Azadi ka Amrit Mahostsav: మొదటి ప్రపంచయుద్ధం కాగానే భారత్‌కు స్వయం ప్రతిపత్తినిస్తామంటూ హామీ ఇచ్చిన బ్రిటిష్ సర్కారు వేలమందిని సైన్యంలో భర్తీ చేసుకుంది. ఆంగ్లేయుల మాటలు నమ్మి గాంధీజీలాంటివారు సైతం ఉత్సాహంగా ఊరూరా తిరిగి యువకులను బ్రిటిష్ సైన్యంలో చేరేలా ప్రోత్సహించారు. మనదికాని యుద్ధంలో, మనకు తెలియని ప్రత్యర్థితో పోరాడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంలో బ్రిటన్ సహచర దేశాలు గెలిచాయి. ఇక ఇచ్చిన మాట మేరకు ‘స్వయం ప్రతిపత్తి’ శుభవార్త వస్తుందని అంతా ఆశగా ఎదురు చూస్తున్న వేళ... పిడుగులా వచ్చిందో వార్త! అదే రౌలత్ చట్టం. 1919 మార్చి 18న ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ - అరాచకవాదం, విప్లవ నేరాల చట్టాన్ని ఆమోదించింది. దీన్నే రౌలత్ చట్టంగా పిలుస్తారు.
భారత్‌లో రాజకీయ ఉగ్రవాదాన్ని అధ్యయనం చేయటానికి ఏర్పడిందీ రౌలత్ కమిటీ. 1917లో ఏర్పడ్డ ఈ కమిటీలో రౌలత్‌తో పాటు మరో ఐదుగురు సభ్యులు. 1910 తర్వాత బెంగాల్, పంజాబ్‌ల్లో విప్లవవాద సంస్థల కార్యకలాపాలు పెరిగాయి. పదేపదే బ్రిటన్ ప్రభుత్వం, అధికారులు లక్ష్యంగా దాడులు సాగాయి. వీటికి తోడుగా విదేశాల్లో ముఖ్యంగా జర్మనీ, రష్యా, అమెరికాల్లోనూ భారతీయ విప్లవకారుల సమావేశాలు జోరందుకున్నాయి. 1917లో రష్యాలో కమ్యూనిస్టులను అధికారంలోకి తెచ్చిన బోల్షివిక్ విప్లవంతో భారత్‌లో తమ సర్కారుకు ముప్పు రావొచ్చని ఆంగ్లేయులు భావించారు. వీరికి అదనంగా గాంధీ ఆధ్వర్యంలో జాతీయోద్యమం వేగం పుంజుకోవటం ఆరంభమైంది. ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన రౌలత్ బృందం కఠినాతి కఠిన చర్యలను సిఫార్సు చేసింది. కొత్త చట్టాలను ప్రతిపాదించింది. వాటినే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించింది. ఈ రౌలత్‌చట్టం ప్రకారం బ్రిటిష్ సర్కారుకు అపారమైన విశేషాధికారాలు దఖలు పడ్డాయి.
Rowlatt act
రాజకీయ ఖైదీలను ఎలాంటి విచారణ లేకుండా రెండేళ్లపాటు నిర్బంధించటం; వారెంటు లేకుండా అరెస్టు చేయటం; ఎక్కడైనా తనిఖీలు చేయటం; రాజద్రోహ నేరం మోపి పత్రికల నోరు నొక్కటం, రాజకీయ సభలు, సమావేశాలపై నిషేధంలాంటివి కీలకం. అసలే భారతీయులను మనుషులుగా చూడని ఆంగ్లేయ సర్కారును ఈ రాక్షస చట్టం మరింత కర్కశంగా మార్చింది. ఆంగ్లేయులు విధించిన ఎమర్జెన్సీ ఇది. ఎవరెంతగా వ్యతిరేకించినా చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. నలుగురికి మించి ఎక్కడ గుమికూడినా అరెస్టు చేసి లోపల వేసేశారు.