ఆకాలంలో బ్రిటన్‌లో ప్రిన్స్ ఎడ్వర్డ్‌కున్న ప్రాచుర్యాన్ని అర్థం చేసుకోవాలంటే.. కొన్నేళ్ల కిందట మరణించిన బ్రిటిష్ యువరాణి డయానాకెంత పలుకుబడి, ప్రాచుర్యం ఉండేవో.. ఆ కాలంలో ప్రిన్స్ ఎడ్వర్డ్‌కూ అలా ఉండేది. భావి రాజును.. నాలుగునెలల పాటు వలసరాజ్య ప్రజలను చూసి, తమ ఆధిపత్యాన్ని ఆస్వాదించి రావాల్సిందిగా భారత్‌కు పంపించింది బ్రిటన్!
తొలి ప్రపంచయుద్ధం ముగిసిన కాలమది. బ్రిటన్‌కు భారత్ భారీగా ఆర్థిక, సైనిక సాయం చేసింది. వేలమంది భారతీయులు తమదిగాని యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ కృతజ్ఞతతోనైనా భారత్‌కు ఆంగ్లేయులు స్వయంప్రతిపత్తి ఇస్తారేమోనని ఆశించారు. కానీ అలాంటిదేమీ లేదని పాషాణ బ్రిటన్ స్పష్టం చేసింది. పైగా జలియన్ వాలాబాగ్ లాంటి.. దారుణానికి ఒడిగట్టింది. అలాంటి సమయంలో.. భారతీయులను సముదాయించి.. తమ ఆధిపత్యానికి వారితోనే ఆమోదముద్ర వేయించుకోవటానికి ఎడ్వర్డ్ ముంబయిలో అడుగుపెట్టారు.
కానీ బ్రిటిష్ రారాజుకు.. తమ మనసులో ఏముందో భారతీయ ప్రజానీకం స్పష్టంగా తెలియజెప్పారు. పైగా... గాంధీజీ సైతం... ఎడ్వర్డ్ పర్యటనను బహిష్కరించాలని, శాంతియుతంగా నిరసనలు తెలపాలని, సహాయ నిరాకరణకు పిలుపునివ్వటంతో బహిష్కరణవాదులకు ఊపువచ్చింది. రారాజు పర్యటనను యావత్ భారతావని బాయ్‌కాట్ చేసింది.
సాధారణంగానైతే.. యావత్ ముంబయిలో సంబరాల వాతావరణం ఉండాల్సింది. బోసిపోయిన వీధులు, మూసిన దుకాణాలతో కూడిన బంద్ వాతావరణం... ఎడ్వర్డ్‌కు ఆహ్వానం పలికాయి. 35 పట్టణాలు, నగరాల్లో ఎడ్వర్డ్ పర్యటన ఖరారు కాగా.. అంతటా అదే పరిస్థితి. కంగారు పడ్ద స్థానిక బ్రిటిష్ అధికారులు తమకు జీహుజూర్ అనే సంస్థానాధీశులను ఆశ్రయించారు. ముంబయి గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద నుంచి మొదలెడితే.. ఎక్కడికి వెళ్లినా సంస్థానాధీశులు ప్రజల్ని సమకూర్చారు. పాఠశాల పిల్లలు, ముతకా ముసలితో జనసమీకరణ చేసి.. రారాజు వచ్చిన చోటల్లా.. 'మీ సేవలో' అంటూ బ్యానర్లు రాయించి.. తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. పంజాబ్ పర్యటనైతే పూర్తిగా పోలీసు రక్షణలో సాగింది.