Ashpakhulla Khan Biography: అప్పుడా పిల్లాడు ఏడో తరగతి చదువుతున్నాడు. తన పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థి ఒకరిని.. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడంటూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనే ఆ చిన్నారి మనసులో 'స్వాతంత్య్రం' అనే భావనను మొగ్గతొడిగేలా చేసింది. అదే.. ఆ తర్వాత ఆయనను గొప్ప జాతీయవాదిగా నిలిపింది. భరతమాత దాస్యశృంఖలాలను తెంచేందుకు స్ఫూర్తినిచ్చింది.
అష్పఖుల్లా ఖాన్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో 1900 అక్టోబరు 22న అత్యంత సంపన్న కుటుంబంలో జన్మించారు. నవాబుల వంశానికి చెందిన ఆయన కుటుంబం నిత్యం భోగభాగ్యాలతో అలరారేది. ఆ రోజుల్లోనే ఏకంగా 32 పడకగదులు, రెండు ఈతకొలనులు ఉన్న భారీ భవంతిలో నివసించేవారు. సకల సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ చదువులకు పెద్దగా విలువ ఇవ్వలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా డిగ్రీ చదువుకున్నవారు లేరు. తల్లి తరఫు బంధువుల్లో చాలామంది ఆంగ్లేయ ప్రభుత్వంలో ఉన్నతాధికారులు. వీరంతా 1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా సిపాయిల ఆగ్రహానికి గురయ్యారు. ఈ రెండు కుటుంబాలలో బ్రిటిషర్లపై పోరాటం అటుంచి, కనీసం వారి గురించి వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడినా సహించేవారు కాదు. ఇలాంటి వాతావరణంలో పెరిగినా... అష్పఖుల్లాఖాన్‌కు మాత్రం ఆధునిక భావాలు అలవడ్డాయి. ముఖ్యంగా గొప్ప దేశభక్తుడు రాంప్రసాద్ బిస్మిల్ స్నేహం, బంకిం చంద్ర ఛటర్జీ రాసిన ఆనంద్‌మఠ్ పుస్తకం అతణ్ని పూర్తిగా మార్చేశాయి. తొలిసారి కలిసిననాటి నుంచి చనిపోయే వరకు ఒకే లోకంగా బతికిన బిస్మిల్, అష్పఖ్‌లు ఆ కాలంలో స్నేహానికి మరోపేరుగా నిలిచారు. అన్యమతస్థుడితో దోస్తీ వద్దని కుటుంబసభ్యులు వారిస్తే... స్వాతంత్య్ర పోరాటంలో కులమతాలు ఏమిటని కొట్టిపడేసేవారు. తమ కుటుంబ సభ్యుల ముందే గొంతెత్తి వందేమాతరం నినాదం ఇచ్చేవారు.