Ayodhya Tent City In UP :అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రామానికి రానున్న ప్రముఖుల కోసం ఉత్తర్‌ప్రదేశ్ పర్యాటక శాఖ టెంట్ సిటీని నిర్మించింది. ఇందులో ఎన్నో హైటెక్ సదుపాయాలను కల్పించింది. ఇక్కడ నిర్మించిన కాటేజీలను వీవీఐపీల బస కోసం కేటాయించనున్నారు. ముఖ్యంగా రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖుల కోసం ఇందులో సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు.
ప్రముఖుల కోసం మాత్రమే
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాజకీయ నాయకులతో పాటు సినీ, వ్యాపార ప్రముఖులు రానున్నారు. అందుకే ఆ రాష్ట్ర పర్యాటక శాఖ వీవీఐపీల కోసం ఆధునిక సౌకర్యాలతో టెంట్ సిటీని నిర్మించింది. నిషాద్‌రాజ్ అతిథిగృహ్ పేరిట నిర్మించిన ఈ టెంట్ సిటీలో అత్యాధునిక వసతులను కల్పించారు. ఈ టెంట్ సిటీలో మెుత్తం 4 కాటేజీలను నిర్మించారు. ప్రముఖుల స్థాయిని అనుసరించి, వారికి గదులు కేటాయించనున్నారు. పటిష్ట భద్రత కోసం నిషాద్‌రాజ్ అతిథిగృహాల వద్ద సీసీటీవీలను కూడా అమర్చారు. అంతేకాదు టెంట్ సిటీలోని గదుల్లో ప్రముఖుల సౌకర్యార్థం బెడ్లు, ఏసీలు, ఇంటర్నెట్ లాంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఏర్పాట్లు
భోజనాల కోసం సీతా రసోయి, శబరి రసోయి అనే రెండు డైనింగ్ హాళ్లను నిర్మించారు. ఒకటి వీవీఐపీల కోసం కాగా, మరొకటి వీఐపీల కోసం కేటాయించారు. డైనింగ్ హాళ్ల ప్రవేశ ద్వారాల వద్ద రామాయణంలోని కొన్ని కీలక ఘట్టాలను చిత్రాల రూపంలో ఉంచారు. పరిసరాల్లో రాముడు విల్లు పట్టుకొని ఉన్న విగ్రహం, పాదకులను ఏర్పాటు చేశారు. రోజుకు 500 మంది ఈ డైనింగ్ హాళ్లలో భోజనం చేసేందుకు వీలుంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖుల వివరాలు తమకు ఇంకా అందలేదని పర్యాటక శాఖ వాటిని ఖరారు చేస్తుందని వెల్లడించారు. రెండు రోజుల్లో టెంట్ సిటీకి సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయని వివరించారు. టెంట్ సిటీ భద్రత కోసం కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. ప్రముఖులు సరదాగా ముచ్చటించుకోవడానికి టెంట్ సిటీ మధ్యలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.