తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దమ్ముంటే కాచుకోండి'.. ఆంగ్లేయులపై విరుచుకుపడ్డ మన్యం వీరుడు అల్లూరి - ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

స్వాతంత్య్ర సాధనలో భాగంగా ఆంగ్లేయులపై అనేక విప్లవ దాడులు జరిగాయి. కానీ.. నేనొస్తున్నా.. మీపై దాడి చేస్తున్నా.. ఫలానా టైంలో.. ఫలానా చోట.. దమ్ముంటే కాచుకోండి.. అంటూ సవాలు విసిరి విరుచుకుపడ్డ ఏకైక మొనగాడు.. అల్లూరి సీతా రామరాజు! మన రంప విప్లవ కారుడు.. తెలుగు వీరుడు!

అల్లూరి సీతారామరాజు
alluri sitarama raju

By

Published : Jul 3, 2022, 6:49 AM IST

అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లా పాండ్రంగిలో 125 సంవత్సరాల క్రితం 1897 జులై 4న జన్మించారు. తల్లిదండ్రులు వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ. సోదరుడు సత్యనారాయణ, సోదరి సీతమ్మ. తండ్రి రాజమహేంద్రవరం జైలు ఫొటోగ్రాఫర్‌. అల్లూరి ఎనిమిదేళ్ల వయసులో ఆయన చనిపోయారు. చిన్నాన్న సాయంతో రాజమహేంద్రవరం, కాకినాడ, తుని, రామచంద్రపురం, నరసాపురంలో చదువుకున్న రామరాజు తునిలో విలువిద్య, గుర్రపుస్వారీ నేర్చుకున్నారు. చిన్నాన్నకు రంపచోడవం బదిలీ కావడంతో అక్కడికి వెళ్లిపోయారు. ఆయుర్వేదం, జోతిషం, హస్తసాముద్రికమూ అభ్యసించారు. విశాఖలోని ఎ.వి.ఎన్‌. కళాశాలలో చేరి, చదువును మధ్యలోనే ఆపేశారు. 18 ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించారు. తర్వాత తన తండ్రి స్నేహితుడికి పైడిపుట్టలో ఉన్న భూమిలో వ్యవసాయం చేశారు.

అధ్యయనం.. ఆపై ఉద్యమం:సీతారామరాజుకు తనచుట్టూ జరిగే విషయాలను నిశితంగా గమనించే అలవాటుంది. బ్రిటిషర్ల పాలన కారణంగా దేశానికి జరుగుతున్న నష్టంపై తెలుసుకోవడానికి 1916లో బెంగాల్‌ వెళ్లి నాటి కాంగ్రెస్‌ నేత సురేంద్రనాథ్‌ బెనర్జీని కలిశారు. వివిధ గిరిజనోద్యమాలను అధ్యయనం చేశారు. విశాఖ, రేకపల్లి, భద్రాచలం, ఛోటానాగ్‌పుర్‌, బిహార్‌, బెంగాల్‌, ఒడిశా, బస్తర్‌లలో జరిగిన తిరుగుబాట్ల అనుభవాలను తెలుసుకున్నారు.

స్వరాజ్యం లాక్కోవాల్సిందే:బ్రిటిషర్లు 1882లో తీసుకొచ్చిన అటవీ చట్టంతో గిరిజనుల బతుకులు భారమయ్యాయి. పోడు వ్యవసాయాన్ని నిషేధించారు. గిరిజనులను రోడ్ల నిర్మాణంలో కూలీలుగా మార్చారు. అదేసమయంలో ఏజెన్సీలో తరతరాలుగా ఉన్న శిస్తు వసూలుదారులను కూడా తొలగించారు. అటవీ సంపదను తరలించడానికి మన్యంలో రోడ్లు వేస్తున్నప్పుడు కూలీలపై కాంట్రాక్టర్ల దురాగతాలు పెచ్చుమీరాయి. పోలీసులు కాంట్రాక్టర్లకే మద్దతివ్వడంతో గిరిజనుల్లో అసంతృప్తి పెరిగింది. ఆ సమయంలో గిరిజనుల పక్షాన నిలవడానికి సీతారామరాజు అడవిబాట పట్టారు. గిరిజనులు, శిస్తు వసూలుదారులతో కమిటీలు వేశారు. స్వరాజ్యం అడుక్కుంటే రాదని, లాక్కోవాల్సిందేనని అల్లూరి బలంగా నమ్మేవారు. ఈ లక్ష్య సాధనకు ఆయుధాలు ఉండాలని నిర్ణయించి, గంటందొర, మల్లుదొర వంటి స్థానిక నాయకులతో సైన్యం ఏర్పాటు చేశారు.

మూడేళ్లపాటు సమాంతర పాలన:అల్లూరి మార్గదర్శకత్వంలో మన్యం గిరిజనులు మూడేళ్లపాటు సమాంతర స్వయం పాలన సాగించారు. పోలీస్‌స్టేషన్లపై దాడులు చేశారు. తాము దాడి చేయబోయే పోలీస్‌స్టేషన్లకు ముందుగా సమాచారం పంపించడం, పట్టపగలే ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం సీతారామరాజు పోరాట ధీరత్వానికి నిదర్శనం. ఈమేరకు తొలిసారిగా 1922 ఆగస్టు 22న చింతపల్లి ఠాణాలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత 1924 మే వరకు కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, రంపచోడవరం, దమ్మానపల్లి, నర్సీపట్నం, దేవీపట్నం, అడ్డతీగల, అన్నవరం పోలీసు స్టేషన్లపై మెరుపుదాడులు సాగించారు. మన్యం వీరులను అణచివేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం కావడంతో.. గవర్నర్‌ వెల్లింగ్టన్‌ గుంటూరు కలెక్టర్‌ రూథర్‌ఫర్డ్‌ను తూర్పుగోదావరి కలెక్టర్‌గా పంపించాడు. ఆయన గుడాల్‌ అనే సైన్యాధికారిని తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి కుటిల నీతితో అల్లూరి ప్రధాన అనుచరులలో కొందరిని పట్టుకుని అండమాన్‌ జైలుకు తరలించారు. మరికొందరిని హత్యచేశారు. చివరికి 1924 మే 7వ తేదీన విశాఖ జిల్లా కొయ్యూరులో అల్లూరిని బలితీసుకున్నారు. సీతారామరాజు భౌతికంగా జీవించింది 27 సంవత్సరాలే అయినా.. భారతీయుల గుండెల్లో ఆయన ఎప్పటికీ సజీవులే. అల్లూరి అంటే తరగని కీర్తి. పోరాటాలకు నిత్యస్ఫూర్తి.

ఒకసారి కాకినాడలోని కళాశాలలో సీతారామరాజు ఆంగ్ల నాటకంలో కింగ్‌ జార్జి వేషం వేశారు. గుండెలమీద చక్రవర్తి పతకాన్ని ధరించారు. నాటకం ముగిశాక కూడా దాన్ని తీయకుండా అలాగే ధరించసాగారు. ఎందుకలా చేస్తున్నారని ప్రశ్నిస్తే.. 'తెల్లవాడు మన గుండెలపై తిష్ఠ వేశాడు. ప్రజలందరికీ అర్థమయ్యేలా ఉండేందుకే వాడి పతకాన్ని ఇలా గుండెల మీద ధరించాను' అని సమాధానమిచ్చారు అల్లూరి సీతారామరాజు.

ఇవీ చదవండి:బ్రిటిషర్లకు వణుకు పుట్టించి.. విప్లవవీరుడు భగత్​సింగ్​కు స్ఫూర్తిగా నిలిచి..

'గెరిల్లా సైన్యం'తో బ్రిటిషర్లకు వణుకు పుట్టించిన వీరుడు

ABOUT THE AUTHOR

...view details