తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసమాన స్త్రీశక్తి అనీబిసెంట్‌.. నాస్తికతతో మొదలై.. భారత 'ఆస్తి'కమై

నాస్తికవాదాన్ని బలపరుస్తూ బలమైన బ్రిటిష్‌ చర్చిపై తిరుగుబాటు చేసింది. జనాభా నియంత్రణపై మాట్లాడి జైలుకెళ్లింది. భర్తకు, కన్నబిడ్డలకూ దూరమైంది. మార్క్సిజం, సోషలిజం, స్వేచ్ఛావాదం.. ఇలా వివిధ దారుల్లో నడిచింది. చివరకు భారత్‌తో ఆధ్యాత్మిక అనుబంధం పెంచుకుంది. కష్టకాలంలో కాంగ్రెస్‌ను నడిపించి జాతీయోద్యమాన్నీ మలుపుతిప్పింది. ఆంగ్లేయులపై బ్రిటన్‌తోపాటు భారత్‌లోనూ అలుపెరగని పోరాటం చేసిన ఆ అసమాన స్త్రీశక్తి అనీబిసెంట్‌.

annie besant inc president
annie besant inc president

By

Published : Jul 14, 2022, 6:37 AM IST

మహిళా సమానత్వం, స్వేచ్ఛల గురించి వందేళ్లకంటే ముందే నినదించిన అనీఉడ్స్‌ 1847 అక్టోబరు 1న లండన్‌లో ఐరిష్‌ కుటుంబంలో జన్మించారు. 1867లో క్రైస్తవ మతాచార్యుడు ఫ్రాంక్‌ బిసెంట్‌ను పెళ్లాడి, ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. బ్రిటిష్‌ సమాజంపై నాటి చర్చి పెత్తనాన్ని ప్రశ్నించారు. జాతీయ లౌకికవాద సంఘంలో, ఫేబియన్‌ సోషలిస్టు సొసైటీలో చేరి ఉద్యమాలు చేశారు. ఈ ప్రస్థానంలో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొని 1873లో భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. తర్వాత లండన్‌లో నేషనల్‌ రిఫార్మర్‌ వారపత్రిక సహ సంపాదకురాలిగా జాతీయ విద్య, కార్మిక సంఘాలు, మహిళలకు ఓటు హక్కు, గర్భ నిరోధం తదితరాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. ఆమెవి ఎంతో ఆధునికమైన భావాలు. జనాభా నియంత్రణలో భాగంగా గర్భనిరోధంపై అనీబిసెంట్‌ తన సహసంపాదకుడు చార్లెస్‌ బ్రాడ్‌ లాతో కలిసి రాసిన గ్రంథాన్ని చర్చి అసభ్యమైందిగా పరిగణించింది. వారిని కోర్టుకు లాగింది. చివరకు చర్చి ఆరోపణ వీగిపోయింది.

లండన్‌లోని ఒక అగ్గిపెట్టెల కర్మాగారంలో 1888లో మహిళా కార్మికులు మెరుగైన పని పరిస్థితుల కోసం అనీబిసెంట్‌ సమ్మె నిర్వహించారు. అగ్గిపెట్టెల తయారీలో వాడే భాస్వరంతో తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయనీ, యాజమాన్యం ఇచ్చే అరకొర జీతాలు సరిపోవడం లేదనే వారి డిమాండ్లకు అనీబిసెంట్‌ మద్దతిచ్చి.. కోర్టులో గెలిచారు. లండన్‌ రేవు కార్మికుల సమ్మెలోనూ విజయం సాధించారు. 1875లో అనీబిసెంట్‌కు థియోసాఫికల్‌(దివ్యజ్ఞాన) ఉద్యమంపై ఆసక్తి ఏర్పడింది. ప్రాచీన గ్రీకు, బౌద్ధ, హిందూ సంప్రదాయాలను ఇముడ్చుకున్న ఉద్యమమిది. ఇదే ఉద్యమం అనీబిసెంట్‌ను 1893లో భారత్‌కు తీసుకొచ్చి మనదేశ సాంఘిక, సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేసేలా చేసింది. భారత్‌లో ఆధునిక విద్యా వికాసానికి 1898లో వారణాసిలో మదన్‌మోహన్‌ మాలవీయతో కలిసి ఆమె ప్రారంభించిన సెంట్రల్‌ హిందూ స్కూల్‌ అండ్‌ కాలేజ్‌ కాలక్రమంలో సుప్రసిద్ధ బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంగా ఎదిగింది. బాలికల కోసమూ సెంట్రల్‌ హిందూ స్కూల్‌ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలోనూ కళాశాలను స్థాపించారు.

రాజకీయ సమరం:భారత్‌ స్వతంత్ర దేశంగా మారితే, ఇక్కడి జ్ఞాన సంపద యావత్‌ ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తుందనే నమ్మకంతో అనీబిసెంట్‌ 1913 నుంచి భారత రాజకీయాల్లో పాల్గొనసాగారు. అతివాద, మితవాద శిబిరాలుగా విడిపోయిన కాంగ్రెస్‌ను మళ్లీ ఒకే వేదికపైకి తెచ్చిన ఘనత ఆమెదే. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు అందులో గెలవడానికి బ్రిటిష్‌ పాలకులు భారతీయుల మద్దతు కోరారు. భారతీయ సైనికులు యుద్ధంలోకి దూకి ప్రాణత్యాగం చేస్తున్నా, తెల్లదొరలు మాటమాత్రంగానైనా కృతజ్ఞత తెలపలేదు. దీన్నిచూసి మండిపడిన అనీబిసెంట్‌ 1916లో బాలగంగాధర్‌ తిలక్‌తో కలసి హోమ్‌ రూల్‌ ఉద్యమం ప్రారంభించారు. భారత్‌కు స్వరాజ్యం సిద్ధించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశమంతటా విస్తరిస్తుండటం వల్ల అనీబిసెంట్‌ను బ్రిటిష్‌ పాలకులు 1917లో అరెస్టు చేసి ఊటీలో నిర్బంధించారు. కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ల ఆందోళనలతో 3నెలల తర్వాత విడుదల చేశారు. అదే ఏడాది డిసెంబరులో అనీబిసెంట్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

యుద్ధం ముగిశాక కాంగ్రెస్‌లో గాంధీజీ సారథ్యంలో కొత్త నాయకత్వం ఆవిర్భవించింది. సహాయ నిరాకరణోద్యమం చట్ట ధిక్కారాన్ని ప్రోత్సహిస్తుందనే భావనతో అనీబిసెంట్‌ దాన్ని వ్యతిరేకించారు. రాజకీయ సంస్కరణలను సాధించడానికి రాజ్యాంగ సమ్మత పద్ధతులను అనుసరించాలన్నది ఆమె అభిమతం. నాటి నుంచి కాంగ్రెస్‌కు దూరమైనా భారత స్వాతంత్య్ర ఆవశ్యకతపై దేశవిదేశాల్లో పర్యటిస్తూ ప్రసంగాలు చేశారు. తర్వాత ఆమె పూర్తిగా దివ్యజ్ఞాన సమాజంపై దృష్టి పెట్టారు. 1920ల్లో అనీబిసెంట్‌ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిని వెంటబెట్టుకుని అమెరికా వెళ్లారు. ఆయన్ని అభినవ బుద్ధుడిగా ప్రకటించారు. దీన్ని 1929లో కృష్ణమూర్తి తిరస్కరించినా, ఇద్దరి మధ్య అనుబంధం చెదరలేదు. చివరకు ఆమె 1933లో చెన్నైలో కన్నుమూశారు.

ఇవీ చదవండి:

డ్రగ్స్​ పొట్లాలు కడుతున్న వీడియో వైరల్.. పోలీసులు ఏం చేశారంటే...

'బుల్డోజర్లతో కూల్చివేతలను నిషేధించలేం.. అది పూర్తిగా వారి పరిధిలోని అంశం'

ABOUT THE AUTHOR

...view details