స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్ముడి సారథ్యంలోని అహింసా ఉద్యమంతో పాటు... బ్రిటిష్ ప్రభుత్వాన్ని బాగా కలవర పెట్టింది- ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ-ఐఎన్‌ఏ)! సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఈ సైన్యం నేరుగా స్వాతంత్య్రాన్ని సాధించకున్నా ఆ దిశగా తనదైన ముద్రవేసింది. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో గదర్ ఉద్యమంలో పాల్గొని జపాన్ వెళ్లిన రాస్ బిహారీ బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్(Azad Hind Fauj)-ఐఎన్‌ఏను 1942 సెప్టెంబరు 1న స్థాపించారు. భారత్‌కు స్వాతంత్య్రం సంపాదించటం దీని లక్ష్యం. మలయా (ప్రస్తుత మలేసియా), బర్మాల్లో జరిగిన యుద్ధాల్లో బ్రిటన్ తరఫున పాల్గొంటూ జపాన్ చేతికి చిక్కిన భారతీయ సైనికులు సుమారు 50వేల మందితో రాస్ బిహారీ సారథ్యంలో ఐఎన్‌ఏ ఏర్పాటైంది.
సుభాష్ చేతిలో పునరుద్ధరణ
ఐఎన్‌ఏ ఏర్పాటైన నాలుగునెలల్లోనే జపాన్‌తో కలసి యుద్ధాల్లో పాల్గొనటంపై విభేదాలు తలెత్తాయి. దీంతో... రాస్ బిహారీ బోస్ ఐఎన్‌ఏ బాధ్యతలను పూర్తిగా సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించారు. 1943లో సుభాష్ సారథ్యంలో దీన్ని పూర్తిగా పునరుద్ధరించారు. జాతీయోద్యమ నాయకులు గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్, సుభాష్‌ల పేరిట దళాలు ఏర్పాటు చేశారు. మహిళాదళానికి ఝాన్సీ లక్ష్మీబాయి పేరు పెట్టారు. జపాన్ సైన్యంతో కలసి వీరంతా బ్రిటిష్ సైన్యాలకు వ్యతిరేకంగా బర్మా, ఇంఫాల్, కోహిమా ప్రాంతాల్లో యుద్ధం చేశారు. ఐఎన్‌ఏకు జర్మనీ, ఇటలీ, జపాన్‌ల గుర్తింపు, మద్దతు లభించింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం కలవరపడింది. జపాన్‌పై అణుబాంబుతో రెండో ప్రపంచయుద్ధం ముగియటం... జపాన్ ఓడిపోవటంతో ఐఎన్‌ఏ భవితవ్యం మసకబారింది. 1945 ఆగస్టు విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయారనే వార్తతో కథ ముగిసింది. అనేక మంది ఐఎన్‌ఏ సైనికులను బ్రిటిష్ ప్రభుత్వం విచారించి శిక్షలు విధించింది.