Azadi Ka Amrit Mahotsav: భారత రాజ్యాంగ రూపకల్పన అనగానే బాబా సాహెబ్ అంబేడ్కర్, బాబూ రాజేంద్రప్రసాద్, నెహ్రూ.. ఇలా ప్రముఖుల పేర్లు కనిపిస్తాయి. వీరితో పాటు రాజ్యాంగ రచనలో అత్యంత కీలక పాత్ర పోషించి.. అంతగా ప్రచారంలోకి రాకుండా, తెరవెనకనే ఉండిపోయిన నిపుణుడు సర్ బెనగళ్ నర్సింగరావు. స్వతంత్ర భారతంలో అందరికీ ఓటు హక్కు కల్పించటంలోనూ కృషి చేసిన ప్రజాస్వామ్యవాది బీఎన్ రావు!
ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత్‌ది. మరి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రాయటానికి పట్టిన సమయం.. మూడేళ్లకంటే తక్కువే. ఇంత తక్కువ సమయంలో ఆంగ్లేయులే కాకుండా.. యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా రాజ్యాంగ రచన పూర్తవటం వెనక నర్సింగరావు కృషితో పాటు నైపుణ్యం దాగుంది. ఈ విషయాన్ని అంబేడ్కరే స్వయంగా కొనియాడారు.
కర్ణాటకలోని మంగళూరులో 1887 ఫిబ్రవరి 26న జన్మించారు నర్సింగరావు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి అగ్రస్థానంలో నిల్చి ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజీలో స్కాలర్‌షిప్ సంపాదించారు. అక్కడ చదువు పూర్తికాగానే.. ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్) కూడా పాసయ్యారు. 1909లో భారత్‌కు తిరిగి వచ్చి బెంగాల్‌లో ఉద్యోగంలో చేరారు. క్రమంగా న్యాయమూర్తిగా మారిన నర్సింగరావుకు వివిధ దేశాల రాజ్యాంగాలపై గట్టి పట్టుండేది. దీంతో భారత చరిత్రలో అత్యంత కీలకమైన 1935 బ్రిటిష్ భారత ప్రభుత్వం పరిపాలన చట్టాన్ని రూపొందించటంలో ఆయన సేవలను వినియోగించుకుంది ఆంగ్లేయ సర్కారు. అప్పటిదాకా ఉన్న అనేక కేంద్ర, రాష్ట్ర చట్టాలన్నింటినీ క్రోడీకరించి.. 18నెలల్లో ఆ చట్ట ముసాయిదాను తయారు చేశారాయన. తరువాత కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. అదే సమయంలో పంజాబ్-సింధ్ నదీజలాల పంపకం వివాదం పరిష్కార బాధ్యత రావుకు అప్పగించారు. దానిపై ఆయన 1942లో ఇచ్చిన నివేదికను నదీజలాల వివాదాలు, పరీవాహక ప్రాంతాల హక్కుల విషయంలో భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రామాణికంగా పరిగణిస్తుంటారు.
1944లో ఐసీఎస్ నుంచి రిటైరైన నర్సింగరావును కశ్మీర్ రాజు ప్రత్యేకంగా ఆహ్వానించి తమ రాష్ట్ర ప్రధానమంత్రిగా నియమించారు. కానీ తర్వాత మహారాజు విధానాలు నచ్చక రాజీనామా చేశారు. వెంటనే నర్సింగరావును భారత వైస్రాయ్ గవర్నర్ జనరల్ కార్యాలయంలో రాజ్యాంగ సంస్కరణల కార్యదర్శిగా నియమించుకున్నారు.
అంతర్జాతీయ న్యాయమూర్తిగా..
ఆజాద్ హింద్‌ఫౌజ్‌లోని సుభాష్‌చంద్రబోస్ కీలక సహచరులు ముగ్గురిని పట్టుకొని బ్రిటిష్ సర్కారు ఎర్రకోటలో విచారించింది. వారికి కఠిన శిక్ష పడకుండా తప్పించేలా వాదన తయారు చేసి ఇచ్చిందీ నర్సింగరావే. బర్మా సైతం తమ రాజ్యాంగ రచనలో నర్సింగరావు సాయం తీసుకుంది. స్వాతంత్య్రానంతరం తొలి ఎన్నిక నుంచే భారత్‌లో అందరికీ ఓటు హక్కు కల్పించాలనుకున్న వేళ.. అందుకు తగ్గ ఓటర్ల జాబితా తయారీలోనూ నర్సింగరావు కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్‌పై నిజాం ఐక్యరాజ్యసమితికి వెళితే.. జనరల్ అసెంబ్లీలో భారత్ తరఫున బలమైన వాదన సిద్ధం చేసిందీ ఆయనే. 1948 నుంచి 1952 వరకు ఐరాసకు భారత ప్రతినిధిగా వెళ్లిన నర్సింగరావు 1950లో ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. తర్వాత హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులై.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం కోసం నిలబడ్డ ఈ భారత ప్రతిభామూర్తి 1953 నవంబరు 30న జ్యూరిచ్ ఆసుపత్రిలో మరణించారు. ప్రపంచానికి భారత్ అందించిన అరుదైన ఆణిముత్యం అని ఐరాస, అమెరికా, రష్యాలతో పాటు యావత్ ప్రపంచం నివాళులర్పించింది.
అనుసంధానకర్తగా..
భారత స్వాతంత్య్రం దిశగా అడుగులు పడటం వల్ల బీఎన్ రావు పాత్ర అత్యంత కీలకమైంది. అటు ఆంగ్లేయులకు, ఇటు భారతీయులకు మధ్య ఆయన అనుసంధానకర్తగా మారారు. 1946, డిసెంబరు 9న తొలిసారి రాజ్యాంగసభ సమావేశం కాగా.. జులైలోనే నర్సింగరావు సభకు సలహాదారుగా నియమితులయ్యారు. రాజ్యాంగ రచన కమిటీలోనూ సభ్యులయ్యారు. రాజ్యాంగ సభ ఎలా పనిచేయాలో, ఏయే కమిటీలుండాలో, వాటి పనితీరు, బాధ్యతలను నిర్దేశించటం సహా వాటన్నింటికీ అవసరమైన నివేదికలను, విశ్లేషణలను, వాదనలకు అవసరమైన పాయింట్లను అందించిన ఘనత నర్సింగరావు, ఆయన బృందానిదే. అమెరికా, కెనడా తదితర దేశాల్లో పర్యటించి నిపుణులతో మాట్లాడి వచ్చారు. ముందస్తుగానే ముసాయిదా రాజ్యాంగ ప్రతిని సిద్ధం చేసి అంబేడ్కర్ సారథ్యంలోని కమిటీ ముందుంచారు నర్సింగరావు. ఈ ముసాయిదాపై చర్చించి, సవరణలు చేసి, మరికొన్నింటిని చేర్చిన కమిటీ తుది రాజ్యాంగాన్ని సిద్ధం చేసింది. "ఒకవేళ ఎవరినైనా మా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయండని మా అధ్యక్షుడు నన్ను కోరితే బి.ఎన్.నర్సింగరావు పేరు చెబుతా" అంటూ అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఫెలిక్స్ ఫ్రాంక్‌ఫర్టర్ వ్యాఖ్యానించటం విశేషం.
ఇదీ చూడండి:AZADI KA AMRIT MAHOTSAV: నరరూప చర్చిల్