కాంగ్రెస్ అసంతృప్త నేతగులాం నబీ ఆజాద్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు.తాను 'ఛాయ్‌వాలా' అని మోదీ గర్వంగా చెప్పుకుంటారని, ఆయన గతాన్ని ఎప్పుడూ దాచుకోరని కొనియాడారు. జమ్ములో గుర్జార్ దేశ్ సేవా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాను కూడా మోదీలానే గతాన్ని చెప్పుకోవటానికి సంకోచించనన్నారు. తాను పల్లె నుంచి వచ్చానని.. అందుకు గర్వంగా ఉందన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం సహా, నాలుగు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మోదీపై.. ఆజాద్ చేసిన ప్రశంసలు కురిపించటం ప్రాధాన్యం సంతరించుకుంది.
" చాలా మంది రాజకీయ నేతల్లో కొన్ని అంశాలు నాకు నచ్చుతాయి. మన ప్రధాని( నరేంద్ర మోదీ) పల్లె నుంచి వచ్చారు. ఛాయ్ అమ్మారు. మేమిద్దరం పార్టీల పరంగానే ప్రత్యర్థులం. మోదీ.. తన గతాన్ని ఎప్పుడూ దాచుకోరు. దానికి నేను అభినందిస్తున్నాను. నేను ప్రపంచం మొత్తం పర్యటించాను. 5 స్టార్, 7 స్టార్ హోటళ్లలో బస చేశాను. కానీ నా గ్రామ ప్రజల ఆనవాలు అసమానమైనవి."
- గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేత
జమ్ములో గుర్జార్ దేశ్ సేవా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆజాద్‌ను 'షేర్-ఈ-గుర్జార్' పతకంతో సత్కరించింది సంస్థ యాజమాన్యం.