AZADI KA AMRIT MAHOTSAV: ఆధునిక భారత చరిత్రలో 1940-47 మధ్యకాలం అత్యంత కీలకమైంది. రెండో ప్రపంచ యుద్ధం... భారత్‌పై పట్టు సడలించబోతున్నట్లు బ్రిటన్ సంకేతాలు... ముస్లిం లీగ్ పాకిస్థాన్ డిమాండ్ ఊపందుకోవటం... జాతీయోద్యమ పతాకస్థాయి.. వెరసి కాంగ్రెస్ అధ్యక్ష పదవి అగ్నిపరీక్షగా మారిన తరుణమది! ఆ సమయంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు అబుల్‌కలాం ఆజాద్. 1888లో మక్కా (సౌదీ అరేబియా)లో పుట్టి కోల్‌కతాలో స్థిరపడ్డ ఆయన కలం పేరు ఆజాద్! మౌలానా అనేది పాండిత్యానికి ప్రతీకగా వచ్చిన గౌరవం. తల్లిదండ్రులు ఇద్దరూ సంపన్న ఇస్లాం పండితులు! ఆజాద్ ఎన్నడూ బడికి పోలేదు. ఇంటివద్దే... అరబిక్, బెంగాలీ, ఉర్దూ, పర్షియన్, ఆంగ్లాలతో పాటు గణితం, తత్వశాస్త్రం, చరిత్ర, సైన్స్ నేర్చుకున్నారు. ఇరాన్‌లోని యంగ్‌టర్క్ ఉద్యమంతో ప్రభావితుడైన ఆజాద్ ఆంగ్లేయులతో పాటు సంప్రదాయ ముస్లిం నాయకత్వాన్ని కూడా ప్రశ్నించేవారు.
India partition maulana azad: బెంగాల్ విభజనను వ్యతిరేకించిన ఆయన అరబిందోఘోష్ తదితరులతో కలసి విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పత్రికను స్థాపించి... ఆంగ్లేయులను వ్యతిరేకిస్తూ, హిందూ ముస్లిం ఐక్యతను కోరుతూ రాసేవారు. తర్వాత ఖిలాఫత్ ఉద్యమంతో ... గాంధీకి దగ్గరయ్యారు. 1923లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. విద్య, స్వదేశీ, అహింస అంశాల్లో గాంధీజీ ఆలోచనలను ఆచరణలో పెడుతూ, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి కృషి చేశారు. అలా ఎదిగిన ఆజాద్‌ను 1940లో మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి వరించింది. కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో పాకిస్థాన్ ఏర్పాటు ప్రతిపాదనను ఆజాద్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇది రెండు దేశాలకూ ఏమాత్రం మంచిది కాదని తేల్చిచెప్పారు. "విభజనతో రెండు దేశాలూ (భారత్, పాకిస్థాన్) సైనిక సామర్థ్యంపై దృష్టిపెడతాయి. సమాజాభివృద్ధిపై కాదు" అంటూ ముందుచూపుతో హెచ్చరించారు. కాంగ్రెస్‌లోని భిన్నవర్గాలను సమన్వయం చేసుకుంటూ... జిన్నాను, పాకిస్థాన్ డిమాండ్‌ను ఎదుర్కొంటూ ముస్లింలను కూడా ఐక్య భారత్‌కు ఒప్పించటానికి కృషి చేశారు ఆజాద్.