Azad Hind Fauj: ఆజాద్ హింద్ ఫౌజ్... జపాన్ సేనలతో కలసి ఆంగ్లేయులపై పోరాటం చేసిన కాలంలో రాని పేరు ఆ తర్వాత వచ్చింది. అది ఐఎన్‌ఏ ఖైదీల విచారణ సందర్భంగా! రెండో ప్రపంచయుద్ధానంతరం సుమారు 23 వేల మంది ఫౌజ్ సైనికులను బ్రిటన్ బందీలుగా పట్టుకుంది. వారిపై.. దేశద్రోహం, హత్యా నేరాలు మోపింది. 1945 నవంబరు నుంచి 1946 మే వరకు సాగిన విచారణలు యావద్దేశ ప్రజల దృష్టినీ ఆకర్షించాయి. వీటిలో కర్నల్ ప్రేమ్ సెహగల్, కర్నల్ గుర్‌బక్ష్‌సింగ్ థిల్లాన్, మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్‌లపై తొలి జాయింట్ కోర్టు మార్షల్ ఎర్రకోటలో జరిగింది. ముగ్గురూ బ్రిటిష్ భారత సైన్యంలో పనిచేసి తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరి.. మలయా, సింగపూర్, బర్మాల్లో ఆంగ్లేయులపై పోరాడారు.
ప్రపంచ యుద్ధ సమయంలో ఐఎన్‌ఏ పోరాట వార్తలపై ఆంక్షలుండేవి. ఈ విచారణ సందర్భంగా సుభాష్‌చంద్రబోస్ సేన వీరోచిత గాథలు బయటకు వచ్చి.. పత్రికల ద్వారా ప్రజలకు తెలిశాయి. దీంతో ‘ఐఎన్‌ఏ విచారణ’పై దేశం నలుమూలలా ఆసక్తి పెరిగింది. ఎక్కడ చూసినా అదే చర్చ. ఎవరు కలిసినా ఐఎన్‌ఏ గురించిన మాటే! ఐఎన్‌ఏ సిపాయిలకు మద్దతుగా ఊరేగింపులు, ధర్నాలు, సమ్మెలతో దేశమంతా అట్టుడుకిపోయింది. అప్పటికి మతకలహాలతో, దేశవిభజన డిమాండ్లతో శత్రువుల్లా కొనసాగుతున్న కాంగ్రెస్-ముస్లింలీగ్‌లు దేశవ్యాప్తంగా కలసి నడిచాయి. ఐఎన్‌ఏ సైనికులకు మరణశిక్ష విధిస్తే.. ప్రతీకారంగా ప్రతి సైనికుడికి 25 మంది యూరోపియన్ల చొప్పున చంపుతామంటూ పోస్టర్లు వెలిశాయి. ఐఎన్‌ఏ సైనికుల కోసం నిధులు ఏర్పాటయ్యాయి. విరాళాలు మొదలయ్యాయి. చివరకు.. బ్రిటన్‌కు సేవ చేస్తున్న భారత సైనికులు కూడా భయపడకుండా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించే దశకు చేరింది. అదే సమయంలో.. నౌకా, వైమానిక దళాల్లో తిరుగుబాటు మొదలైంది. మద్రాసు, పుణేెల్లోని సైన్యంలో భారతీయ సిపాయిలు ఆంగ్లేయ అధికారుల ఆదేశాలు పాటించటం మానేశారు. ఐఎన్‌ఏ సైనికుల తరఫున వాదించేందుకు కాంగ్రెస్ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. భులాభాయ్ దేశాయ్, తేజ్‌బహదూర్ సప్రూ, కైలాశ్‌నాథ్ కట్జు, లెఫ్టినెంట్ కర్నల్ హరిలాల్ వర్మ, శరత్‌చంద్రబోస్, అసఫ్‌అలీలతో పాటు జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా నల్లకోటు వేసుకొని రంగంలోకి దిగారు.