Made in British India: కరెంటు లేని కాలంలో కలకత్తాలో గ్యాస్ దీపాలు వాడేవారు. 1879లో ఇంగ్లాండ్ కంపెనీ ఒకటి వచ్చి ఎలక్ట్రిక్ బల్బ్‌లను పరిచయం చేసింది. 1895లో ఆంగ్లేయ సర్కారు కలకత్తా ఎలక్ట్రిక్ లైటింగ్ చట్టం తీసుకొచ్చింది. తర్వాత కొన్నాళ్లకు ఫిలిప్స్ రంగంలోకి వచ్చి... కలకత్తా మార్కెట్‌ను ఆక్రమించింది. అయితే... యూరోపియన్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో... అదీ వీధుల్లో మాత్రమే లైట్లు ఉండేవి. భారతీయులకు ముఖ్యంగా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేవి కావు.
అసలే స్వదేశీ ఉద్యమం సాగుతున్న వేళ... మార్కెట్‌లో డిమాండ్ కూడా ఉండటంతో... బెంగాల్‌కు చెందిన ముగ్గురు మిత్రులు... సురేన్, కిరణ్, హేమన్ రేలు కలసి 1930లో బెంగాల్ ఎలక్ట్రిక్ ల్యాంప్ వర్క్స్‌ను స్థాపించారు. జమీందారీ కుటుంబ నేపథ్యంతో విదేశాల్లో చదువుకొని వచ్చిన వీరు అప్పటికే జాదవ్‌పుర్ కాలేజీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. యూరోపియన్లకు పోటీగా... మధ్యతరగతి భారతీయుల ఇళ్లలోనూ వెలుగులు నింపాలనే ఉద్దేశంతో... దీన్ని ప్రారంభించారు. నాణ్యమైన బెంగాల్ బల్బ్‌లు ప్రజల్ని ఆకట్టుకున్నాయి. స్వదేశీ ఉద్యమ ప్రభావంతో అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగాయి. ఎంతగా అంటే డిమాండ్‌ను తట్టుకోవటానికి జాదవ్‌పుర్‌లో కొత్తగా ఫ్యాక్టరీ పెట్టాల్సి వచ్చేంతగా!
'టెర్రరిస్టు'... దాస్ మార్గో సబ్బు!
బ్రిటిష్ సర్కారు పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత... ఆంగ్లేయ ఉత్పత్తులు భారత్‌పై విరుచుకుపడ్డాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగునా విదేశీ ఉత్పత్తిని వాడాల్సిన పరిస్థితి. స్వదేశీ అభిమానం ఉన్నా దేశీయంగా ఉత్పత్తి లేని అశక్తత. ఈ నేపథ్యంలో... దూసుకొచ్చిన ఓ పేరు ఖగేంద్రచంద్ర దాస్! కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాల నుంచి చదువు పూర్తయ్యాక శిబ్‌పుర్ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా చేరారు దాస్. ఉద్యోగం చేస్తూనే జాతీయోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆగ్రహించిన ఆంగ్లేయ సర్కారు ఆయనను అరెస్టు చేయటానికి రంగం సిద్ధం చేసింది.