Azad Praises Modi: ప్రధాని మోదీ కఠిన హృదయం కలిగిన వ్యక్తి అని మొదట్లో తాను భావించానని ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన గులాం నబీ ఆజాద్ అన్నారు. ఓ ఘటనతో ఆయన సున్నిత హృదయాన్ని గ్రహించానని తెలిపారు. కాంగ్రెస్‌తో ఎన్నోఏళ్లుగా ఉన్న బంధాన్ని తెంచుకున్న ఆజాద్.. తాజాగా ప్రధానికి, తనకు మధ్య జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
గత ఏడాది గులాం నబీ ఆజాద్ రాజ్యసభ పదవీకాలం ముగిసింది. ఆ వీడ్కోలు కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు. దానిపై తాజాగా ఆజాద్ స్పందించారు. 'ఆయన ప్రసంగ సారాన్ని ఒకసారి చదవండి. నా వీడ్కోలులో.. ఒక ఘటన గురించి చెప్తూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. 2006లో నేను జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ సమయంలో జరిగిన గ్రనేడ్ దాడిలో గుజరాత్ నుంచి వచ్చిన కొందరు పర్యాటకులు మరణించారు. ఆ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ నా కార్యాలయానికి ఫోన్ చేశారు. ఆ దాడితో అప్పటికే ఆవేదనకు గురయ్యాను. ఈ హత్యల వెనుక ఉన్న క్రూరత్వం చూసి ఏడుపొచ్చేసింది. నేను ఆయనతో మాట్లాడలేకపోయాను. సిబ్బంది ఫోన్‌ను నాకు దగ్గరగా పెట్టడం వల్ల.. మోదీకి నా దుఃఖం వినిపించింది. ఆయన అప్‌డేట్స్ కోసం వరుసగా ఫోన్లు చేశారు. తర్వాత మృతులు, గాయపడిన వారిని తరలించే క్రమంలో కూడా నాకు కన్నీరు ఆగలేదు. అదంతా టీవీలో వచ్చింది. అది చూసి ఆయన కాల్ చేసినా.. నేను మాత్రం మాట్లాడలేకపోయాను. అదే విషయాన్ని నా వీడ్కోలు వేళ మోదీ గుర్తు చేసుకున్నారు. మోదీ ఎంతో కఠిన హృదయుడని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ఆయనకు భార్య, పిల్లలు లేకపోవడంతో దేనిని పట్టించుకోరనుకున్నాను. కానీ ఆయన మానవత్వాన్ని ప్రదర్శించారు' అని ఆజాద్ వివరించారు.