృందాలుగా వెళ్లేవారు. బ్రిటన్ నౌకల నుంచి దుస్తులు, వస్తువులను దించగానే కాల్చేస్తుండేవారు. ఇలాగే.. 1930 డిసెంబరు 12న విదేశీ దుస్తులు వస్తున్నాయన్న విషయం తెలుసుకున్న బాబూ గేను తన బృందంతో అక్కడికెళ్లారు. ఓడలోంచి వాటిని దింపొద్దని, తిరిగి తీసుకెళ్లండని కోరారు. ఒకవేళ దింపితే ఇక్కడే నిప్పు పెడతామని హెచ్చరించారు. ఆయన మాటలను లెక్కచేయని ఆంగ్లేయులు ఓడ నుంచి దుస్తులను కిందికి దింపారు. వాటిని లారీలోకి ఎక్కించి ముంబయిలోని పాత హనుమాన్ గల్లీలోకి పంపించారు. బాబూ గేను ఆ లారీని వెంబడించి భంగ్‌వాడీ సమీపంలోని కల్బాదేవి రోడ్డు వద్ద అడ్డుకున్నారు. తన బృందంతో కలిసి లారీకి అడ్డంగా పడుకున్నారు.