తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అందరికీ విద్య.. అంబేడ్కర్‌కు అండ.. ఈ మహారాజు చలవే! - దాదాబాయి నౌరోజీ

1871లో వారసత్వ గొడవలతో బరోడా సంస్థానం అనిశ్చితిలో పడింది. రాణి జమునాబాయి ఓ అబ్బాయిని (గోపాలరావు) దత్తత తీసుకొని సయాజీరావుగా నామకరణం చేశారు. చదువు అంతగా లేని ఆ కుర్రాడు తమ చెప్పుచేతల్లో ఉంటాడని బ్రిటిషర్లూ భావించారు. కానీ ఆ తర్వాత వారి అంచనాలను ఆయన తలకిందులు చేశారు. ఆయనే బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్‌-3.

Sayajirao Gaekwad III special story
బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్‌-3.

By

Published : Sep 3, 2021, 10:18 AM IST

బ్రిటిష్‌ కాలంలో చాలా సంస్థానాల మహారాజులు స్వేచ్ఛను అనుభవించినా.. అది పాక్షికమే! తెల్లదొరలకు భయపడుతూనో, వారి అడుగులకు మడుగులొత్తుతూనో ఉండేవారు. ఒక మహారాజు మాత్రం బ్రిటిష్‌వారితో చాకచక్యంగా వ్యవహరిస్తూ.. తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ.. పాలనలో సైతం తెల్లవారు తెల్లబోయేలా ప్రగతిశీలకంగా వ్యవహరించారు. ఆయనే బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్‌-3.

సయాజీరావు గైక్వాడ్‌-3

1871లో వారసత్వ గొడవలతో బరోడా సంస్థానం అనిశ్చితిలో పడింది. రాణి జమునాబాయి ఓ అబ్బాయిని (గోపాలరావు) దత్తత తీసుకొని సయాజీరావుగా నామకరణం చేశారు. చదువు అంతగా లేని ఆ కుర్రాడు తమ చెప్పుచేతల్లో ఉంటాడని బ్రిటిషర్లూ భావించారు. కానీ ఆ తర్వాత వారి అంచనాలను ఆయన తలకిందులు చేశారు. ప్రగతిశీల ఆలోచనలతో బరోడాను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. బాల్య వివాహాల రద్దు, వితంతు పునర్‌ వివాహాలకు ప్రోత్సాహం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏర్పాటు, 1907 నాటికే అందరికీ ఉచితంగా ప్రాథమిక విద్యలాంటి నిర్ణయాలు ఆయన ప్రత్యేకత!

తాను ఏర్పాటు చేసిన కళాశాలల్లో అనేక మంది నిపుణులను, విద్యావంతులను తీసుకొచ్చారు. వారిలో అరబిందో ఒకరు. దాదాబాయి నౌరోజీ కూడా ఆయన వద్ద దివాన్‌గా పనిచేశారు. విదేశాల్లో చదువుకోవటానికి అంబేడ్కర్‌కు ఆర్థిక సాయం చేసింది కూడా ఈ మహారాజే. అంతకుముందు.. జ్యోతిరావుఫులేకూ ఆర్థిక సాయం పంపించారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఇప్పటికీ సమర్థంగా సాగుతోంది. విద్యాలయాలు విశ్వవిద్యాలయాలుగా ఎదిగాయి. జాతీయ ఉద్యమానికీ ఆయన సాయం చేశారు.

దిల్లీ దర్బారులో..

1911లో తొలిసారి భారత్‌ వచ్చిన బ్రిటన్‌ చక్రవర్తి జార్జి-5 గౌరవార్థం దిల్లీ దర్బారులో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి మహారాజు రాజలాంఛనాలతో ఠీవిగా రావాలంటూ బ్రిటిష్‌ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. అన్నింటికి మించి మూడుసార్లు తల వంచి చక్రవర్తికి సలాం చేయాలని, వెన్ను చూపకుండా వెనక్కి నడుస్తూ వెళ్ళాలని ఆదేశించింది. సయాజీరావు మాత్రం హంగామా లేకుండా సాదాసీదాగా వచ్చారు. ఇది తెల్లదొరలకు ఆగ్రహాన్ని తెప్పించింది. పుండుమీద కారంలా.. చక్రవర్తికి మూడుసార్లు వంగి సలాం చేయాలంటే సయాజీరావు దాన్నీ ఉల్లంఘించారు. ఒకేసారి.. అదీ సగమే తల వంచి సలాం చేసి వెంటనే వెనుదిరిగి చక్రవర్తికి వెన్ను చూపిస్తూ వచ్చి తన సీట్లో కూర్చున్నారు. దీనిపై బ్రిటిష్‌ అధికారుల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. మొత్తానికి ఎలాగోలా తన చాకచక్యంతో సయాజీరావు గైక్వాడ్‌ ఈ వివాదం నుంచి బయటపడ్డారు.

ఇదీ చూడండి: ఇక నుంచి సార్‌, మేడమ్ వద్దు.. చేటన్‌, చేచి అంటే చాలు!

ABOUT THE AUTHOR

...view details